55
1 ✽“దప్పిగొన్నవారలారా✽!మీరంతా నీళ్ళ దగ్గరికి రండి✽.
డబ్బు లేని వారలారా! మీరు వచ్చి, కొని, తినండి!
రండి! డబ్బు లేకుండానే✽, ఏమీ ఇవ్వకుండానే
ద్రాక్షరసం, పాలు✽ కొనండి!
2 ఆహారం కానిదానికి డబ్బు ఎందుకు✽ ఖర్చు చేస్తారు?
తృప్తి కలిగించనిదానికి మీ కష్టార్జితం ఎందుకిస్తారు?
నా మాట వినండి✽.
3 “చెవి ఒగ్గి నాదగ్గరికి రండి, నా మాట వినండి.
అప్పుడు మీ ప్రాణం దక్కించుకొంటారు✽.
నేను మీతో శాశ్వతంగా నిలిచివుండే ఒడంబడిక చేస్తాను.
దావీదుకు వాగ్దానం చేసిన అమోఘమైన
అనుగ్రహం మీకు చూపిస్తాను.
4 నేను జనాలకు అతణ్ణి✽ సాక్షిగా నియమించాను,
జనాలకు నాయకుడుగా, అధిపతిగా నియమించాను.
5 నీకు తెలియని జనాలను నీవు పిలుస్తావు.
నీ దేవుడైన యెహోవా నిన్ను✽ ఘనపరచాడు.
ఆయన ఇస్రాయేల్ ప్రజల పవిత్రుడు.
నిన్ను ఎరగని జనాలు ఆయనకారణంగా
నీ దగ్గరికి త్వరగా వస్తాయి.”
6 యెహోవా మీకు దొరికే✽ సమయంలో
ఆయనను వెదకండి✽. ఆయన దగ్గరగా ఉండగానే
ఆయనను వేడుకోండి✽.
7 ✽ దుర్మార్గులు తమ మార్గం విడిచిపెట్టాలి.
చెడ్డవారు తమ తలంపులను✽ మానాలి.
వారు యెహోవావైపు తిరగాలి.
అప్పుడు ఆయన వారిని కరుణిస్తాడు.
వారు మన దేవునివైపు తిరిగితే
ఆయన అధికంగా క్షమిస్తాడు✽.
8 ✽యెహోవా చెప్పేదేమిటంటే, “నా ఆలోచనలు
మీ ఆలోచనలలాంటివి కావు.
మీ విధానాలు నా విధానాలలాంటివి కావు.
9 ✽ ఆకాశాలు భూమికంటే ఎత్తుగా ఉన్నాయి.
అలాగే నా విధానాలు మీ విధానాలకంటే,
నా ఆలోచనలు మీ ఆలోచనలకంటే
ఉన్నతంగా ఉన్నాయి.
10 ✽వాన, మంచు ఆకాశంనుంచి వచ్చి
భూమిని తడుపుతాయి,
దానినుంచి మొక్కలు మొలిపించి ఫలించేలా చేసి,
చల్లడానికి విత్తనాలనూ తినడానికి ఆహారాన్నీ ఇస్తాయి.
అలా చేస్తేనే తప్ప అవి ఆకాశానికి తిరిగిపోవు.
11 నా నోటనుంచి వెలువడ్డ వాక్కు అలాగే ఉంటుంది.
అది నిష్ఫలంగా నాదగ్గరికి తిరిగి రాదు.
అది నా సంకల్పాన్ని నెరవేరుస్తుంది,
నేను పంపించిన ఉద్దేశాన్ని సాధిస్తుంది.
12 ✽“మీరు సంతోషంతో బయలుదేరుతారు.
మిమ్మల్ని శాంతితో బయటికి నడిపించడం జరుగుతుంది.
మీ ఎదుట పర్వతాలు, కొండలు
ఆనంద ధ్వనులు చేస్తాయి.
మైదానంలో చెట్లన్నీ చప్పట్లు కొడతాయి.
13 ముండ్ల చెట్లకు బదులు దేవదారు వృక్షాలు మొలుస్తాయి.
దురదగొండి చెట్లకు బదులు గొంజి చెట్లు పెరుగుతాయి.
అది యెహోవాకు పేరుప్రతిష్ఠలు✽ తెస్తుంది.
నశించని నిత్యమైన గుర్తుగా ఉంటుంది.