49
1 ✽ద్వీపాల్లారా! నేను చెప్పేది వినండి✽.దూరంగా ఉన్న జనాల్లారా! ఆలకించండి.
నేను పుట్టక✽ముందే యెహోవా నన్ను పిలిచాడు.
నా జననంనుంచి ఆయన నా పేరు ప్రస్తావించాడు.
2 ఆయన నా నోరు పదునైన కత్తి✽గా చేశాడు.
తన చేతి నీడ✽లో నన్ను దాచాడు.
నన్ను మెరుగుపెట్టిన బాణం✽గా చేసి
తన అంబుల పొదిలో మూసిపెట్టాడు.
3 “ఇస్రాయేలూ, నీవు నా సేవకుడివి✽.
నీలో నా ఘనత✽ను ప్రదర్శిస్తాను”
అని నాతో చెప్పాడు.
4 ✽అయితే నేను అన్నాను, “వ్యర్థంగా కష్టపడ్డాను.
నిష్ఫలంగా, వృథాగా నా బలం ప్రయోగించాను.
అయినా నాకు రావలసినది యెహోవాదగ్గర ఉంది,
నా బహుమానం నా దేవుని దగ్గర ఉంది.”
5 ✽యెహోవా దృష్టిలో గౌరవనీయుణ్ణి.
నా దేవుడు నాకు బలంగా✽ ఉన్నాడు.
నేను ఆయనకు సేవకుడు✽గా ఉండాలనీ,
ఆయన దగ్గరికి యాకోబును తిరిగి రప్పించాలనీ,
ఇస్రాయేల్‌ను ఆయన దగ్గర సమకూర్చాలనీ
ఆయన నన్ను గర్భంలో రూపొందించాడు.
యెహోవా ఇప్పుడు ఇలా అంటున్నాడు:
6 “నీవు యాకోబు✽ గోత్రాలను మళ్ళీ పైస్థితికి తేవడానికీ
ఇస్రాయేల్‌లో తప్పించుకొన్నవాళ్ళను తీసుకు రావడానికీ
నా సేవకుడుగా ఉండడం స్వల్ప విషయం.
నా రక్షణ భూమి✽కొనలకు వ్యాపించేలా
నిన్ను ఇతర జనాలకు వెలుగుగా చేస్తాను.”
7 మనుషుల తృణీకారానికీ✽ ఈ ప్రజల ద్వేషానికీ గురి అయి,
పరిపాలకులకు సేవకుడు✽గా ఉన్నవానితో
ఇస్రాయేల్ ప్రజల విముక్తిదాతా, పవిత్రుడూ అయిన
యెహోవా ఇలా అంటున్నాడు:
“నమ్మకంగా ఉన్న యెహోవా కారణంగా,
నిన్ను ఎన్నుకొన్న ఇస్రాయేల్ ప్రజల పవిత్రుని కారణంగా
రాజులు నిన్ను చూచి నిలబడుతారు,
అధికారులు నీ ఎదుట వంగుతారు.”
8 యెహోవా చెప్పేదేమిటంటే,
“అనుకూల సమయంలో నీ ప్రార్థనకు నేను జవాబిస్తాను,
రక్షణ దినం✽లో నీకు సహాయం చేస్తాను.
నీవు బందీలతో ‘బయలుదేరండి’ అనీ,
చీకటిలో ఉన్న వారితో ‘బయటికి రండి’ అనీ చెప్పేలా,
ఈ దేశాన్ని✽ సరి చేసి పాడైన వారసత్వాలను
మళ్ళీ పంచిపెట్టేలా నిన్ను కాపాడుతాను,
ప్రజకు ఒడంబడిక✽గా చేస్తాను.
9 ✝త్రోవల ప్రక్కన వారు మేస్తారు. చెట్లులేని
కొండలన్నిటిమీదా వారికి మేత దొరుకుతుంది.
10 ✝వారిమీద జాలిపడేవాడు వారిని వెంటపెట్టుకొని వెళ్తాడు,
నీటి బుగ్గలదగ్గరికి వారిని నడిపిస్తాడు,
గనుక ఆకలిదప్పులంటూ వారికేమీ ఉండవు.
ఎడారి వేడిమి గానీ, ఎండ గానీ వారిని బాధించవు.
11 ✝నా పర్వతాలన్నిటినీ త్రోవలకు మారుస్తాను.
నా రాజమార్గాలను ఎత్తుగా చేయడం జరుగుతుంది.
12 ✽ చూడండి! వీరు దూరంనుంచి వస్తున్నారు.
వీరు ఉత్తర దిక్కునుంచి, పడమటి దిక్కునుంచి వస్తున్నారు.
వీరు సీనీం దేశంనుంచి వస్తున్నారు.
