51
1 ✽“నీతినిజాయితీని అనుసరిస్తూయెహోవాను వెదకుతూ ఉండేవారలారా,
నేను చెప్పేది వినండి.
మీరు ఏ బండనుంచి చెక్కబడ్డారో దానివైపు చూడండి.
ఏ రాళ్ళ గనిలోనుంచి త్రవ్వబడ్డారో దానివైపు చూడండి.
2 మీ పూర్వీకుడు అబ్రాహాము సంగతి ఆలోచించండి.
మిమ్మల్ని కన్న శారాను ఆలోచించండి.
నేను అబ్రాహామును పిలిచినప్పుడు అతడు ఒక్కడే.
అతణ్ణి దీవించి, అతణ్ణి అనేకులనుగా చేశాను.
3 యెహోవా సీయోనును ఆదరించి తీరుతాడు.
దాని పాడైన స్థలాలన్నిటినీ ఆదుకొంటాడు.
దాని ఎడారి ప్రదేశాన్ని ఏదెను తోటలాగా చేస్తాడు.
దాని ఎండిపోయిన ప్రాంతాన్ని ఆయన
యెహోవా వనంలాగా చేస్తాడు.
దానిలో ఆనందం, సంతోషం ఉంటాయి.
కృతజ్ఞతావాక్కులు, సంగీతనాదం వినబడుతాయి.
4 ✽“నా ప్రజలారా, నేను చెప్పేది ఆలకించండి.
నా జనమా, నాకు చెవియొగ్గి వినండి.
ఉపదేశం నానుంచి బయలుదేరుతుంది.
నా న్యాయం జనాలకు వెలుగుగా ఉండేలా చేస్తాను.
5 నా నీతి నిజాయితీ సమీపిస్తూ ఉన్నాయి.
నా రక్షణ బయలుదేరివుంది.
నా చేయి✽ జనాలకు న్యాయం జరిగిస్తుంది.
ద్వీపవాసులు✽ నావైపు చూస్తూ
నా చేతికోసం నమ్మకంతో ఎదురుచూస్తారు.
6 ✝ఆకాశాలవైపు తలెత్తి చూడండి.
క్రింద భూమిని చూడండి.
ఆకాశాలు పొగలాగా అంతర్థానమౌతాయి.
భూమి బట్టలాగా పాతగిలిపోతుంది.
దాని నివాసులు దోమలలాగా చచ్చిపోతారు.
అయితే నా రక్షణ శాశ్వతంగా✽ ఉంటుంది.
నా నీతినిజాయితీకి అంతం అంటూ ఉండదు.
7 నీతినిజాయితీ✽ అంటే ఏమిటో తెలిసినవారలారా,
నేను చెప్పేది వినండి. నా ధర్మశాస్త్రం హృదయాలలో✽
ఉంచుకొన్న మీరు ఆలకించండి.
మనుషులు వేసే నిందలకు✽ భయపడకండి.
వాళ్ళ దూషణకు హడలిపోకండి.
8 ✝చిమ్మట బట్టను కొరికివేసే విధంగా వాళ్ళను కొరికివేస్తుంది.
పురుగు ఉన్నిని కొరికివేసే విధంగా వారిని కొరికివేస్తుంది.
అయితే నా నీతినిజాయితీ శాశ్వతంగా నిలుస్తాయి.
నా రక్షణ తరతరాలకూ ఉంటుంది.”
9 ✽యెహోవా హస్తమా! లే! లే! బలం తొడుక్కో!
పూర్వకాలంలో, చాలాకాలం క్రిందట ఉన్న తరాలలో
లేచినట్టు లే!
రాహాబు✽ అనే బ్రహ్మాండమైన ప్రాణిని పొడిచి
ముక్కలు చేసినది నీవే గదా!
10 చాలా లోతైన నీళ్ళున్న సముద్రాన్ని ఇంకిపోయేలా
చేసినది నీవే గదా! విడుదల పొందినవారు దాటిపోయేలా
సముద్రం లోతులో త్రోవను చేసినది నీవే గదా!
11 ✝యెహోవా వెల ఇచ్చి విడిపించినవారు పాటలు పాడుతూ
సీయోనుకు తిరిగి వస్తారు.
