5
1 యెహోవా అంటున్నాడు “జెరుసలం వీధుల్లో
అటూ ఇటూ తిరుగుతూ, చూచి బాగా గమనించండి.
దాని రాజ వీధుల్లో గాలించండి. న్యాయాన్ని జరిగిస్తూ,
సత్యాన్ని వెదకుతూ ఉండేమనిషి ఒక్కడైనా దొరికితే
నేను ఈ నగరాన్ని క్షమిస్తాను.
2 వాళ్ళు ‘యెహోవా జీవంతోడు’
అని చెపుతారు గాని, మోసంగా ఒట్టు పెట్టుకొంటారు.”
3  యెహోవా! యథార్థతను చూడాలనే
కోరుతున్నావు గదా.
నీవు వాళ్ళను కొట్టావు గాని, వాళ్ళు లక్ష్యముంచలేదు.
వాళ్ళను క్షీణదశకు తెచ్చావు గాని,
వాళ్ళు దిద్దుబాటును వ్యతిరేకించారు.
రాతికంటే తమ ముఖాలు కఠినం చేసుకొని
నీవైపు తిరగడానికి ఒప్పుకోలేదు.
4 నేను ఇలా అనుకొన్నాను.
“వీళ్ళు తెలివితక్కువ బీదవాళ్ళు.
యెహోవా మార్గం, తమ దేవుని న్యాయం
వాళ్ళకు తెలియదు.
5 నేను పెద్దలదగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతాను.
వాళ్ళకు యెహోవా మార్గం, తమ దేవుని
న్యాయం తెలుసు గదా.”
అయితే వాళ్ళందరూ కూడా కాడిని విరగగొట్టేవాళ్ళు,
కట్లు తెంపివేసేవాళ్ళు.
6  అందుచేత అడవినుంచి సింహం వచ్చి
వాళ్ళపైపడుతుంది.
ఎడారినుంచి తోడేలు వచ్చి వాళ్ళను చీల్చివేస్తుంది.
చిరుతపులి వాళ్ళ పట్టణాలదగ్గర పొంచి ఉంటుంది.
వాటినుంచి బయటికి వెళ్ళే ప్రతి ఒక్కరినీ
ముక్కలుగా చీరేస్తుంది.
ఎందుకంటే వాళ్ళ అక్రమ కార్యాలు అనేకం.
చాలాసార్లు వాళ్ళు త్రోవ తప్పిపోయారు.
7 “నేను నిన్ను ఎందుకు క్షమించాలి?
నీ ప్రజలు నన్ను వదలిపెట్టి, దేవుళ్ళు కానివాళ్ళ
పేర ఒట్టు పెట్టుకొన్నారు.
నేను వాళ్ళకు సమృద్ధిని ప్రసాదించాను.
అయినా వాళ్ళు వ్యభిచారం చేశారు.
వేశ్యాగృహాలలో గుమికూడారు.
8 వాళ్ళు బాగా బలిసిన గుర్రాల్లాంటివాళ్ళు.
ప్రతివాడూ తన పొరుగువాడి భార్యవైపు
సకిలిస్తూ ఉంటాడు.
9  ఇలాంటివాటి కారణంగా నేను వాళ్ళను
దండించకూడదా?
ఇలాంటి జనంమీద ప్రతీకారం చేయకూడదా?
ఇది యెహోవా వాక్కు.
10 “దాని ద్రాక్షతోటల్లోకి వెళ్ళి నాశనం చెయ్యండి గాని,
పూర్తిగా అంతం చేయవద్దు.
దాని కొమ్మలు తీసివేయండి. అవి యెహోవావి కావు.
11 ఇస్రాయేల్‌ప్రజ, యూదాప్రజ నాపట్ల
చాలా కపటంగా వ్యవహరించారు.
ఇది యెహోవా వాక్కు.”
12 ఈ ప్రజలు యెహోవాను గురించి అబద్ధాలు చెప్పారు.
“ఆయన ఏమీ చేయడు. మనపైకి ఏమీ కీడు రాదు.
ఖడ్గం గానీ కరవు గానీ చూడము.
13 ప్రవక్తలు చెప్పేవి గాలివార్తలు.
వాక్కు వాళ్ళలో లేనే లేదు.
తాము చెప్పినట్టే వాళ్ళకే జరుగుతుంది గాక!”
అని వాళ్ళు చెప్పుకొన్నారు.
14 అందుచేత సేనలప్రభువూ దేవుడూ అయిన
యెహోవా నాతో చెప్పేదేమిటంటే,
“వాళ్ళు ఈ మాటలు అన్నారు గనుక నా వాక్కును
నీ నోట మంటలాగా చేస్తాను.
ఈ ప్రజను కట్టెలలాగా చేస్తాను.
అది వాళ్ళను దహించివేస్తుంది.”
