61
1 “యెహోవాప్రభు ఆత్మ నామీద ఉన్నాడు.
పేదలకు శుభవార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు.
గుండె పగిలినవారిని బాగు చేయడానికీ,
ఖైదీలకు విడుదలనూ బంధితులకు బంధ విముక్తినీ
ప్రకటించడానికి నన్ను పంపాడు.
2 యెహోవా అనుగ్రహ సంవత్సరాన్ని, మన దేవుడు చేసే
ప్రతిక్రియ దినాన్ని చాటించడానికీ, దుఃఖించేవారందరినీ
ఓదార్చడానికీ ఆయన నన్ను పంపాడు.
3 బూడిదకు బదులు పూదండను, దుఃఖానికి బదులు ఆనంద తైలాన్ని,
క్రుంగిపోయిన మనసుకు బదులు స్తుతి వస్త్రాన్ని సీయోనులో
దుఃఖించేవారికి ఇవ్వడానికి ఆయన నన్ను పంపాడు.
నీతినిజాయితీ విషయంలో సిందూర వృక్షాలనీ
యెహోవా తన ఘనతకోసం నాటిన చెట్లనీ
వారిని గురించి అనడం జరుగుతుంది.”
4 పురాతన శిథిలాలను వారు మళ్ళీ నిర్మిస్తారు.
గతంలో పాడైపోయిన స్థలాలను పూర్వస్థితికి తెస్తారు.
తరతరాలనుంచి శిథిలమైపోయిన పట్టణాలను క్రొత్తవి చేస్తారు.
5 విదేశీయులు నిలుస్తూ మీ మందలను మేపుతూ ఉంటారు.
ఇతర దేశస్తులు పొలాలలో, ద్రాక్షతోటలలో మీకోసం పని చేస్తారు.
6 యెహోవా యాజులని మీగురించి అనడం జరుగుతుంది.
మన దేవుని సేవకులని వారు చెప్పుకొంటారు.
ఇతర జనాల ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారు.
వాటి సమృద్ధి పొంది అతిశయిస్తారు.
7  మీ అవమానానికి బదులు మీకు రెట్టింపు శ్రేయస్సు లభిస్తుంది.
నిందకు బదులు తమకు లభించిన భాగాన్ని బట్టి
నా ప్రజలు సంతోషిస్తారు.
తమ దేశంలో రెట్టింపు భాగం వారి స్వాధీనం అవుతుంది.
శాశ్వతానందం వారికి కలుగుతుంది.
8 “ఎందుకంటే న్యాయం జరిగించడం అంటే
యెహోవా అనే నాకు ప్రీతికరం. దోచుకోవడం,
చెడుతనం చేయడం అంటే నాకు అసహ్యం.
నేను నా ప్రజలకు నమ్మకంగా ప్రతిఫలమిస్తాను.
వారితో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను.
9 జనాలలో వారి సంతతివారు, జాతులలో
వారి సంతానం పేరు పొందుతారు.
వారు యెహోవా దీవించినవారని వారిని చూచేవారందరూ
ఒప్పుకొంటారు.”
10 యెహోవామూలంగా నేను అధికంగా ఆనందిస్తున్నాను!
నా దేవుని మూలంగా నా ఆత్మ ఉత్సాహపడుతూ ఉంది.
ఎందుకంటే పెళ్ళికొడుకు అందమైన తలపాగా ధరించుకొన్నట్టు,
పెళ్ళికూతురు నగలతో అలంకరించుకొనే విధంగా
ఆయన నాకు విముక్తి వస్త్రాలు ధరింపజేశాడు.
ఆయన న్యాయం అనే అంగీని నాకు తొడిగించాడు.
11 భూమి మొక్కను మొలిపించే విధంగా,
తోట విత్తనాలను అంకురింపజేసినట్టు జనాలన్నిటి ఎదుటా
యెహోవాప్రభువు న్యాయాన్నీ స్తుతినీ అంకురించేలా చేస్తాడు.