56
1 యెహోవా అంటున్నాడు:
“నా రక్షణ ఆసన్నమైంది. నా నీతినిజాయితీ
త్వరలో వెల్లడి అవుతుంది, గనుక న్యాయాన్ని
పాటించండి, నిజాయితీతో ప్రవర్తించండి.
2 ఇలా బ్రతుకుతూ, ఈ సంగతులలో
దృఢంగా నిలుస్తూ ఉండేవ్యక్తి ధన్యజీవి.
విశ్రాంతిదినాన్ని అపవిత్రం చేయక దానిని పాటిస్తూ,
తన చేయి ఏ చెడుగూ చేయనియ్యకుండా
ఉండేవ్యక్తి ధన్యజీవి.”
3 యెహోవాపక్షం చేరిన ఏ విదేశీయుడూ
“యెహోవా తన ప్రజలోనుంచి నన్ను వెలివేసితీరతాడు”
అనుకోకూడదు.
ఏ నపుంసకుడూ “నేను ఎండిన చెట్టును” అనుకోకూడదు.
4 యెహోవా ఇలా అంటున్నాడు:
“నా విశ్రాంతిదినాలను పాటిస్తూ,
నాకు ఇష్టమైనవాటిని కోరుకొంటూ,
నా ఒడంబడికలో దృఢంగా నిలుస్తూవుండే నపుంసకులకు
5 నా ఆలయంలో నా గోడలలోపల ఒక భాగం ఇస్తాను.
కొడుకులకంటే, కూతుళ్ళకంటే మంచి పేరుప్రతిష్ఠలు
వారికి ప్రసాదిస్తాను.
శాశ్వతమైన పేరుప్రతిష్ఠలు ప్రసాదిస్తాను.
వాటిని ఎన్నటికీ కొట్టివేయడం జరగదు.
6 విదేశీయులు ఆయనకు సేవ చేయడానికి,
ఆయన పేరును ప్రేమించి ఆయనను
ఆరాధించడానికి యెహోవా పక్షం చేరితే,
విశ్రాంతిదినాన్ని అపవిత్రం చేయక పాటిస్తూ,
నా ఒడంబడికలో దృఢంగా నిలుస్తూ ఉంటే,
7 వారిని నా పవిత్ర పర్వతానికి తీసుకువస్తాను.
నా ప్రార్థనాలయంలో వారిని ఆనందించేలా చేస్తాను.
నా బలిపీఠంమీద వారు సమర్పించే హోమాలూ బలులూ
నాకు అంగీకారంగా ఉన్నాయి.
ఎందుకంటే నా ఆలయం జనాలన్నిటికీ
ప్రార్థన ఆలయమని అంటారు.”
8 ఇస్రాయేల్ ప్రజలలో చెదరిపోయినవారిని సమకూర్చే
యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు:
“ఇంతకుముందు నేను సమకూర్చినవారు గాక
ఇతరులను కూడా వారిదగ్గరికి సమకూరుస్తాను.”
9 పొలంలో ఉన్న జంతువులారా!
అడవిలో ఉన్న మృగాల్లారా! రండి! తినండి!
10 ఈ ప్రజల కావలివాళ్ళు గుడ్డివాళ్ళు.
వాళ్ళందరూ తెలివితక్కువవాళ్ళు.
వాళ్ళందరూ మొరగలేని మూగ కుక్కలలాంటివాళ్ళు.
పడుకొని కలలు కంటారు. నిద్ర అంటే వాళ్ళకు చాలా ఇష్టం.
11 వాళ్ళు తిండికోసం అత్యాశ ఉన్న కుక్కలలాంటివాళ్ళు.
ఎంత తిన్నా వాళ్ళకు తృప్తి కలగదు.
వాళ్ళు తెలివి లేని కాపరులు.
వాళ్ళందరూ తమకిష్టమైన త్రోవకు తొలగేవాళ్ళు.
ప్రతివాడూ స్వలాభంకోసం వెదకుతాడు.
12 వాళ్ళు అంటారు, “నేను ద్రాక్షమద్యం తెప్పిస్తాను.
సారాయి కడుపునిండా త్రాగుదాం రండి.
రేపు ఈ రోజులాగా ఉంటుంది. ఇంకా చాలా బాగుంటుంది.”