64
1 ఆకాశాలను చీల్చుకొని నీవు దిగివస్తావు గాక!
అప్పుడు నీ సన్నిధానంలో పర్వతాలు కంపించి పోతాయి.
2 అగ్ని గచ్చపొదలను కాల్చేలా, నీళ్ళు పొంగేలా చేసే విధంగా
నీవు నీ శత్రువులకు నీ పేరు తెలిసేలా
నీ సమక్షంలో జనాలు వణకేలా దిగి రా!
3 మునుపు నీవు భయభక్తులు కలిగించే క్రియలు చేశావు.
అవి జరుగుతాయని మేము ఎన్నడూ అనుకోలేదు.
నీవు దిగి వచ్చావు. పర్వతాలు నీ సన్నిధానంలో కంపించాయి.
4 నీకోసం ఎదురు చూచేవారి పక్షంగా
నీవు క్రియలు జరిగించే దేవుడివి.
అనాది కాలంనుంచి నీవు తప్ప ఇలా జరిగించే
మరో దేవుణ్ణి ఎవరూ చూడలేదు, వినలేదు.
నీ వంటి వేరే దేవుణ్ణి గురించి మనుషుల చెవులకు
ఎప్పుడూ వినబడలేదు.
5 నిన్ను మనసులో ఉంచుకొని నీ మార్గాలలో సంతోషంతో
న్యాయాన్ని అనుసరించేవారిని నీవు సందర్శిస్తావు.
మేమైతే పాపులం. గనుక నీవు మామీద కోపగించావు.
చాలా కాలంనుంచి మా పాపాలలో ఉండిపొయ్యాం.
మాకు రక్షణ కలుగుతుందా?
6 మేమందరమూ అశుద్ధులలాంటి వాళ్ళమయ్యాం.
మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలలాగా ఉన్నాయి.
మేమందరమూ ఆకులలాగా వాడిపోయేవాళ్ళం,
గాలిలాగా మా అపరాధాలు మమ్మల్ని ఎగరగొట్టి
తీసుకు పోతున్నాయి.
7 నీ ముఖాన్ని మాకు కనబడకుండా దాచుకొన్నావు.
మా అపరాధాల క్రింద మేము నీరసించేలా చేశావు,
గనుక ఎవరూ నీ పేర ప్రార్థన చేయడం లేదు,
నీమీద ఆధారపడడానికి తమను పురికొలుపుకోవడం లేదు.
8 అయినా, యెహోవా, నీవు మా తండ్రివి.
మేము జిగటమట్టిగా ఉన్నాం, నీవు మాకు కుమ్మరివి.
మేమందరమూ నీవు చేతులతో చేసిన పని.
9 యెహోవా, అత్యధికంగా కోపగించవద్దు.
మా అపరాధాలను శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకోవద్దు.
ఇదిగో, దయ చేసి మావైపు చూడు. మేమందరమూ నీ ప్రజలం.
10 నీ పవిత్ర పట్టణాలు బీడు భూములయ్యాయి.
సీయోను బీడయింది. జెరుసలం పాడుగా ఉంది.
11 మా పూర్వీకులు నిన్ను కీర్తించిన మా ఘనమైన
పవిత్రాలయం మంటలపాలయింది. కోరతగిన మా వస్తువులన్నీ
నాశనమైపొయ్యాయి.
12 యెహోవా, ఇది చూచి నిన్ను నీవు తమాయించుకొంటావా?
మౌనంగా ఉండి అత్యధికంగా మమ్మల్ని బాధిస్తావా?