50
1 ✽యెహోవా ఇలా అంటున్నాడు:“నేను మీ తల్లిని పంపివేస్తూ ఇచ్చిన విడాకులెక్కడా?
నా అప్పుల వాళ్ళలో ఎవడికి మిమ్మల్ని అమ్మివేశాను?
మీ అపరాధాల కారణంగానే మీరు అమ్ముడుపోయారు.
మీ అక్రమ కార్యాలకారణంగానే మీ తల్లిని పంపివేయడం జరిగింది.
2 నేను వచ్చినప్పుడు✽ ఎవడూ లేకపోవడమెందుకు?
నేను పిలిచినప్పుడు ఎవడూ జవాబివ్వలేదేమిటి?
నా చేయి విడుదల✽ చేయలేనంత కురుచగా ఉందా?
విడిపించడానికి నాకు బలం లేదా?
నా గద్దింపుచేత సముద్రాన్ని ఇంకిపోయేలా చేయగలను.
నదులను ఎడారిగా✽ చేయగలను.
అప్పుడు నీళ్ళు లేక వాటి చేపలు చచ్చిపోయి, కంపుకొడతాయి.
3 ✽ ఆకాశాలను చీకటి కమ్మేలా చేస్తాను.
అవి గోనెపట్ట ధరించేలా చేస్తాను.”
4 ✽“అలసిపోయినవాణ్ణి✽ మాటలచేత ఆదరించడం
నేను తెలుసుకొనేందుకు యెహోవా నాకు
నేర్పుగల నోరు✽ ఇచ్చాడు.
ప్రతి ఉదయమూ ఆయన నన్ను మేలుకొలుపుతాడు.
శిష్యుడు వినే విధంగా నేను వినాలని
నా చెవిని మేలుకొలుపుతాడు.
5 ✽యెహోవాప్రభువు నా చెవిని తెరచాడు.
నేను తిరగబడలేదు, వెనక్కు తీయలేదు.
6 ✽నన్ను కొట్టేవాళ్ళకు నా వీపును అప్పగించాను,
నా గడ్డం పెరికివేసేవాళ్ళకు నా చెంపలను అప్పగించాను.
వాళ్ళు నా ముఖంమీద ఉమ్మివేసినప్పుడు,
నిందించినప్పుడు నేను ముఖం దాచుకోలేదు.
7 ✽యెహోవా ప్రభువు నాకు సహాయం చేసేవాడు,
గనుక నేను సిగ్గుపడలేదు.
నాకు తలవంపులు కలగవని తెలిసి
నా ముఖాన్ని చెకుముకి రాయిలాగా ఉంచుకొన్నాను.
8 ✽నేను నిర్దోషినని నిరూపించేవాడు దగ్గరగా ఉన్నాడు.
ఎవడు నామీద నేరం మోపుతాడు?
మనం ముఖాముఖిగా నిలబడుదాం.
ఫిర్యాదీ ఎవడు? అతణ్ణి నా దగ్గరికి రానియ్యి.
9 యెహోవాప్రభువు నాకు సహాయం చేస్తాడు.
దోషినని నాకు ఎవడు తీర్పు తీరుస్తాడు?
అలాంటివాళ్ళంతా బట్టలాగా పాతగిలిపోతారు.
చిమ్మట వాళ్ళను తినివేస్తుంది.
10 ✽“మీలో ఎవరు యెహోవాపట్ల భయభక్తులు✽ కలిగి
ఆయన సేవకుడి మాట వింటారు?
ఏమీ వెలుగు లేక చీకటిలో నడిచే వ్యక్తి
యెహోవా పేరుమీద నమ్మకముంచాలి✽.
అవును, తన దేవునిమీద ఆధారపడాలి.
11 ఇదిగో, నిప్పు✽ రాజబెట్టేవాళ్ళారా!
కొరకంచులను మీ చుట్టూ పట్టుకొనే వాళ్ళారా!
మీ నిప్పు వెలుగులో నడవండి.
రాజబెట్టిన కొరకంచుల వెలుగులో నడవండి.
నా చేతివల్ల మీరు పొందబోయేదేమిటంటే,
మీరు వేదనతో పడుకొంటారు.