59
1 ఇదిగో వినండి! యెహోవా హస్తం రక్షించలేనంత
కురుచ కాలేదు! ఆయన చెవులు వినలేనంత మందం కాలేదు!
2 మీ అపరాధాలు మీకూ మీ దేవునికి అడ్డంగా వచ్చాయి.
మీ పాపాలు ఆయన ముఖం మీకు కనబడకుండా చేశాయి.
అందుచేత ఆయన వినడం లేదు.
3 మీ చేతులు రక్తంచేత, మీ వ్రేళ్ళు
అపరాధాలచేత అపవిత్రమయ్యాయి.
మీ పెదవులు అబద్ధాలాడుతున్నాయి.
మీ నాలుకలు కుటిలమైన మాటలు పలుకుతాయి.
4 ఎవడూ న్యాయంగా దావా చేయడం లేదు,
ఎవడూ నిజాయితీతో వ్యాజ్యెమాడడం లేదు.
అందరూ వట్టి కబుర్లమీద ఆధారపడి, మోసంగా మాట్లాడుతారు.
చెడుగును గర్భం ధరించి అపరాధాన్ని కంటారు.
5 వాళ్ళు మిణ్ణాగుల గుడ్లను పొదుగుతారు,
సాలెపురుగు గూడు నేస్తారు.
ఆ గుడ్లు తినేవాళ్ళు చచ్చిపోతారు.
వాటిలో ఒకటి పగిలితే విష సర్పం బయటికి వస్తుంది.
6 వాళ్ళ సాలెగూడు వాళ్ళకు వస్త్రం కాబోదు.
వాళ్ళు నేసినదానితో కప్పుకోలేరు.
వాళ్ళ పనులు పాపిష్టి పనులు.
వాళ్ళు చేతులతో దౌర్జన్యం చేస్తారు.
7 వాళ్ళ పాదాలు అపరాధం చేయడానికి పరుగెత్తుతూ ఉన్నాయి.
నిరపరాధుల రక్తాన్ని చిందించడానికి
అవి వేగిరపడుతూ ఉన్నాయి.
వాళ్ళ తలంపులు పాపిష్ఠి తలంపులు.
వాళ్ళ త్రోవలలో నాశనం, ధ్వంసం ఉన్నాయి.
8 శాంతిమార్గం వాళ్ళకు ఏమీ తెలియదు.
వాళ్ళ నడతలో న్యాయం కనబడదు.
వాళ్ళు వంకర మార్గాలను కల్పించుకొన్నారు.
ఆ మార్గాలలో నడిచేవాళ్ళకు శాంతి కలగదు.
9 అందుచేత న్యాయం మాకు దూరంగా ఉంది.
నీతినిజాయితీ మమ్మల్ని అందుకోవడం లేదు.
వెలుగు కోసం చూస్తూ ఉన్నాం గాని,
అంతా చీకటిగానే ఉంది. కాంతి కోసం చూస్తూ ఉన్నాం గాని,
అంధకారంలోనే నడుస్తూ ఉన్నాం.
10 గుడ్డివారిలాగా గోడకోసం తడవులాడుతూ,
కళ్ళు లేని వారిలాగా తడవులాడుతూ ఉన్నాం.
మధ్యాహ్న కాలంలో మునిచీకటి అయినట్టు
కాలు జారి పడుతున్నాం. బలిసిన వాళ్ళమధ్య
మేము చచ్చినవాళ్ళలాగా ఉన్నాం.
11 మేమందరమూ ఎలుగుబంట్లలాగా ‘గుర్రు’ మంటున్నాం.
గువ్వలలాగా దుఃఖరావం చేస్తున్నాం.
న్యాయంకోసం చూస్తూ ఉన్నాం గాని,
అది చేకూరడం లేదు. విముక్తికోసం చూస్తూ ఉన్నాం గాని,
అది మాకు దూరంగా ఉంది.
12 నీ ఎదుట మా అక్రమకార్యాలు అనేకం.
మా అపరాధాలు మామీద సాక్ష్యం పలుకుతున్నాయి.
మా అక్రమకార్యాలు మాకు కనిపిస్తూనే ఉన్నాయి,
మా దోషాలు మాకు తెలిసే ఉన్నాయి –
13 యెహోవామీద తిరుగుబాటు, ద్రోహం చేశాం.
మా దేవునినుంచి తొలగిపోయాం.
దౌర్జన్యాన్నీ అవిధేయతనూ ప్రోత్సహించాం.
ఆంతర్యంలో కల్పించుకొన్న అబద్ధాలు చెప్పాం.
14 గనుక న్యాయానికి ఆటంకం కలిగింది.
ధర్మం దూరంగా నిలిచి ఉంది. సత్యం వీధులలో పడివుంది.
నిజాయితీ లోపలికి రాలేకపోతున్నది.
15 విశ్వసనీయత ఇక్కడ లేదు.
చెడుగును విసర్జించేవాడెవడైనా దోపిడీకి గురి అవుతాడు.
న్యాయం జరగకపోవడం చూచి యెహోవా నొచ్చుకొన్నాడు.
16 ప్రజలలో వారికోసం విన్నపం చేసే ఏ మనిషీ లేకపోవడం చూశాను.
అది ఆయనకు ఘోరం అనిపించింది.
అందుచేత తన సొంత హస్తం ఆయనకు
విజయం చేకూర్చింది.
తన న్యాయం ఆయనకు ఆధారంగా ఉంది.
17 న్యాయాన్ని వక్షానికి కవచంగా ధరించుకొన్నాడు.
విముక్తిని శిరస్త్రాణంగా ధరించుకొన్నాడు.
ప్రతీకారమనే దుస్తులు వేసుకొన్నాడు.
ఆసక్తిని పైవస్త్రంగా వేసుకొన్నాడు.
18 వాళ్ళు చేసినవాటి ప్రకారం ఆయన ప్రతీకారం చేస్తాడు.
తన శత్రువులకు ఆగ్రహం చూపుతాడు.
తన విరోధులకు ప్రతిక్రియ చేస్తాడు.
ద్వీపవాసులకు కూడా ప్రతిఫలం ఇస్తాడు.
19 పడమటి దిక్కున ఉన్నవారికి యెహోవా పేరుపట్ల
భయభక్తులు కలుగుతాయి.
ఆయన వైభవం అంటే ప్రొద్దు పొడిచేదిక్కున
ఉన్నవారికి భయభక్తులు కలుగుతాయి.
యెహోవా ఊపిరికి కొట్టుకుపోయే ప్రవాహంలాగా ఆయన వస్తాడు.
20 “విమోచకుడు సీయోనుకు వస్తాడు.
యాకోబు వంశంవారిలో తమ అక్రమకార్యాలనుంచి
నావైపు తిరిగేవారి దగ్గరికి వస్తాడు”
అని యెహోవా అంటున్నాడు.
21 “నేను వారితో చేసే ఒడంబడిక ఇది: నీమీద ఉన్న నా ఆత్మ ఎప్పుడూ తొలగిపోడు. నేను నీ నోట ఉంచిన మాటలు నీ నోటినుంచీ నీ పిల్లల నోటినుంచీ నీ పిల్లల పిల్లల నోటినుంచీ ఆ కాలం మొదలుకొని ఎప్పటికీ తొలగిపోవు. ఇది యెహోవా వాక్కు.”