57
1 ✽న్యాయవంతులు నాశనం అవుతున్నారు గాని,దాని విషయం ఎవరూ తలపోయరు.
భక్తిపరులను తీసివేయడం జరుగుతున్నది గాని,
ఎవరూ గ్రహించరు. కీడు చూడకుండేలా న్యాయవంతులను
తీసివేయడం జరుగుతుంది.
2 వారు శాంతి✽లోకి ప్రవేశిస్తారు.
యథార్థంగా ప్రవర్తించేవారు
తమ పాడెలమీద విశ్రమిస్తారు✽.
3 “అయితే మంత్రకత్తె కొడుకులారా!
వేశ్య, జారుడి సంతానమా✽! మీరు✽ ఇక్కడికి రండి!
4 మీరు ఎవణ్ణి చూచి నోరు బాగా తెరచి
నాలుక చాపుతున్నారు✽?
మీరు తిరుగబడే వాళ్ళు, అబద్ధికులు.
5 సిందూర వృక్షాలలో, పచ్చని ప్రతి చెట్టు✽క్రిందా
మీరు కామాగ్నిలో మాడిపోతున్నారు.
కనుమలలో, బండల సందులలో పిల్లలను✽
చంపి బలిగా అర్పిస్తున్నారు.
6 లోయలో ఉన్న రాళ్ళే మీ భాగం.
అవే మీ వంతు. వాటికే పానార్పణ పోస్తున్నారు.
వాటికే నైవేద్యాలు అర్పిస్తున్నారు.
ఇలా జరుగుతూ ఉంటే నాకు దయ రావాలా?
7 “ఎత్తయిన, ఉన్నతమైన కొండ✽మీద నీ పరుపు✽
వేసుకొన్నావు. బలులు అర్పించడానికి
నీవు అక్కడికే ఎక్కిపోయావు.
8 ✽నీవు తలుపుల వెనుక, ద్వారం బంధాల వెనుక
నీ స్మృతి చిహ్నం✽ ఉంచావు.
నన్ను వదిలిపెట్టి బట్టలు విడిచి మంచమెక్కావు.
నీ పరుపు వెడల్పు చేసుకొన్నావు.
ఎవరి మంచాన్ని నీవు ప్రేమించావో
వాళ్ళతో ఒడంబడిక చేసుకొన్నావు.
వాళ్ళ దిగంబరత్వాన్ని చూశావు.
9 ఆలీవ్‌నూనె తీసుకొని రాజు✽దగ్గరికి వెళ్ళిపోయావు.
పరిమళ ద్రవ్యాలు ఎక్కువగా సంపాదించుకొన్నావు.
నీ రాయబారులను దూరానికి పంపావు.
మృత్యు లోకం✽ వరకు దిగజారిపోయావు.
10 ✽నీ దీర్ఘ ప్రయాణాలవల్ల నీవు అలసిపోయావు.
అయినా మళ్ళీ ప్రాణం వచ్చినట్టయింది,
గనుక నీవు నీరసించిపోలేదు.
11 ✽“నీవు ఎవణ్ణి చూచి భయపడి, హడలిపోయి,
అబద్ధికుడివై, నన్ను జ్ఞాపకం చేసుకోకుండా
ఆలోచించకుండా ఉన్నావు?
చాలా కాలంనుంచి నేను ఊరుకొన్నందుచేతేనా✽
నీవు నాకు భయపడడం లేదు✽?
12 నీ నీతినిజాయితీ✽ ఎంతో, నీ క్రియలు
ఎలాంటివో నేను వెల్లడి చేస్తాను.
వాటివల్ల నీకు ఏమీ ప్రయోజనం ఉండదు.
13 ✽ నీవు సహాయంకోసం కేకలు పెట్టేటప్పుడు
నీ విగ్రహాల గుంపు నిన్ను రక్షించాలి!
వాటన్నిటినీ గాలి ఎగరగొట్టివేస్తుంది.
ఉఫ్‌మని ఊదితే అవన్నీ కొట్టుకుపోతాయి.
అయితే నన్ను నమ్ముకొన్నవారికి దేశం✽
వారసత్వంగా లభిస్తుంది. నా పవిత్ర పర్వతం
వారి స్వాధీనంలోకి వస్తుంది.”
14 ✽ఈ విధంగా ఆయన ఆజ్ఞ జారీ చేస్తాడు:
“ఎత్తు చేయండి! ఎత్తు చేయండి!
త్రోవ✽ను సిద్ధం చేయండి.
అడ్డంగా ఉన్నవాటిని నా ప్రజల
దారినుంచి తీసివేయండి.”
15 ఎందుకంటే, ఉన్నతంగా✽ ఉన్న ఆ మహాఘనుడు,
పవిత్రుడు✽ అనే పేరు ఉన్న ఆ శాశ్వతుడు
ఇలా అంటున్నాడు:
“ఉన్నతంగా ఉన్న పవిత్ర స్థలంలో
నేను నివసిస్తూ ఉన్నాను.
అహంభావం లేని వారి ఆత్మను బ్రతికించడానికి✽,
నలిగిన హృదయం గలవారి హృదయాన్ని బ్రతికించడానికి
నేను నలిగిన హృదయం గలవారి దగ్గర,
అహంభావం లేనివారి దగ్గర కూడా నివసిస్తూ ఉన్నాను.
16 ✽“నేను శాశ్వతంగా వాదిస్తూ ఉండను.
ఎల్లప్పుడూ కోపంగా ఉండను. అలాగుంటే,
మనిషి ఆత్మ నీరసించి పోతుంది,
నేను సృజించిన మనుషులు క్షీణించిపోతారు.
17 ✽అన్యాయార్జిత లాభంకోసం అతడు చేసిన
అపరాధం చూచి, నేను కోపగించి అతణ్ణి కొట్టాను.
అతడికి నా ముఖాన్ని కనబడకుండా కోపంతో
దాచుకొన్నాను. అతడు తిరుగుబాటు చేస్తూ,
తనకిష్టమైన త్రోవలో నడుస్తూ వచ్చాడు.
18 అతడి ప్రవర్తన చూశాను. అయితే అతణ్ణి బాగు చేస్తాను.
అతడికి దారి చూపుతాను.✽
అతణ్ణి, అతడితో దుఃఖించేవారిని ఓదారుస్తాను.✽
19 వారి పెదవులతో స్తుతి మాటలు పుట్టిస్తాను.
దూరంగా ఉన్నవారికి, దగ్గరగా✽ ఉన్న వారికి శాంతి,
శాంతి అంటూ వారిని బాగు చేస్తాను.
ఇది యెహోవా వాక్కు.”
20 ✽ అయితే దుర్మార్గులు, బురదనూ మైలనూ
పైకి వేస్తూ ఎప్పుడూ కదులుతూ విశ్రమించలేని
సముద్రంలాంటివాళ్ళు.
21 “దుర్మార్గులకు శాంతి అంటూ ఉండదు”
అని నా దేవుడు అంటున్నాడు.