7
1 ఇది యెహోవా నుంచి యిర్మీయాకు వచ్చిన వాక్కు:
2 “యెహోవా ఆలయం ద్వారంలో నిలబడి ఇలా ప్రకటన చెయ్యి: యెహోవాను ఆరాధించడానికి ఈ ద్వారాలగుండా వచ్చే యూదావారలారా, మీరందరూ యెహోవా సందేశం వినండి. 3 ఇస్రాయేల్ యొక్క దేవుడూ సేనల ప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, మీరు మీ జీవిత విధానాలను, చర్యలను సరిదిద్దుకొంటే, నేను మిమ్మల్ని ఈ స్థలంలో ఉండనిస్తాను. 4 మోసపు మాటలను నమ్ముకొని, ‘యెహోవా మందిరం, యెహోవా మందిరం, యెహోవా మందిరం’ అనవద్దు. 5  మీరు నిజంగా మీ జీవిత విధానాలను, చర్యలను సరిదిద్దుకొంటే – ఒకరిపట్ల ఒకరు న్యాయంతో వ్యవహరిస్తే, 6 విదేశీయులను గానీ తండ్రిలేనివారిని గానీ వితంతువులను గానీ అణగద్రొక్కకుండా ఉంటే, నిరపరాధుల రక్తం ఒలికించకుండా ఉంటే, మీకు హాని కలిగించే ఇతర దేవుళ్ళను అనుసరించకుండా ఉంటే, 7 అప్పుడు నేను మిమ్మల్ని ఈ స్థలంలో ఉండనిస్తాను, నేను మీ పూర్వీకులకు శాశ్వతమైన సొత్తుగా వచ్చిన ఈ దేశంలో కాపురముండనిస్తాను.
8 “అయితే మీరు పనికిమాలిన మోసపు మాటలు నమ్ముతున్నారు. 9 మీరు దొంగతనం, హత్య, వ్యభిచారం చేస్తూ, ప్రమాణం చేసి అబద్ధం చెపుతూ, బయల్‌దేవుడికి ధూపం వేస్తూ, మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ ఉండగానే, 10 నా పేరున్న ఈ ఆలయానికి వచ్చి, నా ఎదుట నిలబడి, అపాయంనుంచి తప్పించుకొన్నాం అంటారేం? మీరు విడుదల పొందినది ఈ అసహ్య కార్యాలను చేయడానికేనా? 11  నా పేరున్న ఈ ఆలయం మీ దృష్టికి దొంగల గుహగా అయిందా? మీ పనులను చూశాను సుమా! అని యెహోవా చెపుతున్నాడు.
12 “మొట్టమొదట షిలోహులో నా పేరుకోసం కట్టడాన్ని కట్టించుకొన్నాను. ఆ స్థలానికి వెళ్ళి, నా ప్రజ ఇస్రాయేల్ వాళ్ళ చెడ్డతనానికి నేను ఏం చేశానో చూడండి. 13 ఇది యెహోవా వాక్కు – మీరు ఆ కార్యాలన్నీ చేస్తూ ఉంటే, నేను ప్రొద్దున్నే లేచి మాట్లాడాను గాని, మీరు చెవిని పెట్టలేదు. మిమ్మల్ని పిలిచాను గాని, మీరు జవాబివ్వలేదు. 14 అందుచేత మీరు నమ్ముకొన్న, నా పేరున్న ఈ ఆలయానికీ, నేను మీ పూర్వీకులకూ మీకూ ఇచ్చిన ఈ స్థలానికీ, షిలోహుకు చేసినట్టు చేస్తాను. 15 మీ బంధువులైన ఎఫ్రాయిం సంతతివాళ్ళందరినీ నా ఎదుటనుంచి వెళ్ళగొట్టినట్టే మిమ్మల్ని వెళ్ళగొట్టివేస్తాను.
16 “ఈ ప్రజకోసం ప్రార్థించకు. విన్నపం, ప్రార్థన చేయకు. వాళ్ళ పక్షాన నాతో వాదించకు. నేను వినను. 17 వాళ్ళు యూదా పట్టణాలలో జెరుసలం వీధుల్లో ఏం చేస్తూ ఉన్నారో నీవు చూడడం లేదా? 18 పిల్లవాళ్ళు కట్టెలు ఏరుతారు, వాళ్ళ తండ్రులు నిప్పు రాజబెడతారు, స్త్రీలు పిండి పిసికి, ‘ఆకాశరాణి’ అనే దేవతకు పిండివంటలు చేస్తారు. నన్ను దుఃఖ పెట్టాలని ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పిస్తారు. 19 నన్నే వాళ్ళు దుఃఖ పెడతారా? తమకే హాని చేసుకొని అవమానం చెందడం లేదా? అని యెహోవా అంటున్నాడు. 20 అందుచేత యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఈ స్థలంమీద – మనుషులమీద, పశువులమీద, మైదానంలో చెట్లమీద, భూఫలంమీద – నా ఆగ్రహాన్ని, కోపాగ్నిని కుమ్మరిస్తాను. ఆర్పడానికి వీలు కాకుండా అది మండుతూ ఉంటుంది.
