3
1 “ఒక మనిషి తన భార్యకు విడాకులిస్తాడనుకోండి.
ఆమె వెళ్ళి ఇంకొకణ్ణి పెండ్లిచేసుకొంటే
మొదటి మనిషి ఆమెను మళ్ళీ చేరుతాడా?
ఆ విధంగా చేసే దేశం పూర్తిగా అపవిత్రం
అవుతుంది గదా.
మీరు అనేకమంది విటులతో వ్యభిచారిణిలాగా ప్రవర్తించారు.
అయినా నాదగ్గరికి తిరిగి రండి.
ఇది యెహోవా వాక్కు.
2 మీ తలెత్తి ఏ చెట్లులేని కొండలవైపు చూడండి.
మీరు వేశ్యలాగా ప్రవర్తించని స్థలమేదైనా ఉందా?
అరబ్‌దేశంవాడు ఎడారిలో కాచుకొన్నట్టు
మీరు దారిప్రక్కన కూర్చుని,
ప్రేమికులకోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
పడుపు పనిలాంటి మీ దుష్ ప్రవర్తనతో,
మీ చెడుతనంతో ఈ దేశాన్ని అపవిత్రం చేశారు.
3 అందుకే వానలు రావడం లేదు,
కడపటి వర్షపాతం ఆగింది.
మీకు వేశ్యలాంటి నొసలు ఉంది.
సిగ్గుపడను పో అంటారు.
4 ఇప్పుడు మీరు నాకు ఇలా మొరపెట్టారు గదా –
‘తండ్రీ, చిన్నప్పటినుంచి నాకు స్నేహితుడివి నీవే.
5 నీవు ఎప్పటికీ కోపంగా ఉంటావా?
శాశ్వతంగా ఆగ్రహం మానవా?’
నీవిలా చెపుతున్నావు గాని,
నీ చేతనైనంత మట్టుకు చెడుగు చేస్తూనే ఉన్నావు.”
6 యోషీయారాజు పరిపాలిస్తున్న కాలంలో యెహోవా నాతో ఇంకా చెప్పాడు, “నన్ను విడిచిపెట్టి ఇస్రాయేల్ జనం ఏమి చేసినదో చూశావా? ఎత్తయిన ప్రతి కొండమీదికీ, పచ్చని ప్రతి చెట్టుక్రిందకూ వెళ్ళి వేశ్యలాగా ప్రవర్తించింది. 7 ఇదంతా చేసినా, అది నా దగ్గరికి తిరిగి రావాలని నేను చెప్పాను గాని, అది తిరిగి రాలేదు. ద్రోహం చేసినదాని సోదరి యూదా ఇది చూచింది. 8 నన్ను వదలివేసిన ఇస్రాయేల్‌కు, దాని వ్యభిచార కార్యాలన్నిటి కారణంగా, విడాకులిచ్చి దానిని పంపివేశాను. ద్రోహం చేసినదాని సోదరి యూదా ఇది చూచినా ఏమీ భయపడలేదు. అది కూడా వెళ్ళి వేశ్యలాగా ప్రవర్తించింది. 9 వ్యభిచారమంటే ఇస్రాయేల్‌కు చాలా చులకనగా ఉంది. అది రాళ్ళతో, మ్రానుతో వ్యభిచారం చేసి దేశాన్ని అపవిత్రం చేసింది. 10 ఇలా జరిగినా కూడా ద్రోహం చేసినదాని సోదరి యూదా మనసారా నావైపు తిరగలేదు గాని, కపటానికి తిరిగింది. ఇది యెహోవా వాక్కు.”
11 యెహోవా నాతో ఇంకా ఇలా అన్నాడు: “ద్రోహం చేసిన యూదాను చూస్తే, నన్ను విడిచిపెట్టిన ఇస్రాయేల్ నిర్దోషిగా కనిపిస్తుంది. 12 నీవు వెళ్ళి ఉత్తరం వైపుకు ఈ మాటలు ప్రకటన చెయ్యి –
‘యెహోవా చెప్పేదేమిటంటే,
నన్ను విడిచిపెట్టిన ఇస్రాయేలూ!
తిరిగి రా! నేను నీమీద కోపం చూపను.
నేను కరుణామయుణ్ణి. ఇది యెహోవా వాక్కు.
నా కోపం శాశ్వతంగా నిలిచి ఉండదు.
13 అయితే నీవు నీ అపరాధం ఒప్పుకోవాలి –
నీ దేవుడు యెహోవా మీద తిరుగుబాటు చేశావు,
ప్రతి పచ్చని చెట్టుక్రింద విదేశీయ దేవుళ్ళను
మోహించావు, నా మాట వినకుండా ఉన్నావు.
