48
1 “ఇస్రాయేల్ అనే పేరు కలిగి,
యూదా సంతానమైన యాకోబు వంశమా!
నీవు యెహోవా పేరుతోడని ప్రమాణాలు చేస్తావు,
ఇస్రాయేల్ ప్రజల దేవుని విషయం మాట్లాడుతారు
(అయితే యథార్థంగా నిజాయితీతో అలా చేయవు),
2 ‘పవిత్ర నగరవాసులం’ అంటూ ఇస్రాయేల్ ప్రజల
దేవునిమీద ఆధారపడుతావు (ఆయన పేరు సేనలప్రభువు యెహోవా).
నీవు ఈ మాట విను.
3 “మునుపు జరిగిన సంగతులను నేను
చాలా కాలం క్రిందట తెలియజేశాను.
వాటిని గురించిన మాటలు నా నోటనుంచి వెలువడ్డాయి.
నేను వాటిని వెల్లడి చేశాను.
ఉన్నట్టుండి నేను పని జరిగించాను,
అవి సంభవించాయి.
4 ఎందుకంటే, నీవు మూర్ఖుడివనీ,
నీ మెడ నరాలు ఇనుములాంటివనీ,
నీ నొసలు కంచులాంటిదనీ నాకు తెలుసు.
5 అందుచేత చాలా కాలంక్రిందట ఆ సంగతులు
నీకు తెలియజేశాను. ‘ఇలా చేసినది నా విగ్రహాలు.
వాటిని నియమించినది నా చెక్కిన ప్రతిమ,
పోతపోసిన నా విగ్రహం’ అని నీవు చెప్పలేకపోవాలని
అవి జరగకముందే వాటిని నీకు ప్రకటించాను.
6 నీవు ఆ సంగతులు విన్నావు.
వాటన్నిటిని గురించి ఆలోచించు.
నేను చెప్పినది నిజమని నీవు ఒప్పుకోవా?
“ఇకనుంచి నీకు క్రొత్త సంగతులను తెలియజేస్తాను.
ఆ సంగతులు గూఢమైనవి, నీకు తెలియనివి.
7 ఇవి ఇప్పుడే కలిగినవి. చాలా కాలంక్రిందట
ఇవి కలిగినవి కావు.
ఈ రోజుకు ముందుగా నీవు వాటిని గురించి వినలేదు,
గనుక ‘ఇవి నాకు తెలిసినవే’ అని నీవు చెప్పలేవు.
8 నీవు వినలేదు, తెలుసుకోలేదు.
చాలా కాలంనుంచి నీ చెవి తెరవబడలేదు.
నీవు ద్రోహివని నాకు బాగా తెలుసు.
నీవు పుట్టినప్పటినుంచి తిరుగబడేవాడివని
అనిపించుకొన్నావు.
9  “నేను నిన్ను నిర్మూలం చేయకుండా
నా పేరుకోసం నా కోపం ఇప్పుడు కుమ్మరించను.
నా కీర్తికోసం దానిని అదుపులో ఉంచుకొంటున్నాను.
10  నేను నిన్ను పుటం పెట్టాను.
వెండిలాగా కాక, బాధల కొలిమిలో నిన్ను పరీక్షించాను.
11  నా కోసం, నా కోసమే, నేనిలా చేస్తున్నాను.
నా పేరు అవమానానికి గురి కావాలా?
నా ఘనత ఇంక ఎవరికీ చేకూరనివ్వను.
12 “యాకోబూ! నేను పిలిచిన ఇస్రాయేలూ!
నేను చెప్పేది విను. నేనే ఆయనను.
నేను మొదటివాణ్ణి చివరివాణ్ణి.
13 నా చేయి భూమికి పునాది వేసింది.
నా కుడి చేయి ఆకాశాలను పరచింది.
నేను వాటిని పిలిస్తే అవన్నీ ఏకంగా నిలబడుతాయి.
14 మీరందరూ సమకూడి వచ్చి ఆలకించండి.
మీ విగ్రహాలలో ఏది ఈ సంగతులను తెలియజేసింది?
బబులోనుమీద యెహోవా సంకల్పాన్ని
ఆయన ప్రేమించేవాడు నెరవేరుస్తాడు.
అతని హస్తం కల్దీయవాళ్ళమీదికి వస్తుంది.
15 నేను నేనే ఇది చెప్పాను. నేనే అతణ్ణి పిలిచాను.
నేనే అతణ్ణి తీసుకువస్తాను.
అతని రాకడ సఫలమవుతుంది.
16  నా దగ్గరికి వచ్చి ఈ మాట వినండి:
ఆరంభంనుంచి నేను రహస్యంగా మాట్లాడలేదు.
ఇవి సంభవించే కాలంలో నేను అక్కడే ఉన్నాను.
ఇప్పుడు యెహోవాప్రభువు ఆయన ఆత్మతోకూడా
నన్ను పంపాడు.
17 “నీ విముక్తిదాత, ఇస్రాయేల్‌ప్రజల
పవిత్రుడైన యెహోవా చెప్పేదేమిటంటే,
నేను యెహోవాను, నీ దేవుణ్ణి.
నీకు మేలు కలగాలని నీకు ఉపదేశం చేసేవాణ్ణి.
నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపించేవాణ్ణి.
18 నీవు నా ఆజ్ఞలను పాటించాలని ఎంతో కోరేవాణ్ణి.
వాటిని పాటించి ఉంటే నీ శాంతి నదిలాగా,
నీ న్యాయం సముద్రం అలలలాగా ఉండి ఉండేవి.
19 నీ సంతానం ఇసుకంత విస్తారంగా,
నీ పిల్లలు లెక్కకు ఇసుకరేణువుల లాగా ఉండి ఉండేవారు.
అలాంటప్పుడు వారి పేరును నా సముఖంనుంచి
కొట్టివేయడం జరిగేది కాదు, నాశనం అయ్యేది కాదు.”
20 బబులోనును విడిచివెళ్ళండి!
కల్దీయవాళ్ళ దేశంనుంచి పారిపోండి!
“యెహోవా తన సేవకుడైన యాకోబును
వెల ఇచ్చి విడుదల చేశాడు”
అని ఆనంద ధ్వనులతో చాటించండి.
భూమి కొనల వరకు అది వినిపించి ప్రకటించండి.
21 ఎడారులలో ఆయన వారిని నడిపించినప్పుడు
వారికి దాహం కాలేదు. వారికోసం బండలోనుంచి
నీళ్ళు పారేలా ఆయన చేశాడు.
ఆయన ఆ బండ చీల్చాడు,
నీళ్ళు ధారధారలుగా వెలువడ్డాయి.
22  అయితే “దుర్మార్గులకు శాంతి అంటూ ఉండదు”
అని యెహోవా అంటున్నాడు.