54
1 ✽యెహోవా ఇలా అంటున్నాడు:“గొడ్రాలా! పిల్లలను ఎన్నడూ కననిదానా!
ఆనంద గీతం పాడు✽.
ఎన్నడూ ప్రసవవేదన పడనిదానా!
ఆనందగీతమెత్తి సంతోషించు.
ఎందుకంటే, భర్త ఉన్న స్త్రీ పిల్లలకంటే
విడవబడ్డదాని పిల్లలు ఎక్కువమంది.
2 నీ గుడారమున్న స్థలాన్ని పెద్దదిగా చెయ్యి.
నీ డేరా తెరలను ఇంకా పొడిగించు.
వెనక్కు పట్టి ఉంచకు.
నీ త్రాళ్ళను పొడుగు చెయ్యి.
నీ మేకులను బలపరచు.
3 ఎందుకంటే నీవు కుడివైపుకూ ఎడమవైపుకూ
వ్యాపిస్తావు. నీ సంతానం ఇతర జనాల
దేశాలను స్వాధీనం చేసుకొంటారు,
వాటి పాడైన పట్టణాలను నివాస స్థలాలుగా చేస్తారు.
4 ✽“భయపడకు. నీవు అవమానాన్ని మరచిపోతావు.
సిగ్గుపాలు కాబోవు. నీకు తలవంపులు కలగవు.
యువదశలో నీకు కలిగిన అవమానాన్ని✽
నీవు మరచిపోతావు.
వితంతువు✽గా ఉన్న నీ పరిస్థితుల నింద
ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోవు.
5 ✽ఎందుకంటే, నీ భర్త నీ సృష్టికర్తే.
ఆయన పేరు సేనలప్రభువు యెహోవా,
నీ విమోచకుడు ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుడు.
సర్వలోకానికీ దేవుడు అని ఆయనకు పేరు.
6 “నీ దేవుడు అంటున్నాడు, నీవు విడవబడి
దుఃఖాక్రాంతురాలైన భార్యగా ఉన్నావు,
పడుచుతనంలో పెళ్ళి చేసుకొని తృణీకారానికి
గురి అయిన భార్యగా ఉన్నావు.
అలాంటి నిన్ను యెహోవా మళ్ళీ పిలుస్తున్నాడు.
7 క్షణమాత్రం✽ నేను నిన్ను విడిచిపెట్టాను గాని,
మహా వాత్సల్యం✽తో నిన్ను మళ్ళీ సమకూరుస్తాను.
8 నాకు కోపం✽ ముంచుకు వచ్చింది.
క్షణమాత్రం నీకు నా ముఖం కనబడకుండా చేశాను.
అయితే నా శాశ్వతమైన అనుగ్రహం మూలంగా
నీకు వాత్సల్యం చూపుతాను.
ఇది నీ విమోచకుడైన✽ యెహోవా వాక్కు.
9 ✽“ఇది నాకు నోవహు✽ కాలంలాంటిది.
ఆ కాలంలో వరదలు భూమిని ముంచివేసినట్టు
ఇంక ఎన్నడూ ముంచివేయవని
నేను ప్రమాణం చేశాను.
నీమీద కోపగించననీ నిన్ను గద్దించననీ
ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాను.
10 పర్వతాలు తొలగిపోయినా కొండలు కదలినా✽
నా అనుగ్రహం✽ నీనుంచి తొలగిపోదు,
నా శాంతి ఒడంబడిక కదలదు.
ఇది నీమీద జాలిపడే యెహోవా వాక్కు.
11 “బాధపడుతున్న నగరమా✽!
తుఫానులకు కంపిస్తూ, ఆదరణ లేకుండా ఉన్నదానా!
నేను నిన్ను వైడూర్యాలతో నిర్మిస్తాను.
నీలమణులతో నీ పునాదులు వేస్తాను.
12 కెంపులతో నీ బురుజులను, నిప్పులాగా
మెరిసే మణులతో నీ ద్వారం తలుపులను,
విలువైన రత్నాలతో నీ గోడలను నిర్మిస్తాను.
13 యెహోవా నీ పిల్లలందరికీ ఉపదేశిస్తాడు✽.
నీ పిల్లల శాంతి✽ అధికంగా ఉంటుంది.
14 నిన్ను నీతినిజాయితీ✽తో స్థాపించడం జరుగుతుంది.
ప్రజ పీడన నీకు దూరంగా ఉంటుంది.
నీవు భయపడనవసరం ఉండదు.
బీతి✽ నీకు దూరంగా ఉంటుంది. అది నీ దగ్గరికి రానే రాదు.
15 ✽ఎవరైనా నీకు వ్యతిరేకంగా గుమికూడితే
అది నావల్ల జరగదు.
ఒకవేళ ఎవరైనా అలా గుమికూడితే
వాళ్ళు నీకు లొంగిపోతారు.
16 “ఇదిగో విను! నిప్పులూది పనికి తగిన ఆయుధాలను చేసే
కమ్మరిని సృజించినది నేనే✽. ధ్వంసం చేయడానికి
వినాశకారిని సృజించినది నేనే.
17 ✽నీకు వ్యతిరేకంగా ఏర్పడ్డ ఏ ఆయుధమూ గెలవదు✽.
న్యాయ విమర్శలో ఇతరులు చేసే ప్రతి నేరారోపణనూ
నీవు పడగొట్టగలుగుతావు✽.
యెహోవా సేవకులకు ఈ హక్కు ఉంటుంది.
వారిని నిర్దోషులని నిరూపించడం✽ నా వల్ల అవుతుంది.
ఇది యెహోవా వాక్కు.