13 ✝యెహోవా బాధకు గురియైన తన వారిమీద
జాలిపడుతాడు, తన ప్రజను ఓదారుస్తాడు గనుక ఆకాశాల్లారా!
ఆనంద ధ్వనులు చేయండి!
భూమీ! సంతోషించు! పర్వతాల్లారా! ఆనంద గీతాలు పాడండి!
14 ✽“అయితే సీయోను ‘యెహోవా నన్ను విడిచిపెట్టాడు.
ప్రభువు నన్ను మరచిపొయ్యాడు’ అంది.
15 ✽స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డమీద జాలిపడకుండా ఉంటుందా?
తన చంటిపిల్లను మరచిపోతుందా?
ఒకవేళ అలాంటివారు మరవవచ్చు.
గాని, నేను నిన్ను మరవను!
16 చూడు! నా అరచేతుల మీద నిన్ను చెక్కాను✽!
నీ గోడలు ఎప్పటికీ నా ఎదుట✽ ఉన్నాయి.
17 నీ కొడుకులు✽ త్వరగా వస్తున్నారు.
నిన్ను పడగొట్టి నాశనం చేసినవాళ్ళు
నిన్ను విడిచివెళ్తున్నారు.
18 తలెత్తి చుట్టూరా చూడు! నీ కొడుకులందరూ
సమకూడి నీదగ్గరికి వస్తున్నారు.
నీవు వారందరినీ ఆభరణంగా✽ ధరించుకొంటావు.
వారు పెళ్ళికూతురు ధరించుకొన్న ఒడ్డాణంలాగా ఉంటారు.
నా జీవంతోడని ప్రమాణం చేస్తున్నాను.
ఇది యెహోవా వాక్కు.
19 ✽“నీవు పాడైపోయి నిర్జనంగా ఉన్నా,
నీ దేశం నాశనమైపోయినా ఇప్పుడు నీ నివాసులకు
నీ భూమి ఇరుకుగా ఉంటుంది.
నిన్ను దిగమ్రింగివేసినవాళ్ళు దూరంగా ఉంటారు.
20 నీవు నీ పిల్లలను కోల్పోయిన తరువాత
నీకు పుట్టిన కొడుకులు నీ చెవులలో,
‘ఈ స్థలం మాకు ఇరుకుగా ఉంది.
ఇంకా విశాలమైన ప్రాంతం మాకియ్యి’ అంటారు.
21 ✽అప్పుడు నీవు ‘నా పిల్లలను కోల్పోయి, గొడ్రాలుగా ఉండి,
దేశభ్రష్టురాలినై అటూ ఇటూ తిరుగులాడవలసి వచ్చింది.
వీరు ఎవరివల్ల నాకు పుట్టారు! వీరిని పెంచిందెవరు?
నేను ఒంటరిగానే విడవబడ్డాను.
వీరు ఎక్కడనుంచి వచ్చారు?’ అనుకొంటావు.”
22 సేనలప్రభువు యెహోవా అంటున్నాడు:
“ఇదిగో విను. నేను జనాలకు చేతితో సైగ చేస్తాను.
జనాలవైపు నా పతాకమెత్తుతాను.
వారు నీ కొడుకులను తమ చేతులతో తీసుకువస్తారు,
నీ కూతుళ్ళను తమ భుజాల మీద మోసుకువస్తారు.
23 ✽నీకు రాజులు పెంచే తండ్రులుగా,
వారి రాణులు పాలిచ్చే దాదులుగా ఉంటారు.
వారు నీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తారు.
నీ పాదాల దుమ్మును నాకుతారు.
అప్పుడు నేను యెహోవాననీ నాకోసం ఆశతో చూచేవారికి
ఆశాభంగం✽ కలగదనీ నీవు తెలుసుకొంటావు✽.”
24 ✽బలాఢ్యుల చేతిలోనుంచి దోపిడీ సొమ్మును తీసుకురావడం,
క్రూరులు పట్టిన బందీలను విడిపించడం సాధ్యమా?
25 అందుకు యెహోవా ఇలా అంటున్నాడు:
“బలాఢ్యులు పట్టిన బందీలను కూడా విడిపించడం,
క్రూరుల దోపిడీ కూడా తప్పించడం జరుగుతుంది.
నీతో పోరాడేవాళ్ళతో✽ నేనే పోరాడుతాను.
నీ పిల్లలను నేనే రక్షిస్తాను.
26 ✽నిన్ను బాధించేవాళ్ళను తమ శరీరాలను
తామే తినేలా చేస్తాను.
మద్యంతో మత్తుగా ఉన్నట్టు వారి రక్తంతో
వారు మత్తుగా ఉంటారు.
అప్పుడు నేను యెహోవాను యాకోబు✽ బలవంతుణ్ణి
నీ రక్షకుణ్ణనీ నీ ముక్తిప్రదాతననీ మనుషులంతా
తెలుసుకొంటారు.