వారి తలలమీద శాశ్వతానందం ఉంటుంది.
సంతోషానందాలు వారికి ప్రక్కతోడుగా ఉంటాయి.
దుఃఖం, నిట్టూర్పు ఎగిరిపోతాయి.
12 ✽“నేను – నేనే – మిమ్మల్ని ఓదార్చేవాణ్ణి✽.
చనిపోయే మనుషులకు✽, గడ్డి✽లాంటి మనుషులకు
మీరెందుకు భయపడుతున్నారు?
13 ✽ఆకాశాలను పరచి భూమి పునాదులు వేసిన
నీ సృష్టికర్త అయిన యెహోవాను ఎందుకు
మరచిపోతున్నారు?
నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్న హింసకుల
కోపానికి ఎడతెగకుండా ప్రతిరోజూ మీరెందుకు
భయపడుతున్నారు? హింసకుల కోపం ఏమయింది?
14 కృంగిపోయిన బందీలు✽ త్వరలో విడుదల అవుతారు.
చెరసాలలో చనిపోరు. వారికి ఆహారం లేకుండా పోదు.
15 నేను యెహోవాను, నీ దేవుణ్ణి. దాని అలలు
ఘోషించేలా సముద్రాన్ని✽ రేపేవాణ్ణి నేనే.
నా పేరు సేనలప్రభువు యెహోవా.
16 నేను ఆకాశాలను సుస్థిరం చేసినవాణ్ణి.
భూమి పునాదులు వేసినవాణ్ణి. నా ప్రజలు✽
నీవేయని సీయోనుతో చెప్పాను.
నీ నోట✽ నా మాటలు ఉంచి నా చేతి✽
నీడలో నిన్ను కప్పాను.”
17 ✽జెరుసలం! మేల్కో! మేల్కో!
యెహోవా కోపంతో నిండినపాత్రను
ఆయన చేతినుంచి తీసుకొని త్రాగిన నగరమా!
మనుషులను తూలేందుకు చేసే
ఆ పాత్రలోది అంతా త్రాగినదానా! లే!
18 ఆమె కన్న కొడుకులందరిలో ఆమెకు
దారిచూపేవాడు ఎవ్వడూ లేడు✽.
ఆమె పెంచిన కొడుకులందరిలో ఆమె చేయి
తన చేతిలో తీసుకొనేవాడెవ్వడూ లేడు.
19 ఈ రెండు✽ విపత్తులు నీమీదికి వచ్చాయి.
నిన్ను ఓదార్చగల వాడెక్కడ ఉన్నాడు?
ధ్వంసం, నాశనం నీకు సంభవించాయి.
కరవు, ఖడ్గం నీమీదికి వచ్చాయి.
నేను నిన్ను ఏ విధంగా ఓదార్చగలను?
20 నీ కొడుకులు మూర్ఛపోయారు.
అన్ని వీధుల చివరలలో వారు పడి ఉన్నారు.
వలలో చిక్కుపడ్డ జింకలలాగా ఉన్నారు.
యెహోవా కోపంతో, నీ దేవుని గద్దింపుతో
వారు నిండిపోయారు.
21 అందుచేత, ద్రాక్షమద్యం లేకుండానే
మత్తుగా ఉండి బాధపడేదానా✽, ఈ మాట విను:
22 నీ ప్రభువైన యెహోవా, తన ప్రజల పక్షాన వాదించే✽
నీ దేవుడు చెప్పేదేమిటంటే, “ఇదిగో,
నిన్ను తూలేందుకు చేసే పాత్రను,
నా కోపంతో నిండిన ఆ పాత్రను
నీ చేతిలోనుంచి తీసివేశాను.
దానిలోది నీవింకా ఎన్నడూ త్రాగవు.
23 నిన్ను బాధించేవాళ్ళ చేతిలోనే దానిని ఉంచుతాను.
‘మేము నీమీద నడిచిపోతాం – సాష్టాంగపడు’
అని వాళ్ళు చెప్పారు.
నీవు వాళ్ళకు నీ వీపును నేలకు వంచి వీధిలాగా
దానిమీద వారిని దాటిపోనిచ్చావు.
నేను వాళ్ళే ఆ పాత్రలోది త్రాగేలా చేస్తాను.”