52
1 ✽ సీయోనూ! మేల్కో! నీ బలం తొడుక్కో!జెరుసలం! పవిత్ర నగరమా!
నీ అందమైన వస్త్రాలను ధరించుకో!✽
ఇకనుంచి సున్నతి✽ పొందనివాళ్ళూ
అశుద్ధులూ నీలోకి రారు.
2 దుమ్ము దులుపుకో, జెరుసలం!
లేచి కూర్చో. బందీవైన సీయోను కుమారీ!
నీ మెడకట్లు విప్పివేసుకో.
3 ✽ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు:
“మీరు అమ్ముడుపోయారు గాని వెలకు కాదు.
డబ్బు ఇవ్వకుండానే మిమ్మల్ని
విడుదల చేయడం జరుగుతుంది.” 4 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, “మొదట నా ప్రజలు ఈజిప్ట్✽కు కొంతకాలం కాపురముండడానికి వెళ్ళారు. ఇటీవల అష్షూరు✽ నిష్కారణంగా వారిని బాధించింది. 5 ✽ నా ప్రజలను ఊరకే తీసుకుపోవడం జరిగింది. వారిమీద అధికారం చేసేవాళ్ళు విజయ ధ్వనులు చేస్తున్నారు. ఇది యెహోవా వాక్కు. రోజంతా ఎడతెరపి లేకుండా నా పేరును అవమానించడం✽ జరుగుతూ ఉంది. 6 గనుక ఇక్కడ నాకు ఏముంది? ఇది యెహోవా వాక్కు. నా ప్రజలు నా పేరును తెలుసుకొంటారు✽. ‘నేను ఇక్కడే ఉన్నాను’ అని చెప్పేది నేనే అని ఆ రోజున వారు తెలుసుకొంటారు.”
7 శాంతి ప్రకటిస్తూ, శుభసమాచారం తెస్తూ,
విముక్తి చాటిస్తూ శుభవార్త✽ తీసుకువచ్చేవారి పాదాలు,
‘నీ దేవుడు పరిపాలిస్తున్నాడు’ అని సీయోనుతో
చెప్పేవారి పాదాలు పర్వతాలమీద ఎంతో అందమైనవి.
8 విను! నీ కావలివారు స్వరమెత్తుతున్నారు.
ఏకంగా ఆనంద ధ్వనులు చేస్తున్నారు.
యెహోవా సీయోనుకు తిరిగి వచ్చే✽టప్పుడు
వారు కళ్ళారా చూస్తారు.
9 ✝జెరుసలం శిథిలాల్లారా! ఏకంగా ఆనంద గీతాలు పాడండి.
యెహోవా తన ప్రజను ఆదరించాడు.
జెరుసలంను విమోచించాడు.
10 అన్ని జనాల కళ్ళెదుటే యెహోవా తన పవిత్ర హస్తం✽
బయలుపరిచాడు. భూమి✽ కొనలన్నిటికీ
మన దేవుడిచ్చే విముక్తి కనబడుతుంది.
11 ✽ఆ స్థలాన్ని విడిచివెళ్ళండి! విడిచివెళ్ళండి.
అక్కడనుంచి వెళ్ళిపోండి! అశుద్ధమైన దేనినీ తాకవద్దు.
యెహోవా సేవాపాత్రలను మోసేవారలారా!
దానిలోనుంచి వెళ్ళిపోయి మిమ్మల్ని మీరు
పవిత్రం చేసుకోండి.
12 ✽అయితే మీరు త్వరపడి బయలుదేరరు.
పారిపోయే విధంగా వెళ్ళరు. ఎందుకంటే,
యెహోవా మీ ముందర నడుస్తాడు.
ఇస్రాయేల్ ప్రజల దేవుడు మీ వెనుక
కావలివాడుగా ఉంటాడు.
13 ✽ “వినండి, నా సేవకుడు జ్ఞానంతో ప్రవర్తిస్తాడు.
ఆయనను హెచ్చించడం, ఉన్నత స్థితికి తేవడం,
అధికంగా ఘనపరచడం జరుగుతుంది.
14 నిన్ను చూచి చాలామంది ఏ విధంగా
నిర్ఘాంతపోయారో అలాగే ఆయనను చూచి
నిర్ఘాంతపోతారు.
ఆయన ఆకారాన్ని ఏ మనిషి ఆకారంకంటే
వికృతం చేయడం జరిగింది –
ఆయన రూపం మనిషి రూపంలాగా కనిపించలేదు.
15 అలాగే ఆయన అనేక జనాలను చిలకరిస్తాడు✽.
ఆయన కారణంగా రాజులు నోరు మూసుకొంటారు✽,
ఎందుకంటే తమకు చెప్పని సంగతులు వారు చూస్తారు,
వినబడని సంగతులు గ్రహిస్తారు.”