47
1 “కన్యకుమార్తె అయిన బబులోను!
క్రిందికి దిగి దుమ్ములో కూర్చో.
కల్దీయవాళ్ళ కుమారీ!
సింహాసనం లేకుండా నేలమీద కూర్చో.
నీవు మృదువుగా, నాజూకుగా ఉన్నావని
మనుషులు ఇకనుంచి అనరు.
2 తిరుగటిరాళ్ళను తీసుకొని పిండి విసరు!
నీ ముసుకు పారవెయ్యి.
కాలిమీద జీరాడే బట్ట పైకెత్తి నీ కాళ్ళు
నగ్నంగా చేసి నదులు దాటిపో.
3  నిన్ను దిగంబరిగా చేయడం జరుగుతుంది.
నీ అవమానం వెల్లడి అవుతుంది.
నేను ప్రతీకారం చేస్తాను.
నీలో ఎవరినీ దయతో సందర్శించను.”
4 మా విముక్తిదాత పేరు సేనలప్రభువు యెహోవా.
ఆయన ఇస్రాయేల్ ప్రజల పవిత్రుడు.
5 “కల్దీయవాళ్ళ కుమారీ! మౌనం వహించి కూర్చో.
చీకటిలోకి పో. ఇకనుంచి నిన్ను ‘రాజ్యాలకు
యజమానురాలు’ అని ఎవరూ అనరు.
6 నేను నా ప్రజమీద కోపగించాను,
నా సొత్తును పాడు చేశాను,
వారిని నీ చేతికి అప్పగించాను.
నీవు వారిమీద ఏమీ కరుణ చూపలేదు.
ముసలివారిమీద కూడా చాలా బరువైన
కాడిమ్రాను మోపావు.
7 నీవు అనుకొన్నావు,
‘నేను శాశ్వతంగా యజమానురాలుగా ఉంటాను.’
ఈ సంగతులను గురించి నీవు ఆలోచించలేదు.
వాటి ఫలితమేమిటో తలచుకోలేదు.”
8 “గనుక ఇప్పుడు ఈ మాట విను సుఖాసక్తురాలా!
నిర్భయంగా ఉంటూ, ‘నేనే ఉన్నాను.
నేను తప్ప ఇంకెవరూ లేరు. నేను వితంతువును కాబోను.
సంతాన నష్టం పొందను’ అనుకొనేదానా! ఈ మాట విను:
9 ఒక్క రోజులోనే హఠాత్తుగానే ఈ రెండూ నీకు సంభవిస్తాయి
నీవు వితంతువు అవుతావు, సంతాన నష్టం పొందుతావు.
నీకు మహా మంత్రవిద్య ఉన్నా, నీ మంత్రాలు అత్యధికంగా ఉన్నా
ఆ రెండు విపత్తులు నిండుగా అనుభవిస్తావు.
10 నీ చెడుగులో నీవు నిర్భయంగా ఉన్నావు ‘ఎవరూ నన్ను చూడరు
అనుకొన్నావు. ‘నేనే ఉన్నాను.
నేను తప్ప ఇంకెవరూ లేరు’ అని నీవు అనుకొన్నావు.
ఆ విధంగా నీ విద్య, నీ జ్ఞానం నిన్ను భ్రమపరచాయి.
11 విపత్తు నీమీదికి వస్తుంది. నీ మంత్రాలతో
దానిని పోగొట్టలేక పోతావు.
కీడు నీమీద పడుతుంది. నీవు ప్రాయశ్చిత్తం చేసి
దానిని రాకుండా చేయలేవు. నీకు తెలియని నాశనం
నీమీదికి అకస్మాత్తుగా వస్తుంది.
12 సరే, చిన్నప్పటినుంచి ప్రయాసతో
నీవు అభ్యసించిన మంత్రవిద్యతో,
నీ అనేక మంత్రాలతో ఉండిపో.
ఒకవేళ వాటివల్ల నీకు సహాయం చేకూరుతుందేమో,
ఇతరులకు భయం కలుగుతుందేమో, చూద్దాం.
13 నీవు విన్న అనేక ఆలోచనలచేత నీవు అలసిపోయావు.
జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు,
మాసచర్య చెప్పేవాళ్ళు నిలబడి,
నీమీదికి వచ్చే విపత్తు రాకుండా చేసి
నిన్ను రక్షిస్తారేమో చూద్దాం.
14 అసలు వాళ్ళు వరిగడ్డిలాంటివాళ్ళు.
అగ్ని వాళ్ళను కాల్చివేస్తుంది.
మంటల బారినుంచి తమనే తప్పించుకోలేరు.
అది చలి కాచుకోవడానికి నిప్పు కాదు,
ఎదుట కూర్చుని ఉండతగ్గ నిప్పు కాదు.
15 నీవు ఎవరితో కష్టపడ్డావో, చిన్నప్పటినుంచి
ఎవరితో వ్యవహరించావో వాళ్ళు అలాంటివాళ్ళు అవుతారు.
ప్రతివాడూ అవతలకు దారి తప్పిపోతున్నాడు.
నిన్ను రక్షించగల వాడంటూ ఎవడూ లేడు.