46
1 ✽బేల్ కుంగుతున్నాడు. నెబో కుంగుతూ ఉన్నాడు.వాళ్ళ విగ్రహాలను జంతువులు,
పశువులు మోస్తూ ఉన్నాయి.
ఆ మోతలు అలసిపోయిన పశువులకు భారంగా ఉన్నాయి.
2 ✽బేల్, నెబో కూలుతూ కుంగుతూ ఉండి
భారాన్ని విడిపించుకోలేక తామే
బందీలుగా పోవడం జరుగుతూ ఉంది.
3 “యాకోబు వంశంవారలారా!
ఇస్రాయేల్ వంశంలో మిగిలినవారలారా!
నేను చెప్పేది వినండి.
మీరు గర్భంలో ఉన్నప్పటినుంచీ నేను మిమ్మల్ని భరించాను✽,
జన్మించినప్పటి నుంచి మిమ్మల్ని ఎత్తుకొన్నాను✽.
4 ✽మీ ముసలితనంవరకు నేను అలాంటివాణ్ణే.
మీకు తల వెండ్రుకలు నెరసేవరకు మిమ్మల్ని భరిస్తాను.
మిమ్మల్ని చేసినది నేనే. ఎత్తుకొన్నది నేనే.
నేను మిమ్మల్ని భరిస్తాను, రక్షిస్తాను.
5 ✽“వారు నాతో సమానమన్నట్లు
ఎవరిని నాతో సాటిచేస్తారు?
నన్ను ఎవరితో పోల్చి సమానులుగా చేస్తారు?
6 కొంతమంది తమ సంచి నుంచి బంగారం పోసి,
త్రాసులో వెండి తూచి, దానిని దేవతగా చేయడానికి
కంసాలిని కూలికి పిలుస్తారు.
దానికి సాష్టాంగపడి మ్రొక్కుతారు.
7 వాళ్ళు భుజాలమీద దానిని ఎక్కించుకొని,
మోసుకుపోయి, దానికి సిద్ధం చేసిన చోట
నిలబెడతారు. అది అక్కడే నిలుస్తుంది.
దాని స్థలంనుంచి అది కదలదు✽.
మనిషి దానికి బిగ్గరగా విన్నపం చేసినా
అది ఏమీ జవాబివ్వదు✽.
వాడి కష్టంనుంచి వాణ్ణి రక్షించజాలదు✽.
8 “అక్రమకారులారా✽! దానిని జ్ఞాపకముంచుకొని
మీ మనసులలో గట్టిగా నాటనియ్యండి,
బాగా ఆలోచించండి.
9 చాలా కాలంక్రిందట✽ జరిగినవాటిని జ్ఞప్తికి తెచ్చుకోండి.
నేనే దేవుణ్ణి, ఇంకా ఏ దేవుడూ లేడు. నేనే దేవుణ్ణి,
నాకు సమానుడంటూ ఎవ్వడూ లేడు✽.
10 ఆదినుంచి అంతాన్ని తెలియజేసేవాణ్ణి.
పూర్వకాలంనుంచి ఇంకా జరగబోయే✽
సంగతులను తెలిపేవాణ్ణి.
నా సంకల్పం నిలుస్తుందనీ✽ నాకు ఇష్టం వచ్చినట్టెల్లా
జరిగిస్తాననీ అంటున్నాను.
11 తూర్పు నుంచి ‘క్రూరపక్షి✽’ని రప్పిస్తున్నాను.
నా సంకల్పాన్ని నెరవేర్చడానికి దూరదేశంనుంచి
ఆ మనిషిని పిలుస్తున్నాను.
నేను ఏమి చెప్పానో అది జరిగిస్తాను.
ఏమి సంకల్పించానో అది సాధిస్తాను.
12 మొండిపట్టు పట్టి న్యాయం✽నుంచి
దూరమైనవారలారా! నేను చెప్పేది వినండి.
13 నా న్యాయాన్ని దగ్గరికి✽ తెస్తున్నాను.
అది దూరంగా లేదు. నా రక్షణ ఆలస్యంగా రాదు.
నేను సీయోనుకు విముక్తి ప్రసాదిస్తాను.
ఇస్రాయేల్‌కు నా మహిమాప్రకాశం అనుగ్రహిస్తాను.