63
1 ఎదోంనుంచి వస్తూ ఉన్న ఈయన ఎవరు?
ఎర్రటి అద్దకం బట్టలు వేసుకొని బొస్రా పట్టణంనుంచి
వస్తూ ఉన్న ఈయనెవరు?
ఘనమైన దుస్తులు తొడుక్కొని తన మహా బలంతో
నడుస్తూ ఉన్న ఈయనెవరు?
“నీతినిజాయితీతో మాట్లాడుతూ ఉండే నేనే.
రక్షించడానికి బలాఢ్యుడుగా ఉన్న నేనే.”
2 నీ బట్టలు ఎందుకు ఎర్రగా ఉన్నాయి?
నీ దుస్తులు ద్రాక్షగానుగ తొట్టిలో త్రొక్కేవాడి
బట్టలలాగా ఎందుకున్నాయి?
3 “నేను ఒక్కడినే ద్రాక్షగానుగ తొట్టిలో త్రొక్కాను.
జనాలలో ఎవడూ నాతోకూడా లేడు.
కోపంతో వారిని త్రొక్కాను.
ఆగ్రహంతో వారిని త్రొక్కివేశాను.
వారి రక్తం నా బట్టలమీద చిందింది.
నా దుస్తులంతా మచ్చలే.
4  ప్రతీకారం చేసే రోజు నా మనసుకు వచ్చింది.
విముక్తి చేసే సంవత్సరం వచ్చింది.
5 సహాయం చేసేవాడెవడూ లేకపోవడం చూశాను.
అది నాకు ఘోరమనిపించింది.
తోడ్పడేవాడెవ్వడూ లేకపోయారు గనుక
నా హస్తమే నాకు విజయం సాధించింది.
నా ఆగ్రహం నాకు ఆధారంగా ఉంది.
6 కోపంతో జనాలను త్రొక్కివేశాను.
నా ఆగ్రహంతో వారిని మత్తిల్లజేసి,
వారి రక్తాన్ని నేల పారబోశాను.”
7 యెహోవా మనకు చేసిన కరుణాక్రియలన్నిటినీ,
స్తుతిపాత్రమైన ఆయన చర్యలన్నిటినీ తలచుకొని వర్ణిస్తాను.
ఆయన వాత్సల్యం, ఆయన మహా కరుణ కారణంగా
ఆయన ఇస్రాయేల్ వంశంవారికి చేసిన గొప్ప మేలును వర్ణిస్తాను.
8 ఆయన అన్నాడు “వారు నా ప్రజ.
వారు ద్రోహం చేయకూడదు.” ఆయన వారికి
రక్షకుడయ్యాడు.
9 వారి బాధలన్నిటిలో ఆయన బాధ అనుభవించాడు.
ఆయన సన్నిహిత దూత వారిని రక్షించాడు.
ఆయన ప్రేమతో, కనికరంతో వారిని విడుదల చేశాడు.
పురాతన దినాలన్నిటిలో వారిని ఎత్తుకొంటూ మోస్తూ వచ్చాడు.
10 అయినా వారు ఎదురుతిరిగి ఆయన పవిత్రాత్మను నొప్పించారు.
ఆయన వారికి శత్రువయ్యాడు. తానే వారితో పోరాడాడు.
11 అప్పుడు ఆయన ప్రజలు పురాతన దినాలనూ
మోషే దినాలనూ జ్ఞప్తికి తెచ్చుకొన్నారు –
తన మంద కాపరితోపాటు సముద్రంలోనుంచి
తన ప్రజను తీసుకువచ్చినవాడేడి?
వారి మధ్య తన పవిత్రాత్మను ఉంచినవాడేడి?
12 మోషే కుడి చేతివైపున తన ఘనమైన చెయ్యి
ఉండిపోనిచ్చినవాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగాలని
వారి ముందర నీళ్ళను విభజించినవాడేడి?
13 జలాగాధం గుండా వారిని నడిపించిన వాడేడి?
మైదానంలో గుర్రంలాగా వారు తొట్రుపడలేదు.
14 లోయలో దిగే పశువులలాగా వారు విశ్రమించేలా
యెహోవా ఆత్మ చేశాడు. నీకు ఘనమైన పేరు కలగాలని
నీ ప్రజలకు దారి చూపుతూ వచ్చావు.
15 పరలోకంనుంచి చూడు!
నీ దివ్యమైన పవిత్ర నివాసంలో నుంచి చూడు.
నీ ఆసక్తి, నీ ప్రభావం ఎక్కడున్నాయి?
మా పట్ల నీ కనికరం, నీ వాత్సల్యం అణగిపొయ్యాయా?
16  అయితే నీవు మాకు తండ్రివి.
అబ్రాహాము మమ్మల్ని తెలుసుకోకపోయినా,
ఇస్రాయేల్ మమ్మల్ని అంగీకరించకపోయినా,
యెహోవా, నీవే మా తండ్రివి. అనాది కాలంనుంచి
మా విముక్తిదాత అని నీకు పేరు.
17 యెహోవా, మమ్మల్ని నీ త్రోవలు తప్పిస్తున్నావెందుకు?
మాకు నీపట్ల భయభక్తులు ఉండకుండా మా హృదయాలను
ఎందుకు కఠిన పరుస్తున్నావు?
నీ సేవకుల కోసం, నీ సొత్తుగా ఉన్న గోత్రాల కోసం తిరిగి రా.
18  నీ పవిత్ర దేశం నీ ప్రజల స్వాధీనంలో ఉండడం
కొద్దికాలం మాత్రమే. ఇప్పుడు మా శత్రువులు
నీ పవిత్రాలయాన్ని త్రొక్కివేశారు.
19 నీవెన్నడూ పరిపాలించనివాళ్ళలాగా అయ్యాం.
నీ పేరు ఎన్నడూ ధరించనివాళ్ళలాగా అయ్యాం.