4
1 యెహోవా చెప్పేదేమిటంటే,
“ఇస్రాయేల్ ప్రజలారా, మీరు తిరిగి రావాలనుకొంటే,
నాదగ్గరికే తిరిగి రావాలి.
మీరు మీ అసహ్యమైన విగ్రహాలను
నా దృష్టినుంచి తొలగించివేసి,
మళ్ళీ దారి తప్పిపోకుండా ఉంటే,
2 ‘యెహోవా జీవం తోడు’ అని యథార్థంగా,
నీతి నిజాయితీతో ప్రమాణం చేస్తే,
అప్పుడు జనాలకు యెహోవా మూలంగా
దీవెన కలుగుతుంది.
అవి ఆయన కారణంగా అతిశయిస్తాయి.
3  యూదావారికి జెరుసలం నివాసులకూ
యెహోవా చెప్పేదేమిటంటే,
“ముళ్ళలో విత్తనాలు చల్లవద్దు.
మీ బీడు భూమి దున్నండి.
4  యూదావారలారా! జెరుసలం నివాసులారా!
మిమ్మల్ని మీరే యెహోవాకు ప్రత్యేకించుకోండి.
మీ హృదయాలకు సున్నతి చేయండి.
మీరు అలా చేయకపోతే మీరు జరిగించిన
చెడుతనమంతటినిబట్టి నా కోపం మంటల్లాగా,
ఎవరూ ఆర్పలేనంతగా రవులుకొంటుంది.
5 “యూదాలోను, జెరుసలంలోనూ ఇలా చాటించండి,
దేశంలో పొట్టేలు కొమ్ము ఊదండి!
పెద్దగా అరుస్తూ ఇలా ప్రకటన చేయండి:
సమకూడండి! ప్రాకారాలున్న నగరాలకు
వెళ్దాం పదండి!
6 సీయోనువైపు పతాకం ఎత్తండి.
ఆలస్యం చేయకుండా ప్రజలను ఆశ్రయంకోసం
పరుగెత్తించండి.
ఎందుకంటే నేను ఉత్తర దిక్కునుంచి ఆపదనూ
గొప్ప విపత్తునూ రప్పిస్తున్నాను.”
7 పొదల్లోనుంచి సింహం వచ్చింది.
జనాలను నాశనం చేసేవాడు బయలుదేరాడు.
మీ దేశాన్ని పాడు చేయడానికి అతడు
తన స్థలం విడిచివస్తున్నాడు.
మీ పట్టణాలు శిథిలమైపోతాయి.
వాటిలో ఎవరూ కాపురముండరు.
8 యెహోవా తీవ్ర కోపం మనమీద ఉండిపోయింది
గనుక గోనెపట్ట కట్టుకొని విలపించండి,
రోదనం చేయండి.
9 యెహోవా చెప్పేదేమిటంటే,
“ఆ రోజున రాజుకూ అధికారులకూ ధైర్యం చెడిపోతుంది.
యాజులు నిర్ఘాంత పోతారు,
ప్రవక్తలు ఆశ్చర్యచకితులవుతారు.”
10 అందుకు నేను ఇలా చెప్పాను:
“అయ్యో, యెహోవాప్రభూ! నీవు ఈ ప్రజను,
జెరుసలం నివాసులను పూర్తిగా మోసగించావు!
‘మీకు శాంతి ఉంటుంది’ అన్నావు గదా.
ఇప్పుడైతే ఖడ్గం దగ్గరగా వచ్చి
వాళ్ళ ప్రాణాలకు ముప్పు తెచ్చింది.”
11 ఆరోజున ఈ ప్రజకు, జెరుసలంలో ఉంటున్న
వారికి ఇలా చెప్పడం జరుగుతుంది:
“ఎడారిలో చెట్లులేని ఎత్తు చోట్లనుంచి
నా ప్రజలవైపు వడగాలి వీస్తూ ఉంది.
విమర్శించడానికీ శుద్ధి చేయడానికీ కాదు.
12 దానికంటే ఎక్కువ గాలి నా దగ్గరనుంచి
వీస్తూ ఉంది.
ఇప్పుడు వారిని గురించిన నా తీర్పులు చెపుతాను.”
13 “ఇడుగో, వస్తున్నవాడు మేఘాల్లాగా కనిపిస్తున్నాడు,
అతడి రథాలు తుఫాన్‌లాగా వస్తున్నాయి.
అతడి గుర్రాలు గరుడపక్షుల కంటే వేగంగా
పరుగెత్తుకువస్తున్నాయి.
అయ్యో! మనం నాశనమయ్యాం!”
14 జెరుసలం! నీకు విముక్తి కలిగేలా నీ హృదయంలో
చెడుగు ఉంచకుండా దానిని శుద్ధి చేసుకో.
ఎన్నాళ్ళు చెడ్డ ఆలోచనలు నీలో
గూడు కట్టుకొని ఉంటాయి?
