53
1 మేము తెలియజేసిన సమాచారం నమ్మినది ఎవరు?
యెహోవా హస్తం ఎవరికి వెల్లడి అయింది?
2 ఆయన యెహోవాయెదుట లేత మొక్కలాగా,
ఎండిన భూమిలో అంకురంలాగా పెరిగాడు.
మనం ఆయనవైపు చూచేలా ఆయనకు అందం గానీ,
ఘనత గానీ లేదు. ఆయనలో మనలను
ఆకర్షించేది ఏమీ కనబడలేదు.
3 ఆయన మనుషుల తృణీకారానికీ
నిరాకరణకూ గురి అయ్యాడు.
ఆయన దుఃఖాలు అనుభవించిన మనిషి,
బాధలంటే పరిచయం ఉన్నవాడు.
ఆయనకు మన ముఖాలు కనబడకుండా చేసినట్లున్నాం.
ఆయన తృణీకారానికి గురి అయ్యాడు.
ఆయనంటే మనకు లెక్కలేదు.
4 ఆయన మన బాధలను భరించాడు.
మన దుఃఖాలను వహించాడు.
దేవుడు ఆయనను కొట్టాడనీ,
మొత్తి బాధించాడనీ మనం భావించుకొన్నాం.
5 కాని, ఆయన మన అక్రమ కార్యాల నిమిత్తమే
గాయపడ్డాడు. మన అపరాధాల నిమిత్తమే
ఆయనను నలగ్గొట్టడం జరిగింది.
మనకు శాంతి కలిగించే శిక్ష ఆయనమీద పడింది.
ఆయన పొందిన దెబ్బల మూలంగా
మనకు ఆరోగ్యం కలిగింది.
6 మనమందరమూ గొర్రెలలాగా తప్పిపోయాం.
మనలో ఒక్కొక్కరం సొంత త్రోవకు తొలగిపోయాం.
యెహోవా మన అందరి అపరాధాలను
ఆయనమీద మోపాడు.
7 ఆయన దౌర్జన్యానికి గురి అయ్యాడు.
బాధలు అనుభవించాడు.
అయినా ఆయన నోరు తెరవలేదు.
వారు ఆయనను గొర్రెపిల్లలాగా వధకు తీసుకుపోయారు.
బొచ్చు కత్తిరించేవాడి ఎదుట గొర్రె ఊరుకొన్నట్టే
ఆయన నోరు తెరవలేదు.
8 వారు ఆయనను పట్టుకొని, అన్యాయంగా
తీర్పు తీర్చి, తీసుకుపోయారు.
నా ప్రజల అతిక్రమాల కారణంగా
ఆయనను కొట్టడం జరిగింది.
ఆయన సజీవుల లోకంనుంచి హతం అయ్యాడు.
కాని, ఆయన తరంవారిలో
ఈ సంగతి ఎవరు ఆలోచించారు?
9 ఆయన చనిపోయినప్పుడు దుర్మార్గుల మధ్య,
ధనవంతుడి దగ్గర సమాధిపాలయ్యాడు.
ఆయన ఏమీ దౌర్జన్యం చేయలేదు,
ఆయన నోట మోసం ఎప్పుడూ లేదు.
10 అయినా ఆయనను నలగ్గొట్టడం,
బాధించడం యెహోవాకు ఇష్టమైంది.
ఆయన తనను అపరాధాల కోసమైన బలిగా
అర్పించుకొన్నందుచేత ఆయన సంతానాన్ని
చూస్తాడు, చిరంజీవి అవుతాడు.
యెహోవాకు ఏది ఇష్టమో అది ఆయనచేత
సఫలం అవుతుంది.
11 తన వేదనవల్ల కలిగిన ఫలితం చూచి,
ఆయన సంతృప్తి పొందుతాడు.
న్యాయవంతుడైన నా సేవకుడు చాలామంది
అపరాధాలను భరించి తన జ్ఞానంచేత
వారిని నిర్దోషులుగా ఎంచుతాడు.
12 గనుక నేను ఆయనకు గొప్పవారితో
వంతు పంచియిస్తాను.
ఆయన బలాఢ్యులతో రాబడి విభాగించుకొంటాడు.
ఎందుకంటే, ఆయన తన ప్రాణం ధారపోసి చనిపోయాడు.
ఆయనను అక్రమకారులలో ఒకడని ఎంచడం జరిగింది.
ఆయన చాలామంది పాపాన్ని భరిస్తూ,
అక్రమకారులకోసం విన్నపం చేశాడు.