62
1 సీయోను నీతినిజాయితీ ఉదయ కాంతిలాగా కనబడేవరకు,దాని రక్షణ మండుతున్న దివిటీలాగా వెలిగేవరకు
సీయోను పక్షంగా నేను✽ మౌనం వహించను,
జెరుసలంకోసం ఊరుకోను.
2 ఇతర జనాలు✽ నీ నీతినిజాయితీని చూస్తారు.
రాజులందరూ నీ శోభను చూస్తారు.
నీకు క్రొత్త పేరు✽ పెట్టడం జరుగుతుంది.
ఆ పేరు యెహోవా తానే తెలియజేస్తాడు.
3 ✽నీవు యెహోవా చేతిలో అందమైన కిరీటంగా,
నీ దేవుని చేతిలో రాజ్యకిరీటంగా ఉంటావు.
4 అప్పటినుంచి నీవు విడవబడ్డదానివని ఎవరూ అనరు.
పాడైనదని✽ నీ దేశాన్ని గురించి అనరు.
నిన్ను “హెఫ్సీబా” అంటారు. నీ దేశాన్ని “బ్యూలా” అంటారు
ఎందుకంటే, నీవంటే యెహోవాకు చాలా ఇష్టం.
నీ దేశం వివాహితమవుతుంది.
5 ✽యువకుడు కన్యను పెళ్ళి చేసుకొనేవిధంగా
నీ కొడుకులు నిన్ను పెళ్ళి చేసుకొంటారు.
పెళ్ళికొడుకు పెళ్ళికూతురును చూచి సంతోషించే ప్రకారం
నీ దేవుడు నిన్ను చూచి సంతోషిస్తాడు.
6 ✽జెరుసలం! నీ గోడలమీద నేను కావలివారిని ఉంచాను.
రాత్రి గానీ పగలు గానీ వారు మౌనం వహించరు.
యెహోవాను ప్రార్థించేవారలారా! ఎప్పుడూ విశ్రమించవద్దు.
7 ఆయన జెరుసలంను సుస్థిరం చేసేవరకూ,
లోకమంతటా దానికి ప్రసిద్ధి కలిగించేవరకూ
ఆయనను విశ్రమించనియ్యవద్దు.
8 ✽తన కుడి చెయ్యితోడనీ తన బలమైన హస్తం తోడనీ
యెహోవా ఇలా ప్రమాణం చేశాడు:
“నేను నీ ధాన్యాన్ని నీ శత్రువులకు ఆహారంగా
ఇంక ఎన్నడూ ఇవ్వను. నీవు కష్టించి తీసిన ద్రాక్షరసాన్ని
విదేశీయులు పట్టుకొని త్రాగరు.
9 కోత కోసినవారే దానిని తింటారు, యెహోవాను స్తుతిస్తారు.
ద్రాక్షపండ్లు కోసినవారే నా పవిత్రాలయ✽ ఆవరణాలలో
వాటి రసం త్రాగుతారు.”
10 ✝సింహ ద్వారాల గుండా రండి! రండి!
జనాలకు త్రోవను సిద్ధం చేయండి. రాజమార్గాన్ని ఎత్తుగా చేయండి,
ఎత్తుగా చేయండి. రాళ్ళను ఏరి పారవేయండి.
జనాలకు పతాకమెత్తండి.
11 యెహోవా భూమి మీద కొనలవరకు ఇలా చాటింపు చేశాడు:
“సీయోను కుమార్తెకు ఈవిధంగా చెప్పు:
ఇదిగో నీకు చెందే విముక్తి వస్తూ ఉంది.
దానిని తెచ్చేవాని దగ్గర బహుమానాలున్నాయి.
ప్రతిఫలం ఆయనతో కూడా వస్తుంది✽.”
12 వారికి పవిత్ర✽ ప్రజలనీ యెహోవా విడుదల✽ చేసినవారనీ పేరు వస్తుంది.
నిన్ను కోరతగినదానివీ, విడవబడని నగరానివీ అంటారు.