15 యెహోవా ఇంకా ఇలా అన్నాడు,
“ఇస్రాయేల్‌ప్రజలారా! మీమీదికి దూర దేశంనుంచి
ఒక జనాన్ని తెప్పిస్తున్నాను.
అది చాలా కాలంనుంచి ఉన్న జనం.
ఆ ప్రజ భాష మీకు అర్థం కాదు.
వాళ్ళు మాట్లాడితే మీకు బోధపడదు.
16 వారి అంబులపొది తెరచి ఉన్న సమాధి.
వాళ్ళంతా బలాఢ్యులు.
17 వాళ్ళు మీ పంటనూ మీ ఆహారాన్నీ తినివేస్తారు.
మీ కొడుకులనూ కూతుళ్ళనూ హతమారుస్తారు.
మీ గొర్రెలనూ మేకలనూ పశువులనూ తినివేస్తారు.
మీ ద్రాక్షచెట్లనూ అంజూరుచెట్లనూ పాడుచేస్తారు.
ఆశ్రయాలని మీరు నమ్ముకొన్న ప్రాకార నగరాలను
వాళ్ళు ఖడ్గంతో నాశనం చేస్తారు.”
18 యెహోవా చెప్పేదేమిటంటే,
“ఆ రోజుల్లో కూడా మిమ్ములను పూర్తిగా అంతం చెయ్యను.
19 వారు ‘మన దేవుడు యెహోవా మనకెందుకు
ఇవన్నీ జరిగించాడు?’
అని అడిగేటప్పుడు నీవు వారికి ఇలా జవాబివ్వాలి:
‘మీరు మీ దేశంలో నన్ను వదలిపెట్టి
విదేశీ దేవుళ్ళను సేవించారు గదా.
ఇప్పుడు మీరు మీది కాని దేశంలో
విదేశీయులకు ఊడిగం చేయాలి.’
20 “యాకోబుప్రజలకు ఈ విషయం తెలియజేయండి,
యూదాలో చాటించండి,
21 బుద్ధిలేని మూర్ఖుల్లారా! వినండి!
కళ్ళున్నాయి గాని, మీరు చూడడం లేదు,
చెవులున్నాయి గాని, మీరు వినడం లేదు.
22 యెహోవా చెప్పేదేమిటంటే, మీరు నాకు భయపడరా?
నా ఎదుట వణకరా? నేను సముద్రానికి
ఇసుకను హద్దుగా ఉంచాను.
దాని సరిహద్దు దాటడం అసాధ్యం.
దాని అలలు ఉప్పొంగినా జయించలేవు.
అవి ఘోషపెట్టినా హద్దు దాటిపోలేవు.
23 ఈ ప్రజలకైతే తిరుగుబాటు చేసే మొండి
హృదయం ఉంది. వారు ప్రక్కకు తిరిగి వెళ్ళిపోయారు.
24 వారు ‘మన దేవుడైన యెహోవాపట్ల
భయభక్తులు చూపుదాం పట్టండి.
తొలకరి వర్షం, కడవరి వర్షం వాటి కాలాల్లో
కురిపించేవాడు ఆయనే.
కోతకాలం వారాలు యథావిధిగా వచ్చేలా చేసేవాడు
ఆయనే’ అని మనసులో కూడా అనుకోరు.
25  అవి రాకుండా చేసినది మీ అపరాధాలే.
మీ పాపాలే మేలు జరగకుండా ఉండడానికి కారణం.
26 “నా ప్రజలమధ్య దుర్మార్గులు ఉన్నారు.
వాళ్ళు వేటకాండ్లలాగా పొంచి ఉంటారు.
వాళ్ళు వల పన్ని మనుషులను పట్టుకొంటారు.
27 గంపలనిండా పక్షులు ఉన్నట్టు,
వాళ్ళ ఇండ్లనిండా మోసం ఉంది.
వాళ్ళు ధనవంతులు, బలంగల వాళ్ళయ్యారు.
28 వాళ్ళు క్రొవ్వుపట్టి, బాగా బలిసి ఉన్నారు.
వాళ్ళు చేసే చెడు కార్యాలకు హద్దు లేదు.
వ్యాజ్యెంలో గెలిచేలా వాళ్ళు తండ్రి లేనివారి
పక్షంగా వాదించరు, బీదవారి హక్కులను కాపాడరు.
29 “ఇలాంటి విషయాలను బట్టి వాళ్ళను
నేను శిక్షించకూడదా?
ఇలాంటి ప్రజమీద ప్రతీకారం చేయ కూడదా?
ఇది యెహోవా వాక్కు.
30  ఈ దేశంలో జరిగినది ఘోరం, భయంకరం –
31 ప్రవక్తలు పరవశులై అబద్ధాలు పలుకుతారు.
యాజులు సొంత అధికారంతో పెత్తనం చెలాయిస్తారు.
ఇలా జరగడం నా ప్రజలకు చాలా ఇష్టం.
అయితే అంతం వచ్చినప్పుడు మీరు ఏమి చేస్తారు?