“యెహోవా చెప్పేదేమిటంటే,
యౌవనప్రాయంలో నీ అభిమానం,
పెళ్ళికూతురు✽లాగా నీవు చూపిన ప్రేమ
నాకు జ్ఞాపకమే.
విత్తని ప్రదేశంలో, ఎడారి✽లో నీవు నన్ను
అనుసరించావు.
3 ఇస్రాయేల్‌ప్రజ యెహోవాకు పవిత్ర జనం.✽
ఆయన పంటకోతలో మొదటిభాగం.
వారిని దిగమింగిన వాళ్ళంతా అపరాధుల
లెక్కలోకి వచ్చారు.
వాళ్ళందరూ విపత్తు✽కు గురి అయ్యారు.
ఇది యెహోవా వాక్కు.”
4 ✽యాకోబు వంశస్థులారా! ఇస్రాయేల్ వంశానికి
చెందిన అన్ని కుటుంబాల వారలారా!
యెహోవా వాక్కు వినండి.
5 ✽యెహోవా చెప్పేదేమిటంటే,
“మీ పూర్వీకులు నాలో ఏమి తప్పు చూచి
నా దగ్గరనుంచి దూరంగా వైదొలగారు?
వారు వ్యర్థమైన✽దానిని అనుసరించి
వ్యర్థులయ్యారు.
6 ✽అంతే కాకుండా వారు ఇలా అడగనేలేదు –
‘ఈజిప్ట్ దేశం నుంచి, ఎండిపోయిన ప్రాంతాలూ
గుంటలూ ఉన్న ఎడారిగుండా,
అనావృష్టీ కటిక చీకటీ గల ఆ ప్రదేశంగుండా,
ఎవరూ ప్రయాణం చేయని, కాపురం ఉండని
ఆ ప్రదేశంగుండా దారి చూపుతూ మనల్ని
తీసుకు వచ్చిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?’
7 “తోటలాంటి దేశం✽లో దాని పంటలను,
మంచి పండ్లను అనుభవించడానికి,
మీరు ప్రవేశించేలా నేను చేశాను.
అయితే మీరు వచ్చి నా దేశాన్ని అశుద్ధం✽ చేశారు.
నా సొత్తును అసహ్యంగా మార్చారు.
8 ✽‘యెహోవా ఎక్కడున్నాడు?’
అని యాజులు కూడా అడగలేదు.
ధర్మశాస్త్రాన్ని ఉపయోగించే వాళ్ళు నన్ను ఎరగరు.
పరిపాలకులు నామీద తిరుగుబాటు చేశారు.
ప్రవక్తలు బయల్‌దేవుడి పేర సోదె చెప్పారు.
వ్యర్థమైనవాటిని అనుసరించారు.
9 ✽ అందుచేత ఇకమీదట నేను మీకూ
మీ సంతానానికీ విరోధంగా ఫిర్యాదినవుతాను.
ఇది యెహోవా వాక్కు.
10 ✽“కిత్తీం ద్వీపం ప్రదేశాలకు వెళ్ళి చూడండి.
కేదార్ ప్రాంతానికి మనుషులను పంపి
అక్కడి సంగతి బాగా తెలుసుకోండి.
మీలో జరిగినట్టు ఇంకెక్కడైనా జరిగిందో లేదో చూడండి.
11 వాళ్ళ దేవుళ్ళలో ఎవడూ దేవుడు
కాకపోయినా కూడా ఏ దేశంవాళ్ళైనా ఎప్పుడైనా
వాళ్ళను మార్చుకొన్నారా✽?
అయితే నా ప్రజ తమకు ఘనతగా ఉన్నవానిని
విడిచి ఎందుకూ పనికిరాని దానిని ఎన్నుకొన్నారు.
12 ✽ఆకాశాల్లారా! ఇది చూచి ఆశ్చర్యపడి
గడగడ వణకండి! నిర్ఘాంతపోండి!
ఇది యెహోవా వాక్కు.
13 ✽నా ప్రజ రెండు నేరాలు చేశారు.
