60
1 “నీకు✽ వెలుగు వచ్చింది, గనుక లేచి ప్రకాశించు✽!యెహోవా శోభ నీమీద ఉదయించింది.
2 ✽చూడు, భూమిని చీకటి కమ్ముతూ ఉంది.
కటిక చీకటి జనాలను కమ్ముతూ ఉంది.
అయితే యెహోవా నీమీద ఉదయిస్తూ ఉన్నాడు.
ఆయన శోభ నీమీద కనబడుతూ ఉంది.
3 ✽జనాలు నీ వెలుగుకు వస్తారు.
రాజులు నీ ఉదయ కాంతికి వస్తారు.
4 ✝“తలెత్తి చుట్టూరా చూడు. అందరూ సమకూడి
నీ దగ్గరికి వస్తూ ఉన్నారు. నీ కొడుకులు దూరంనుంచి
వస్తూ ఉన్నారు. నీ కూతుళ్ళు చంకనెత్తబడి వస్తూ ఉన్నారు.
5 నీవు చూచేటప్పుడు కాంతిమయుడవు✽ అవుతావు.
నీ గుండె సంతోషంతో✽ కొట్టుకొంటూ ఉప్పొంగిపోతుంది.
సముద్ర సమృద్ధి నీ దగ్గరికి తేవడం జరుగుతుంది.
జనాల ఐశ్వర్యం✽ నీ దగ్గరికి వస్తుంది.
6 ఒంటెల గుంపులు – మిద్యాను✽నుంచీ ఏయిఫానుంచీ వచ్చిన
ఒంటెల గుంపులు నీ దేశమంతటా వ్యాపిస్తాయి.
షేబ✽ దేశంవారంతా బంగారాన్నీ ధూపద్రవ్యాన్నీ తీసుకువస్తారు.
వారు యెహోవా కీర్తిని ప్రకటిస్తూ✽ ఉంటారు.
7 కేదారు✽ ప్రాంతం గొర్రెల, మేకల మందలన్నీ
నీ దగ్గరికి సమకూడుతాయి.
నెబాయోతు✽ ప్రాంతం పొట్టేళ్ళు నీ సేవలో ఉపయోగపడుతాయి.
అని నా బలిపీఠంమీద బలులు✽గా అంగీకారం అవుతాయి.
నేను నా ఘనమైన ఆలయాన్ని ఘనంగా చేస్తాను.
8 “మేఘాలలాగా, తమ గూళ్ళకు ఎగసివచ్చే
గువ్వలలాగా ఎగిరివస్తూవున్న మీరెవరు?
9 ✽ద్వీపవాసులు నాకోసం తప్పక చూస్తారు.
నీ దేవుడు యెహోవా నిన్ను ఘనపరచినందుచేత✽
ఇస్రాయేల్ పవిత్రుడైన ఆయన పేరుప్రతిష్ఠల కారణంగా
తర్‌షీషు✽ ఓడలు ముందు వస్తాయి.
అవి నీ కొడుకులను తమ వెండి బంగారాలతో కూడా
దూరంనుంచి తెస్తాయి.
10 ✽“విదేశీయులు నీ గోడలను నిర్మిస్తారు.
వారి రాజులు నీకు సేవ చేస్తారు. నేను నిన్ను కోపంతో కొట్టినా✽,
అనుగ్రహంతో నీమీద జాలిపడుతాను✽.
11 ✽మనుషులు ఇతర దేశాల ఐశ్వర్యాన్ని నీ దగ్గరికి తెచ్చేందుకు
నీ ద్వారం తలుపులు రాత్రింబగళ్ళు మూసివేయడం జరగదు.
అవి ఎప్పటికీ తెరచి ఉంటాయి. ఆ జనాల ఊరేగింపులో
రాజులు ఉంటారు.
