6
1 “బెన్యామీను వంశంవారలారా!జెరుసలం నుంచి పారిపోండి!
తెకోవలో పొట్టేలు కొమ్ము ఊదండి!
బేత్‌హకెరెంలో గుర్తును పెట్టండి!
ఎందుకంటే, ఉత్తర దిక్కు✽నుంచి విపత్తు
వస్తూ ఉంది.
గొప్ప నాశనం కలగబోతూ ఉంది.
2 అందంగా నాజూకుగా ఉన్న సీయోను కుమారిని
నేను పూర్తిగా పాడు చేస్తాను.
3 దానిలోకి కాపరులు✽ మందలను తోలుకువస్తారు,
దాని చుట్టూరా తమ డేరాలు వేసుకొంటారు.
ఒక్కొక్కరు తమకు ఇష్టం వచ్చినచోట
మందను మేపుతారు.”
4 ✽“దానిమీదికి యుద్ధానికి సిద్ధం కండి!
మధ్యాహ్నం దాని పైబడుదాం! లెండి!
అయ్యో, ప్రొద్దు క్రుంకుతూ ఉంది.
సందెచీకటి నీడలు ఎక్కువవుతున్నాయి.
5 రాత్రి పూట లేచి దానిపైబడి దాని కోటలను
నాశనం చేద్దాం.”
6 ✽సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే,
“చెట్లు నరికివేయండి. జెరుసలం చుట్టూ
ముట్టడి వేయండి.
ఈ నగరం నిండా దురన్యాయం ఉంది.
గనుక అది శిక్షకు గురి కావాలి.
7 ✽ఊటలోనుంచి జలాలూరినట్లు దానిలోనుంచి
దాని చెడుగు పెల్లుబుకుతూ ఉంటుంది.
దానిలో దౌర్జన్యం, బలాత్కారం చప్పుడు
వినబడుతూ ఉంది.
దానిలో ఉన్న గాయాలు, దెబ్బలు
ఎప్పుడూ నాముందే ఉన్నాయి.
8 ✽జెరుసలం! హెచ్చరిక పాటించు;
లేదా, నీ విషయం నా మనసు విరిగి,
నిన్ను నాశనం చేసి, నిర్జన ప్రదేశంగా చేసి విడుస్తాను.”
9 ✽సేనలప్రభువు యెహోవా ఇలా చెపుతున్నాడు:
“ఇస్రాయేల్‌ప్రజలో మిగిలినవాళ్ళను ద్రాక్షపండ్లను
పరిగె ఏరినట్టు ఏరుతారు.
ద్రాక్షపండ్లను ఏరేవాడు దాని తీగెలమీద
మళ్ళీ చేయి వేసినట్టు వాళ్ళమీద చేయి వెయ్యి.”
10 ✽వాళ్ళ చెవులు మూత పడినవి. వాళ్ళు వినలేరు.
నేను ఎవరితోను మాట్లాడాలి? ఎవరిని హెచ్చరించాలి?
నేను చెప్పేది ఎవరు వింటారు?
యెహోవా వాక్కు అంటే వాళ్ళకు ఏమీ ఇష్టం లేదు.
వాళ్ళు దానిని తృణీకరిస్తున్నారు.
11 ✽ నేను యెహోవా కోపంతో నిండి ఉన్నాను.
దానిని పట్ట లేనంతగా అలసివున్నాను.
యెహోవా ఇలా చెపుతున్నాడు:
“ఆ కోపాన్ని వీధుల్లో ఉన్న పిల్లలమీద,
యువకుల గుంపులమీద కుమ్మరించు.
భార్యాభర్తలనూ వయసు మళ్లిన ముసలివారినీ
పట్టుకుపోవడం జరుగుతుంది.
12 ఈ దేశంలో నివాసముంటున్న వారిమీద
నా చెయ్యి చాపేటప్పుడు వారి ఇండ్లు,
పొలాలు, వారి భార్యలతోపాటు ఇతరుల వశం అవుతాయి.
13 ✝“వాళ్ళంతా – అల్పులైనా గొప్పవాళ్ళయినా
అన్యాయంగా సంపాదించుకోవాలని చూస్తారు.
ప్రవక్తలు, యాజులు అందరూ మోసంగా ప్రవర్తిస్తారు.
14 ✽ శాంతి లేనప్పుడు ‘శాంతి, శాంతి’ అంటూ వాళ్ళు
నా ప్రజ గాయాన్ని పైపైనే నయం చేస్తున్నారు.
15 ✽తమ అసహ్యమైన ప్రవర్తన కారణంగా
వాళ్ళు సిగ్గుపడ్డారా? సిగ్గుపడనే లేదు.
సిగ్గు అంటే ఏమిటో వాళ్ళకు తెలియదు.
