65
1  “నా విషయం అడగనివారిని నా దగ్గరికి రానిచ్చాను.
నన్ను వెదకనివారికి నేను దొరికాను.
నా పేర ప్రార్థన చేయని జనంతో ‘ఇదిగో! నేను ఇక్కడే ఉన్నాను,
ఇక్కడే ఉన్నాను’ అన్నాను.
2 మూర్ఖంగా ఉండే ప్రజవైపు నేను రోజంతా చేతులు చాపాను.
వారు తమ ఆలోచనలను అనుసరిస్తూ చెడ్డ త్రోవలలో
నడుచుకొంటూ ఉన్నారు.
3 తోటలలో బలులు అర్పిస్తూ, ఇటికెల కుప్పలమీద
ధూపం వేస్తూ, నా కళ్ళెదుటే ఎల్లప్పుడూ
నాకు కోపం రేపుతూ ఉన్నారు.
4 వారు సమాధుల మధ్య కూర్చుని ఉంటారు.
రహస్యంగా జాగరణ చేస్తారు. పంది మాంసం తింటారు.
అసహ్యమైన వంటకం వారి పాత్రలలో ఉంది.
5 వారు ‘నీ కంటే నేను పవిత్రుణ్ణి. నా దగ్గరికి రావద్దు!
దూరంగా ఉండు!’ అంటారు.
వారు నా ముక్కు పుటాలలో పొగలాగా,
రోజంతా మండుతూ ఉండే నిప్పులాగా ఉన్నారు.
6 “నా ఎదుట గ్రంథంలో ఇది వ్రాసి ఉంది:
నేను ఊరుకోను. ప్రతీకారం చేసి తీరుతాను.
మీ అపరాధాలకూ మీ పూర్వీకుల అపరాధాలకూ
మీరు అనుభవించేలా ప్రతిఫలమిచ్చితీరుతాను.
7 ఈ ప్రజలు పర్వతాల మీద ధూపం వేసినందుచేత,
కొండలమీద నన్ను దూషణకు గురి చేసినందుచేత,
మునుపు చేసిన పనులకు కూడా వారి ఒడిలోనే
వారికి ప్రతీకారం కొలిచి పోస్తాను” అని యెహోవా అంటున్నాడు.
8 యెహోవా అంటున్నాడు, “ద్రాక్ష గుత్తిలో రసం ఇంకా కనబడితే,
మనుషులు ‘దానిలో మంచి రసం ఉంది.
దానిని నష్టం చేయవద్దు’ అంటారు.
అలాగే నా సేవకులకోసం నేను చేస్తాను.
ఈ ప్రజలను అందరినీ నాశనం చేయను.
9 యాకోబు వంశంలో సంతానాన్ని పుట్టిస్తాను.
యూదాలో నా పర్వతాలను స్వాధీనం చేసుకొనేవారిని పుట్టిస్తాను.
నేను ఎన్నుకొన్నవారు వాటికి వారసులుగా ఉంటారు.
నా సేవకులు అక్కడ నివాసం చేస్తారు.
10 నన్ను వెదికిన నా ప్రజలకోసం షారోను గొర్రెల
మేత భూమి అవుతుంది. ఆకోరు లోయ పశువులకు
విశ్రాంతి స్థలంగా ఉంటుంది.
11 “అయితే యెహోవాను వదలిపెట్టి, నా పవిత్ర పర్వతాన్ని మరచి,
గాద్‌కు ఆహారనైవేద్యాలు అర్పిస్తూ,
మనీకి పానార్పణలు చేసేవారలారా,
12 నేను ఖడ్గాన్ని మీకు అదృష్టంగా నియమిస్తాను.
మీరంతా సంహారానికి లోనవుతారు.
ఎందుకంటే నేను పిలిచినప్పుడు మీరు జవాబియ్యలేదు,
నేను మాట్లాడినప్పుడు మీరు వినలేదు.
నా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు, నాకు ఇష్టం కానివాటిని కోరుకొన్నారు.