21 “ఇస్రాయేల్ ప్రజల దేవుడూ సేనలప్రభువూ అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు: మీ హోమాలనూ ఇతర బలులనూ కలగలుపు చేసి ఆ మాంసమంతా మీరే తినండి! 22 మీ పూర్వీకులను నేను ఈజిప్ట్‌నుంచి బయటికి తీసుకువచ్చిన రోజున హోమాలను, బలులను గురించి వారితో చెప్పలేదు, ఆజ్ఞ ఇవ్వలేదు. 23 నేను వారికిచ్చిన ఆజ్ఞ ఇది: నా వాక్కుకు లోబడి ఉండండి. అప్పుడు నేను మీకు దేవుడై ఉంటాను. మీరు నా ప్రజలై ఉంటారు. మీకు క్షేమం కలిగేలా నేను మీకు ఆజ్ఞాపించే మార్గంలో మీరు సంపూర్ణంగా నడవాలి.”
24 “అయితే వారు నా మాట వినలేదు. పెడచెవిని పెట్టి, తమకు మంచిదని తోచినట్టు వారి చెడ్డ హృదయంవచనంలో ఉన్న మూర్ఖత్వాన్ని అనుసరించారు. ముందుకు సాగక వెనక్కే వెళ్ళారు. 25 మీ పూర్వీకులు ఈజిప్ట్‌నుంచి బయటికి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకూ నేను నా సేవకులైన ప్రవక్తలను అందరినీ పంపిస్తూ వచ్చాను. ప్రొద్దున్నే లేచి వారిని పంపాను. 26 వారు పెడచెవిని పెట్టి నా మాట వినలేదు. వారు తలబిరుసుగా ఉన్నారు. వాళ్ళు తమ పూర్వీకులకంటే ఎక్కువగా చెడుగు చేశారు.
27 “నీవు ఈ మాటలన్నీ వాళ్ళతో చెప్పాలి గాని, వాళ్ళు వినరు. నీవు వాళ్ళను పిలవాలి గాని, వాళ్ళు నీకు బదులు చెప్పరు. 28 అప్పుడు నీవు వాళ్ళతో ఇలా అనాలి: ఈ జనం తమ దేవుడైన యెహోవా వాక్కుకు లోబడలేదు. క్రమశిక్షణ అంగీకరించలేదు. సత్యం వాళ్ళ నోట లేకుండా నాశనమైపోయింది. 29 ఈ తరంవాళ్ళు యెహోవా కోపానికి గురి అయ్యారు. ఆయన వాళ్ళను విసర్జించి విడిచిపెట్టాడు. కనుక నీ తలవెండ్రుకలు కత్తిరించుకొని వాటిని పారవెయ్యి. చెట్లులేని ఎత్తు స్థలాల్లో రోదనం చెయ్యి.”
30  యెహోవా చెప్పేదేమిటంటే, “యూదాప్రజలు నా దృష్టిలో చెడుగు చేశారు. నా పేరున్న ఆలయంలో తాము ఎన్నుకొన్న అసహ్యమైన విగ్రహాలను నిలబెట్టి దానిని అశుద్ధం చేశారు. 31 తమ కూతుళ్ళనూ కొడుకులనూ మంటల్లో కాల్చివేయడానికి వాళ్ళు బెన్‌హిన్నోం లోయలో ఉన్న తోఫెతులో ఎత్తు స్థలాలు కట్టారు. ఈ విషయం నేను ఆజ్ఞాపించలేదు. అది నా మనసుకు కూడా రాలేదు. 32  అందుచేత యెహోవా చెప్పేదేమిటంటే, ఒక కాలం రాబోతున్నది. ఆ కాలంలో ఆ లోయను ‘తోఫెతు’ గానీ ‘బెన్‌హిన్నోం’ గానీ అనరు. దానిని ‘వధలోయ’ అంటారు. ఎందుకంటే, తోఫెతులోనే ఇంకా చోటు లేకపోయేంతవరకూ శవాలు పాతిపెడతారు. 33 అప్పుడు ఈ ప్రజల శవాలు గాలిలో ఎగిరే పక్షులకూ, భూమిమీద తిరిగే జంతువులకూ ఆహారమవుతాయి. వాటిని బెదరించి వెళ్ళగొట్టడానికి ఎవరూ ఉండరు. 34 ఈ దేశం పాడైపోతుంది. యూదా పట్టణాలలో, జెరుసలం వీధుల్లో ఆనంద ధ్వనులు, ఉత్సాహ ధ్వనులు, పెండ్లికొడుకు పెండ్లికూతురుల స్వరాలు లేకుండా చేస్తాను.”