12 ✽నిన్ను సేవించడానికి నిరాకరించే జనం గానీ రాజ్యం గానీ
నాశనం అవుతుంది. అలాంటి వాటిని నిర్మూలం చేయడం
తప్పక జరుగుతుంది.
13 “నా పవిత్రాలయమున్న స్థలానికి అలంకారంకోసం
లెబానోను✽లోని మేలిరకమైన దేవదారు వృక్షాలూ సరళ వృక్షాలూ
గొంజిచెట్లూ నీ దగ్గరికి తెస్తారు.
నా పాదాలు పెట్టుకొనే స్థలాన్ని నేను ఘనంగా చేస్తాను.
14 ✽నిన్ను బాధించినవారి కొడుకులు నీ ఎదుటికి వచ్చి సాగిలపడుతారు.
నిన్ను తృణీకరించినవాళ్ళంతా వచ్చి నీ పాదాలమీద పడుతారు.
నిన్ను ‘యెహోవా నగరం✽’ అనీ ‘ఇస్రాయేల్‌ప్రజల
పవిత్రుడి సీయోను’ అనీ అంటారు.
15 “నీవు విసర్జనకూ ద్వేషానికీ గురి కావడానికీ,
నీ మార్గాన దాటేవాళ్ళు✽ ఎవరూ లేకపోవడానికీ బదులుగా
శాశ్వతమైన శోభ✽గా ఉండేలా నిన్ను మారుస్తాను.
తరతరాలకు సంతోషకారణంగా నిన్ను చేస్తాను.
16 నీవు జనాల పాలు కుడుస్తావు✽. రాజుల చనుపాలు త్రాగుతావు.
అప్పుడు✽ నేనే – యెహోవాను – నీ రక్షకుణ్ణి అనీ
యాకోబు బలవంతుడైన దేవుణ్ణి అనీ విముక్తి దాతను అనీ
నీవు తెలుసుకొంటావు.
17 నేను కంచుకు బదులు బంగారాన్నీ✽ తెప్పిస్తాను.
ఇనుముకు బదులు వెండిని, కర్రకు బదులు కంచును,
రాళ్ళకు బదులు ఇనుమును తెప్పిస్తాను.
నేను నీకు శాంతిని అధికారిగా, న్యాయాన్ని✽ పరిపాలకుడుగా నియమిస్తాను.
18 అప్పటినుంచి నీ దేశంలో దౌర్జన్యం✽ అనే మాట కూడా వినబడదు.
నీ సరిహద్దులో పాడు, నాశనం ఏమీ ఉండవు.
నీ గోడలను ‘విముక్తి✽’, నీ ద్వారాలను ‘స్తుతి’ అంటావు.
19 ✽“అప్పటినుంచి పగటివేళ ప్రొద్దు నీకు వెలుగుగా ఉండదు.
వెన్నెల నీమీద ప్రకాశించదు. యెహోవా తానే నీకు
శాశ్వత కాంతిగా ఉంటాడు. నీ దేవుడు నీకు శోభగా ఉంటాడు.
20 నీ ప్రొద్దు ఇంకా ఎన్నడూ క్రుంకదు, నీ వెన్నెల తగ్గదు.
యెహోవా తానే నీకు శాశ్వతమైన కాంతిగా ఉంటాడు.
నీ దుఃఖ దినాలు✽ అంతం అవుతాయి.
21 అప్పుడు నీ ప్రజలందరూ న్యాయవంతులు✽గా ఉంటారు.
దేశం✽ శాశ్వతంగా వారి స్వాధీనంలో ఉంటుంది.
వారు నా ఘనత✽కోసం నేను నాటిన✽ అంకురం,
నేను చేతులతో చేసిన పని.
22 మీలో అందరికంటే అల్పుడు వేయిమంది✽ అవుతాడు,
చిన్నవాడు బలమైన జనం అవుతాడు.
నేను యెహోవాను. తగిన కాలంలో దీనిని త్వరగా✽ జరిగిస్తాను.”