13 “అందుచేత యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే,
ఇదిగో వినండి! నా సేవకులు భోజనం చేస్తారు గాని,
మీరు ఆకలిగొంటారు.
నా సేవకులు పానం చేస్తారు గాని, మీరు దప్పిగొంటారు.
నా సేవకులు ఆనందిస్తారు గాని, మీరు సిగ్గుపాలవుతారు.
14 నా సేవకులు ఆనందమయమైన హృదయాలతో
పాటలు పాడుతారు గాని, మీరు హృదయవేదనతో ఏడుస్తారు.
మనోదుఃఖంతో రోదనం చేస్తారు.
15 నేను ఎన్నుకొన్నవారికి మీ పేరు శాప వచనంగా
విడిచిపోతారు. యెహోవాప్రభువు మిమ్మల్ని హతమారుస్తాడు గాని,
తన సేవకులకు ఆయన మరో పేరు పెడతాడు.
16 అప్పుడు దేశంలో దీవెనకోసం ప్రార్థన చేసేవారు
నమ్మతగిన దేవుని పేరటే ప్రార్థన చేస్తారు.
దేశంలో శపథం చేసేవారు నమ్మతగిన దేవునితోడు
అంటూ శపథం చేస్తారు.
మునుపు ఉన్న కష్టాలను మరవడం జరుగుతుంది.
అవి నా కంటికి కనబడకుండా పోతాయి.
17 “ఇదిగో, నేను క్రొత్త ఆకాశాలనూ క్రొత్త భూమినీ సృజించబోతున్నాను.
మునుపటి సంగతులు మనసులో ఉండవు. జ్ఞప్తికి రావు.
18 నేను సృజించబోయే వాటికారణంగా సంతోషించండి.
శాశ్వతంగా ఆనందించండి.
నేను జెరుసలంను ఆనందకరమైన స్థలంగా,
దాని ప్రజను సంతోషకారణంగా సృజించబోతున్నాను.
19 నేను జెరుసలంను చూచి ఆనందిస్తాను,
నా ప్రజను చూచి సంతోషిస్తాను.
అప్పటినుంచి ఏడుపు, రోదనం జెరుసలంలో వినబడవు.
20 “అప్పటినుంచి కొద్ది రోజులే బ్రతికే శిశువులు ఉండరు.
ముసలివారు కాలం నిండకుండా చనిపోరు.
నూరు సంవత్సరాలవాడు యువకుడుగా చనిపోతాడు.
నూరు సంవత్సరాల వయసు ఉన్న పాపాత్ముడు
శాపానికి గురి అవుతారు.
21 ప్రజలు ఇండ్లను కట్టి వాటిలో కాపురముంటారు.
ద్రాక్షతోటలను నాటించి వాటి పండ్లను తింటారు.
22 వారు కట్టే ఇండ్లలో ఇతరులు కాపురముండరు.
వారు నాటించినవాటిని ఇతరులు తినరు.
నా ప్రజల ఆయువు వృక్షాల ఆయువంతగా ఉంటుంది.
నేను ఎన్నుకొన్నవారు తాము చేతులతో చేసేవాటిని
చాలా కాలం ఉపయోగించుకొంటారు.
23  వారు వృధాగా ప్రయాసపడరు. విపత్తుకే పిల్లలను కనరు.
యెహోవా దీవించే ప్రజగా ఉంటారు.
వారి సంతానం కూడా అలాగే ఉంటారు.
24 వారు ప్రార్థన చేయకముందే నేను వారికి జవాబిస్తాను.
వారు విన్నపం చేస్తూ ఉండగానే నేను వింటాను.
25 తోడేళ్ళూ గొర్రెపిల్లలూ కలిసి మేస్తాయి.
సింహాలు ఎద్దుల్లాగా గడ్డి తింటాయి.
పాము నోట్లో ధూళిపడి తింటుంది.
నా పవిత్రమైన కొండ అంతట్లో అవి హాని చేయవు,
నాశనం చేయవు. ఇది యెహోవా వాక్కు.”