జీవప్రదమైన ఊటగా ఉన్న నన్ను వదలిపెట్టారు,
తమకోసం నీళ్ళు నిలవని, పగిలిపోయిన
తొట్లు తొలిపించుకొన్నారు.
14 ✽“ఇస్రాయేల్‌ప్రజలు దాసులా?
పుట్టుకతోనే బానిసలా? మరి వారు
ఎందుకు దోపిడీకి గురి అయ్యారు?
15 ఈ ప్రజను చూచి సింహాలు
బొబ్బలు పెట్టి గర్జించాయి.
వారి దేశాన్ని పాడు చేశాయి.
వారి పట్టణాలు నాశనమయ్యాయి.
వాటిలో కాపురం చేసేవాళ్ళెవ్వరూ లేరు.
16 నోప్ నగరవాసులూ తహపనేసు పట్టణస్థులూ
మీ నెత్తిని బ్రద్దలు చేశారు.
17 ✽మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని దారిన
నడిపిస్తూ ఉంటే మీరు ఆయనను వదలిపెట్టడంవల్ల
ఈ ఆపదలు తెచ్చుకొన్నారు గదా.
18 ✽షీహోరు నది నీళ్ళు త్రాగడానికి
ఈజిప్ట్ దారిన మీకేం పని?
యూఫ్రటీసు నది నీళ్ళు త్రాగడానికి
అష్షూరు✽ దారిన మీకేం పని?
19 ✽మీ చెడుతనమే మిమ్మల్ని శిక్షిస్తుంది.
మీరు చేసిన ద్రోహమే మిమ్మల్ని గద్దిస్తుంది.
మీ దేవుడు యెహోవాను మీరు వదలిపెట్టడం,
ఆయనపట్ల భయభక్తులు లేకపోవడం
ఆపదకూ దుఃఖానికీ కారణమని
ఆలోచన చేసి తెలుసుకోండి.”
ఇది సేనలప్రభువు యెహోవా✽ వాక్కు.
20 ✽ “చాలా రోజులక్రిందటే మీ కాడిని
విరగగొట్టుకొని, కట్లు తెంపివేసుకొన్నారు.
కానీ మీరు ‘మేము సేవ చేయమ’ని చెప్పారు.
మీరు ఎత్తయిన ప్రతి కొండమీదా,
పచ్చని ప్రతి చెట్టుక్రిందా వేశ్య✽లాగా ప్రవర్తించారు.
21 ✝నేను మిమ్మల్ని కేవలం సరైన విత్తనంతో,
మేలిరకమైన ద్రాక్షతీగెగా నాటాను.
మరి చెడిపోయి కారు ద్రాక్షతీగెగా మీరెలా మారిపోయారు?
22 ✽“మీరు ఎంత సబ్బుతో, క్షారంతో కడిగినా
మీ అపరాధం మరకలాగా నాకు కనిపిస్తూనే ఉంది.
ఇది యెహోవాప్రభు వాక్కు.
23 ✽‘మేము అశుద్ధులం కాలేదు,
బయల్‌దేవుణ్ణి అనుసరించలేదు’
అని మీరెలా చెప్పగలరు?
లోయలో మీ ప్రవర్తన విషయంలో ఆలోచన చేయండి.
మీరేంచేశారో తెలుసుకోండి.
అటూ ఇటూ పరుగెత్తే ఒంటెలాంటివారు మీరు.
24 అరణ్యానికి అలవాటుపడ్డ
ఆడ అడవి గాడిదలాంటివారు.
అది కామాగ్నితో శ్వాస పీలుస్తూ ఉంటుంది.
అలాంటి సమయంలో దానిని ఎవరూ
అదుపులో ఉంచగలరు?
మగ గాడిదలు దానిని వెదికితే వాటిలో ఏదీ
అలసిపోనవసరం లేదు.
దాని నెలలో అది వాటికి దొరుకుతుంది.
25 ‘మీరు వట్టి కాళ్ళతో వెళ్ళకుండా జాగ్రత్తపడండి!
దప్పినుంచి మీ గొంతును కాపాడుకోండి!
అని నేను చెప్పినా, మీకు ‘ప్రయోజనం లేదు.