ఇది యెహోవా వాక్కు.’
14 “నన్ను విడిచిపెట్టిన జనమా! తిరిగి రండి! ఇది యెహోవా వాక్కు. నేను మీ యజమానుణ్ణి. ప్రతి ఊరిలో ఒకణ్ణి, ప్రతి కుటుంబంలో ఇద్దరిని ఎన్నుకొని మిమ్మల్ని సీయోనుకు తీసుకువస్తాను. 15 అప్పుడు నా ఆలోచనకు సరిపడే కాపరులను మీమీద నియమిస్తాను. వారు జ్ఞాన వివేకాలతో మిమ్మల్ని పోషిస్తారు. 16 ఆ రోజుల్లో మీరు ఈ దేశంలో వృద్ధి చెంది చాలామంది అవుతారు. అప్పుడు మనుషులు యెహోవా ఒడంబడికపెట్టెను గురించి మాట్లాడరు. అది మనసులో ఉండదు, జ్ఞప్తికి రాదు. లేదని వారికి తోచదు. అలాంటి మరోదానిని చేయరు. ఇది యెహోవా వాక్కు.
17 “ఆ కాలంలో జెరుసలంను ‘యెహోవా సింహాసనం’ అంటారు. అన్ని దేశాలవారు యెహోవా పేరు ప్రతిష్ఠలను బట్టి జెరుసలం చేరుకొంటారు. అప్పటి నుంచి వారి చెడు హృదయంలో ఉన్న మూర్ఖత్వం ప్రకారం ప్రవర్తించరు. 18 ఆ కాలంలో యూదా వంశంవారు ఇస్రాయేల్ వంశంవారిని కలిసి, ఒక ఉత్తర దేశంనుంచి వస్తారు, నేను మీ పూర్వీకులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి చేరుకొంటారు.
19 “నేను మిమ్మల్ని కుమారులుగా ఎంచి,
మీకు రమ్యమైన దేశాన్ని ఇవ్వడానికి
ఎంతగానో కోరుతున్నాను అన్నాను.
ఆ వారసత్వం ఏ దేశంకంటే కూడా అందమైనది.
మీరు నన్ను ‘తండ్రి’ అంటూ,
నన్ను అనుసరించడం మానకూడదని చెప్పాను.
20 అయితే ఇస్రాయేల్ జనమా!
భార్య తన భర్తపట్ల కపటంగా ప్రవర్తించినట్టే
మీరు నాపట్ల కపటంగా ప్రవర్తించారు.
ఇది యెహోవా వాక్కు.
21 “చెట్లులేని ఎత్తయిన స్థలాల్లో కంఠధ్వని
వినబడుతూ ఉంది –
ఇస్రాయేల్‌ప్రజలు ఏడుస్తూ ప్రాధేయపడుతూ ఉన్నారు.
ఎందుకంటే వారు తమ మార్గాన్ని వక్రం చేసుకొన్నారు,
తమ దేవుడైన యెహోవాను మరచిపోయారు.
22 నన్ను విడిచిపెట్టిన ప్రజలారా! తిరిగి రండి!
నన్ను మళ్ళీ విడిచిపెట్టకుండేలా
మిమ్మల్ని బాగు చేస్తాను.”
“ఇదిగో! మేము నీదగ్గరికి వస్తున్నాం.
మా దేవుడైన యెహోవావు నీవే.
23 నిజంగా, కొండలమీద చేసే పూజ మోసకరమే,
పర్వతాలమీద జరిగే తాండవాలు వట్టివే.
నిజంగా, ఇస్రాయేల్‌కు రక్షణ మన దేవుడైన
యెహోవా మూలంగానే కలుగుతుంది.
24 మన చిన్నతనంనుంచి నీచ విగ్రహాలు
మన తండ్రుల కష్టార్జితాన్ని మ్రింగివేశాయి.
వారి గొర్రెలు, మేకలు, పశువుల మందలు,
వారి కొడుకులనూ కూతుళ్ళనూ కూడా మ్రింగివేశాయి.
25 మనమూ మన తండ్రులూ మన చిన్నతనంనుంచి
ఈ రోజువరకూ మన దేవుడైన యెహోవాకు
వ్యతిరేకంగా అపరాధాలు చేస్తూ వచ్చాం,
గనుక సిగ్గుతో సాష్టాంగపడుదాం రండి.
మన అవమానం మనలను కప్పుకోనివ్వండి.”