58
1 ✽“బూరలాగా నీ కంఠమెత్తి బిగ్గరగా చాటించు.బిగపట్టకు. నా ప్రజలు చేసిన తిరుగుబాటు
వారికి తెలియజెయ్యి.
యాకోబు వంశంవారు చేసిన అపరాధాలు వారికి తెలియజెయ్యి.
2 ✽తన దేవుని ఆజ్ఞలను విడవని జనమైనట్టు,
నిజాయితీని అనుసరించే జనమైనట్టు ప్రతి రోజూ వారు
నన్ను వెదకుతూ ఉంటారు.
నా విధానాలను తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు.
న్యాయమైన తీర్పులు తీర్చాలని నన్ను అడుగుతారు.
దేవుడు తమను సమీపించాలని ఆశిస్తారు.
3 ‘మేమెందుకు ఉపవాసమున్నాం? నీవు చూడలేదు.
మమ్మల్ని మేము ఎందుకు అణచుకొన్నాం?
నీవు గమనించలేదు’ అని వారు అడుగుతారు.
“అయితే మీ ఉపవాస దినాన మీకిష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు.
మీ పనివారిచేత కఠినమైన పని చేయించుకొంటారు✽.
4 ✽మీరు ఉపవాసమున్నప్పుడు జగడమాడుతారు,
పోట్లాడుతారు, అన్యాయంగా దెబ్బలాడుతారు.
మీరు ఈ రోజుల్లో ఉపవాసముండేది
మీ స్వరం పరమ స్థలంలో వినబడాలని కాదు.
5 నేను ఆమోదించే ఉపవాసం ఇలాంటిదే అనుకొంటున్నారా?
మనిషి తనను అణచుకోవడం మాత్రమే చాలనుకొంటున్నారా?
జమ్ము రెల్లులాగా తల వంచుకొని, గోనెపట్ట, బూడిద
పరచుకొని కూర్చోవడం ఉపవాసమనీ, యెహోవాకు ప్రీతికరమైన
దినమనీ అనుకొంటున్నారా?
6 ✽“నేను ఆమోదించే ఉపవాసమేమిటంటే,
దుర్మార్గులు వేసిన సంకెళ్ళను విప్పడం,
కాడిమాను త్రాళ్ళు తీయడం,
దౌర్జన్యానికి గురి అయినవారిని విడిపించి
ప్రతి కాడినీ విరుగగొట్టడం.
7 నీ ఆహారం ఆకలిగొన్నవారికి పంచియివ్వడం,
ఇల్లు వాకిలి లేక తిరుగాడవలసిన బాధితులకు
నీడపట్టును అమర్చడం, బట్టలు లేనివారు
కనిపిస్తే వారికి బట్టలు ఇవ్వడం, నీ రక్తసంబంధులకు
ముఖం తప్పించకపోవడం.
8 ✽నీవు అలా చేస్తే నీ వెలుగు ఉదయకాంతిలాగా అవుతుంది.
ఆరోగ్యం నీకు త్వరలో చేకూరుతుంది.
నీ నీతినిజాయితీ నీ ముందర నడుస్తుంది.
యెహోవా మహత్వం నీ వెనుక కావలి కాస్తుంది.
9 అప్పుడు నీవు పిలిస్తే యెహోవా జవాబిస్తాడు.
సహాయంకోసం మొరపెట్టేటప్పుడు ఆయన
‘ఇదిగో ఇక్కడే ఉన్నాను’ అంటాడు.
“ఇతరులను అణచివేయడం, వ్రేలు పెట్టి చూపి నిందించడం,
మోసంగా మాట్లాడడం నీవు మానుకొంటే,
10 ఆకలిగొన్నవారికి నీదానిలో నుంచి ఇచ్చి,
బాధితుల అక్కరలను తీర్చి వారిని తృప్తిపరస్తే
చీకటిలో నీ వెలుగు ఉదయిస్తుంది.
రాత్రివేళ నీకు మధ్యాహ్నంలాగా అవుతుంది.
11 యెహోవా ఎప్పటికీ నీకు దారి చూపుతూ ఉంటాడు.
ఎండిపోయిన ప్రాంతంలో కూడా నీ అక్కరలను తీర్చి
నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుస్తాడు.
నీవు నీరు కట్టిన తోటలాగా ఉంటావు.
నీళ్ళు ఎప్పుడూ తప్పని ఊటలాగా ఉంటావు.
12 నీ ప్రజలు పురాతన శిథిలాలను మళ్ళీ నిర్మిస్తారు.
అనేక తరాలనుంచి పాడుగా ఉన్న పునాదులను
నీవు మళ్ళీ వేస్తావు.
మనుషులు నిన్ను ‘బీటలను బాగు చేసేవాడు’ అంటారు,
‘నివాసాలకోసం వీధులను మరమ్మత్తు చేసేవాడు’ అంటారు.
13 “నీవు నా విశ్రాంతిదినాన్ని✽ కాలదన్నకుండా,
నా పవిత్ర దినాలలో నీకిష్టం వచ్చినట్టు వ్యవహరించకుండా
విశ్రాంతిదినం సంతోషకరమైన దినంగా,
యెహోవా పవిత్ర దినం ఘనమైనదిగా భావించుకొంటే✽,
నీ సొంత విధానాలను విడిచి,
నీకిష్టం వచ్చినట్టు వ్యవహరించకుండా,
పనిలేని మాటలు✽ అనకుండా, నా దినాన్ని గౌరవిస్తే,
14 నీకు యెహోవా మూలంగా ఆనందం✽ కలుగుతుంది.
దేశంలో ఎత్తయిన స్థలాలమీదికి నేను నిన్ను ఎక్కిస్తాను.
నీ పూర్వీకుడైన యాకోబుయొక్క వారసత్వాన్ని
అనుభవించేలా చేస్తాను.
ఇది యెహోవా నోటినుంచి వెలువడ్డ మాట.”