యిర్మీయా
1
1 ఇవి హిల్కీయా కొడుకు యిర్మీయా మాటలు. అతడు బెన్యామీను ప్రదేశంలో ఉన్న అనాతోతు గ్రామవాసులైన యాజులలో ఒకడు. 2 ఆమోను కొడుకు యోషీయా యూదాకు రాజుగా ఉన్న పదమూడో సంవత్సరంలో యెహోవానుంచి వాక్కు యిర్మీయాకు వచ్చింది. 3 అలాగే యోషీయా కొడుకు యెహోయాకీం యూదాకు రాజుగా ఉన్న పదకొండో సంవత్సరం అయిదో నెలవరకూ కూడా యెహోవానుంచి వాక్కు యిర్మీయాకు వస్తూనే ఉంది. ఆ నెలలో జెరుసలం నగరవాసులు బందీలుగా దేశాంతరం వెళ్ళారు.
4 యెహోవానుంచి నాకు వచ్చిన వాక్కు ఏమిటంటే,
5 “నేను నిన్ను గర్భంలో రూపొందించేముందే
నిన్ను ఎరిగి ఎన్నుకున్నాను.
నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను,
ఇతర జనాలకు ప్రవక్తగా నియమించాను.
6 అందుకు నేను “అయ్యో, యెహోవాప్రభూ! బాలుణ్ణే నేను. ఎలా మాట్లాడాలో నాకు తెలియదు” అన్నాను.
7 అయితే యెహోవా నాతో “బాలుణ్ణి అనవద్దు. నేను నిన్ను ఎవరిదగ్గరకు పంపుతానో వారి దగ్గరికి నీవు వెళ్ళాలి, నీకు నేను ఆజ్ఞాపించేదంతా చెప్పాలి. 8 వారంటే నీకు భయం ఉండకూడదు. వారి బారినుండి నిన్ను తప్పించడానికి నేను నీతో ఉంటాను. ఇది యెహోవా వాక్కు” అన్నాడు.
9  అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు తాకి నాతో ఇలా అన్నాడు: “ఇదిగో విను! నా వాక్కులు నీ నోట ఉంచాను. 10 ఈ రోజే జనాలమీదా రాజ్యాలమీదా నిన్ను నియమిస్తున్నాను. నీవు చేయవలసినది ఏమిటంటే, పెరికివేయడం, కూలకొట్టడం, నాశనం చేయడం, పడవేయడం, కట్టడం, నాటడం.”
11 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది “యిర్మీయా! నీకేమి కనిపిస్తున్నది?” అందుకు నేను “నాకు బాదంచెట్టు కొమ్మ కనిపిస్తున్నది” అని జవాబిచ్చాను.
12 యెహోవా నాతో “సరిగా చూశావు. నేను నా వాక్కులు నెరవేర్చడంలో శ్రద్ధ వహిస్తున్నాను” అన్నాడు.
13 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది “నీకేమి కనిపిస్తున్నది?” అందుకు నేను “కాగుతూ ఉన్న కుండ నాకు కనిపిస్తున్నది. అది ఉత్తర దిక్కునుంచి అవతలకు వంగి ఉంది” అని జవాబిచ్చాను.
14 యెహోవా నాతో మాట్లాడుతూ “ఈ దేశవాసులందరి మీదికి ఉత్తర దిక్కునుంచి విపత్తు వస్తుంది. 15 ఉత్తర దిక్కులో ఉన్న అన్ని రాజ్యాల జనాలను రప్పించబోతున్నాను. ఇది యెహోవా వాక్కు.
వాళ్ళ రాజులు వస్తారు; ఒక్కొక్కరు తన సింహాసనాన్ని
జెరుసలం ద్వారాలలో,
జెరుసలం చుట్టున్న ప్రాకారాలన్నిటికీ ఎదురుగా,
యూదా పట్టణాలన్నిటికీ ఎదురుగా
నిలుపుకొంటారు.
16 నా ప్రజ నన్ను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళకు
ధూపం వేసి, వాళ్ళు చేతులతో చేసిన
విగ్రహాలను పూజించి, చెడ్డగా ప్రవర్తించారు.
గనుక నేను వాళ్ళకు విరోధంగా తీర్పులు చెపుతాను.
17 “నీవు సిద్ధపడి, నిలబడి, నేను నీకు ఆజ్ఞాపించేదంతా వాళ్ళకు చెప్పాలి. వాళ్ళను చూచి భయపడకూడదు. ఒకవేళ భయపడితే వారి ఎదుట నేను నిన్ను ఎక్కువ భయానికి గురి చేస్తాను. 18 ఈ దేశమంతటి విషయం – యూదా రాజుల విషయం, అధికారుల విషయం, యాజుల విషయం, దేశ ప్రజల విషయం – ఈ రోజునే నేను నిన్ను ప్రాకారాలున్న పట్టణంలాగా, ఇనుప స్తంభంలాగా, కంచు గోడల్లాగా చేస్తున్నాను. 19 వాళ్ళు నీతో పోరాడుతారు గాని, నిన్ను జయించలేరు. నేను నీతో ఉండి నిన్ను వాళ్ళ బారినుంచి తప్పిస్తాను. ఇది యెహోవా వాక్కు” అన్నాడు.