గనుక వాళ్ళు కూలిపోయేవాళ్ళతో కూడా కూలుతారు.
నేను వాళ్ళను దండించేటప్పుడు
వాళ్ళు పడిపోతారు. ఇది యెహోవా వాక్కు.”
16 యెహోవా చెప్పేదేమిటంటే,
“అడ్డుత్రోవల దగ్గర నిలబడి చూస్తూ ఉండండి.
పాత త్రోవలను✽ గురించి అడగండి.
మంచి మార్గమేదో అని అడిగి అందులో
నడుచు కోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి
దొరుకుతుంది.
అయితే వాళ్ళు ‘మేము అందులో నడవమ’ని
బదులు చెప్పారు.
17 ✽నేను మీమీద కావలివారిని నియమించి
‘పొట్టేలు కొమ్ము బూర ధ్వని వినండి’ అన్నాను.
అయితే వాళ్ళు ‘మేము వినమ’ని బదులు చెప్పారు.
18 ఇతర జనాల్లారా! వినండి! సాక్షులారా!
వారికేమి జరగబోతుందో తెలుసుకోండి.
19 భూమి, విను! ఈ ప్రజ నా మాటలు
పెడచెవిని పెట్టారు.
నా ధర్మశాస్త్రాన్ని నిరాకరించారు గనుక వాళ్ళ
దురాలోచనల ఫలంగా వాళ్ళమీదికి విపత్తు
తెప్పిస్తున్నాను.
20 ✽నా జనమా! షేబ ప్రాంతంనుంచి వచ్చే
సాంబ్రాణి ధూపం నాకెందుకు?
మీ హోమాలు నాకు అంగీకారం కావు,
మీ బలులు ఇష్టమైనవి కావు.”
21 అందుచేత యెహోవా చెప్పేదేమిటంటే,
“ఈ ప్రజ ఎదుట అడ్డంకులు ఉంచుతాను.
వాటివల్ల తండ్రులూ కొడుకులూ
ఏకంగా తొట్రుపడతారు.
పొరుగువాళ్ళూ స్నేహితులూ నాశనం అవుతారు.”
22 ✝యెహోవా ఇలా చెపుతున్నాడు:
“ఇదిగో, వినండి: ఉత్తర దేశంనుంచి
ఒక సైన్యం వస్తూ ఉంది.
భూమి కొనలలో బలంగల జనం లేస్తూ ఉంది.
23 ✝వాళ్ళు విండ్లు, ఈటెలు చేతపట్టుకొని
వస్తున్నారు. వాళ్ళు క్రూరులూ, జాలిలేనివాళ్లూ.
వాళ్ళు చేసే చప్పుడు సముద్ర ఘోషలాంటిది.
వాళ్ళు గుర్రాలెక్కి, సైన్యవ్యూహం తీరి ఉన్నారు.
సీయోను కుమారీ, వాళ్ళు నీమీదికి వస్తున్నారు.”
24 ✽ దాని గురించిన వార్త మాకు వినబడింది.
మా చేతులు పడిపొయ్యాయి.
స్త్రీకి కలిగే ప్రసవ వేదనలాంటి బాధ మాకు పట్టుకొంది.
25 పొలానికి వెళ్ళవద్దు, దారిన నడవవద్దు.
ఎందుకంటే శత్రువు చేతిలో కత్తి ఉంది.
ఎటు చూచినా భయం తాండవిస్తుంది.
26 ✝నా ప్రజలారా, అకస్మాత్తుగా నాశనం చేసేవాడు
మనమీదికి వస్తాడు,
గనుక గోనెపట్ట కట్టుకొని, బూడిదలో దొర్లండి.
ఒకే ఒక కొడుకు చనిపోతే శోకించినట్టు శోకించండి.
మహా రోదనం చేయండి.
27 ✽“నీవు నా ప్రజ విధానాలను పరీక్షించి తెలుసుకోవాలని
వారిమధ్య నిన్ను నాణ్యం చూచేవాడులాగా,
లోహం పరీక్షించే వాడులాగా నియమించాను.
28 వాళ్ళంతా బాగా తిరుగుబాటు చేసేవాళ్ళు,
చాడీకోరులు. వాళ్ళు ఇనుము ఇత్తడిలాంటివాళ్ళు.
వాళ్ళంతా వినాశకారులు.
29 నిప్పులో సీసం కరిగిపోయేలా కొలిమి తిత్తులు
బాగా ఊదుతూ ఉన్నాయి.
అయితే శుద్ధి క్రియ వ్యర్థంగా సాగుతూ ఉంది –
దుర్మార్గులు వేరుపడడం లేదు.
30 యెహోవా వాళ్ళను విసర్జించాడు గనుక వాళ్ళను
‘విసర్జించిన వెండి’ అంటారు.”