ఇతరులను మేము ప్రేమిస్తున్నాం,
వాళ్ళ వెంటే వెళ్తాం’ అన్నారు.
26 ✝“దొంగ దొరికితే వాడు ఎలా సిగ్గుపాలవుతాడో
అలాగే ఇస్రాయేల్ వంశీయులు –
వారు, వారి రాజులు, అధిపతులు, యాజులు,
ప్రవక్తలు సిగ్గుపాలయ్యారు.
27 ✽వారు చెట్టుతో ‘మా తండ్రివి నీవే’ అని చెప్పేవారు.
రాతితో ‘మమ్మల్ని పుట్టించినది నీవే’ అనేవారు.
నావైపు ముఖం త్రిప్పుకోకుండా వీపు త్రిప్పుకొన్నారు.
అయినా ఆపద సమయంలో వారు
‘లేచి మమ్మల్ని రక్షించు’ అని నన్ను ప్రాధేయపడుతారు.
28 మీకోసం చేసుకొన్న దేవుళ్ళు ఎక్కడ?
యూదావారలారా, మీకు ఎన్ని ఊళ్ళుంటే
అంతమంది దేవుళ్ళు!
వాళ్ళు మీ ఆపద సమయంలో మిమ్మల్ని
రక్షించగలిగితే లేచి రక్షించమనండి.
29 ✽“మీరు నాతో ఎందుకు వాదిస్తారు?
మీరందరూ నామీద తిరుగుబాటు చేశారు.
ఇది యెహోవా వాక్కు.
30 ✽ నేను మీ సంతానాన్ని మొత్తాను గాని,
ప్రయోజనం లేదు.
వారు సరి దిద్దుకోలేదు. మీ ఖడ్గమే మీ ప్రవక్తలను
నాశనం చేసే సింహంలాగా చంపివేసింది.
31 ✽ఈ తరంవారలారా! యెహోవా వాక్కును తలంచండి.
ఇస్రాయేల్ ప్రజకు నేను ఎడారిగా ఉన్నానా?
కటిక చీకటి ఉన్న ప్రదేశంలాగా ఉన్నానా?
మరి నా ప్రజ ‘తిరుగులాడడానికి మాకు స్వేచ్ఛ ఉంది.
ఇక నీదగ్గరికి రామ’ని ఎందుకు చెపుతున్నారు?
32 ✽“కన్య తన ఆభరణాలు మరచిపోతుందా?
పెండ్లికూతురు తన ఒడ్డాణం మరచిపోతుందా?
కాని, నా ప్రజ లెక్కలేనన్ని రోజులు నన్ను మరచారు.
33 విటుకాండ్ర వెంటపడడం మీకు బాగా తెలుసు.
మీ ప్రవర్తన చూచి చెడ్డ స్త్రీలు కూడా నేర్చుకోగలరు.
34 అమాయకులైన బీదవారి రక్తం
మీ బట్టలమీద కనిపిస్తూ ఉంది–
వారు కన్నం వేసినందుకు కాదు.
ఇదంతా జరిగినా మీరు ఏం అంటున్నారంటే,
35 ‘మేము నిర్దోషులం. యెహోవాకు మామీద
ఏమీ కోపం లేదు.’
వినండి, మీరు ‘పాపం చేయలేద’ని
చెప్పినందుచేత మీకు తీర్పు తీరుస్తాను.
36 “మీ విధానాన్ని మార్చుకోవడానికి అటు ఇటూ
ఇంతగా తిరుగులాడుతూ ఉన్నారేం?
అష్షూరువల్ల మీకు ఆశాభంగం కలిగినట్లు
ఈజిప్ట్‌వల్ల ఆశాభంగం కలుగుతుంది.
37 నెత్తిన చేతులు ఉంచుకొని ఆ దేశంనుంచి
బయలుదేరుతారు.
మీరు ఎవరిమీద నమ్మకం పెట్టుకొన్నారో
వాళ్ళను యెహోవా తిరస్కరించాడు.
వాళ్ళవల్ల మీ విషయం సఫలం కాబోదు.