15 దాను ప్రదేశం నుంచి కంఠధ్వని ప్రకటన
చేయడం వినబడుతూ ఉంది,
ఎఫ్రాయిం కొండమీదనుంచి విపత్తును గురించి
ఒకడు చాటిస్తూ ఉన్నాడు:
16 “ఇతర జనాలకూ, జెరుసలంకూ
ఇలా ప్రకటన చేసి తెలియజేయి:
ముట్టడి వేసేవాళ్ళు దూర దేశం నుంచి వస్తున్నారు.
వాళ్ళు యూదా పట్టణాల విషయం యుద్ధధ్వని చేస్తున్నారు.
17 యూదా నామీద తిరుగుబాటు చేసింది,
గనుకనే వాళ్ళు పొలం కాపలావాళ్ళుగా
యూదాచుట్టూ ముట్టడిస్తారు.
ఇది యెహోవా వాక్కు.
18 మీ ప్రవర్తన, మీరు చేసిన పనులే
ఈ ఆపద మీమీదికి తెచ్చాయి.
మీ చెడ్డతనమే దీనికి కారణం. ఇది ఎంత దుఃఖకరం!
మీ గుండెల్లో ఎంత గుచ్చుకొంటుంది!”
19  నా గుండె! నా గుండె! వేదనతో అల్లాడిపోతున్నాను.
నా గుండె అంచులు బాధగా కొట్టుకొంటూ ఉన్నాయి.
పొట్టేలు కొమ్ము ఊదే శబ్దం,
యుద్ధధ్వని నాకు వినబడుతూ ఉన్నాయి.
నేను ఊరుకోలేను.
20 విపత్తు వెంట విపత్తు వస్తూ ఉంది.
దేశమంతా నాశనమైంది. హఠాత్తుగా నా డేరాలు,
క్షణంలో వాటి తెరలు పాడైపొయ్యాయి.
21 ఎన్నాళ్ళు నేను యుద్ధ ధ్వజం చూస్తూ,
పొట్టేలు కొమ్ము ఊదే శబ్దం వింటూ ఉండాలి?
22 “నా ప్రజ మూర్ఖులు. వారు నన్ను ఎరగరు.
వారు తెలివితక్కువ సంతానం.
వారికి గ్రహించే శక్తి లేదు. చెడుగు చేయడంలో
వారు ఆరితేరినవారు గాని,
మంచి చేయడం ఎలాగో వారికి ఏమీ తెలియదు.”
23 నేను భూతలాన్ని చూశాను. అది శూన్యంగా,
రూపం లేని స్థితిలో ఉంది, ఆకాశాన్ని చూశాను,
అక్కడ కాంతి లేదు.
24 పర్వతాలవైపు చూశాను. అవి కంపిస్తూ ఉన్నాయి.
కొండలన్నీ అటూ ఇటూ కదులుతూ ఉన్నాయి.
25 నేను చూస్తూ ఉంటే మనుషులెవ్వరూ కనిపించలేదు.
గాలిలో ఎగిరే పక్షులన్నీ పొయ్యాయి.
26 నేను చూశాను. యెహోవా తీవ్ర కోపంచేత
తోటలాంటి ఈ దేశం ఎడారిగా మారింది.
దాని పట్టణాలన్నీ పాడుపడి ఉన్నాయి.
27 యెహోవా చెప్పేదేమిటంటే,
“ఈ దేశమంతా పాడైపోతుంది గాని,
దానిని పూర్తిగా అంతం చేయను.
28 దీనిని గురించి భూమి దుఃఖిస్తుంది.
ఆకాశాలను చీకటి కమ్ముకొంటుంది.
నేను నిర్ణయం చేసి మాట ఇచ్చాను.
మనసు మార్చుకోను, వెనక్కు తీయను.”
29 రౌతులూ, విల్లు పట్టినవాళ్ళు చేసే చప్పుడు విని,
ప్రతి ఊరివారూ పారిపోతారు.
వారు దట్టమైన పొదల్లో దూరుతారు,
బండల్లో ఎక్కుతారు.
ప్రజలు పట్టణాలన్నిటినీ విడుస్తారు.
వాటిలో ఎవరూ కాపురముండరు.
30 నీవు నాశనమయ్యావు! నీవేం చేయగలవు?
ఎర్రటి వస్త్రాలు కట్టుకొని, బంగారు ఆభరణాలతో
అలంకరించు కొంటున్నావేం!
నిన్ను అందంగా చేసుకోవడం వ్యర్థమే.
నీ ప్రేమికులు నిన్ను తృణీకరిస్తారు.
నీ ప్రాణం తీయడానికి చూస్తారు.
31 ప్రసవిస్తున్న స్త్రీ కేకలాంటి ధ్వని
నాకు వినిపిస్తూ ఉంది.
ఆ స్వరం తొలి కానుపు స్త్రీ మూలుగుల్లాంటిది –
సీయోను కష్టంతో ఊపిరి పీల్చుకొంటూ,
చేతులు చాచి కేకలు వేస్తూ ఉంది.
“అయ్యో! హంతకుల ముందు మూర్ఛపోతున్నాను,
నాకు బాధ” అంటుంది.