45
1 “నేను కోరెషు పక్షాన జనాలను జయించడానికీ,
రాజుల నడికట్లను విప్పడానికీ,
అతడి ఎదుట ద్వారాలు వేయబడకుండా
తలుపులు తీయడానికీ అతడి కుడిచెయ్యి పట్టుకొన్నాను.
యెహోవా అభిషేకించిన కోరెషుతో చెప్పేదేమిటంటే,
2 ‘నేను నీకు ముందుగా వెళ్తాను,
కొండలను చదును చేస్తాను.
కంచు తలుపులను పగులగొట్టివేస్తాను,
ఇనుప గడియలను ముక్కలు చేస్తాను.
3 చీకటి చోట్లలో మరుగైన నిధులనూ రహస్య స్థలాలలో
కూడబెట్టిన ధనాన్నీ నీకిస్తాను.
నేను పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేల్ ప్రజల
దేవుడైన యెహోవానని నీవు తెలుసుకోవాలని నా ఉద్దేశం.
4 నీవు నన్ను ఎరుగకపోయినా,
నా సేవకుడు యాకోబుకోసం,
నేను ఎన్నుకొన్న ఇస్రాయేల్‌కోసం
నేను పేరుపెట్టి నిన్ను పిలిచాను,
నీకు బిరుదులను ఇచ్చాను.
5 నేను యెహోవాను. వేరే దేవుడు లేడు.
నేను తప్ప ఏ దేవుడూ లేడు.
6 తూర్పునుంచి పడమటివరకు
నేను తప్ప ఏ దేవుడూ లేడని
జనాలు తెలుసుకొనేలా,
నీవు నన్ను ఎరుగకపోయినా నేను నిన్ను
సన్నద్ధుడుగా చేస్తాను.
నేను యెహోవాను. నేను తప్ప ఏ దేవుడూ లేడు.
7 నేను వెలుగును సృజించేవాణ్ణి,
చీకటినీ కలిగించేవాణ్ణి. నేను క్షేమాన్నీ,
విపత్తునూ కలిగించేవాణ్ణి.’
8 “ఆకాశాల్లారా! పైనుంచి న్యాయాన్ని కురిపించండి!
మబ్బులారా! దానిని వర్షించండి!
భూమి తెరుచుకొంటుంది గాక!
విముక్తి ఫలించేలా న్యాయాన్ని మొలిపిస్తుంది గాక!
నేను యెహోవాను దానిని కలిగించాను.
9 “మట్టి కుండపెంకులలో ఒక పెంకులాగా ఉండి
తనను సృజించినవానితో పోరాడేవాడికి బాధ తప్పదు.
జిగటమన్ను ‘నువ్వేం చేస్తున్నావు?,
అని కుమ్మరిని అడుగుతుందా?
‘వీడికి చేతులు లేవు’ అని నీ చేతిపని
నీ విషయం చెపుతుందా?
10 తండ్రిని చూచి ‘నువ్వు కన్నదేమిటి?’
అని అడిగేవాడికి బాధ తప్పదు.
‘నువ్వు గర్భం ధరించినదేమిటి?’
అని తల్లిని అడిగేవాడికి బాధ తప్పదు.
11 ఇస్రాయేల్ ప్రజల పవిత్రుడూ సృష్టికర్తా అయిన
యెహోవా చెప్పేదేమిటంటే,
రాగల వాటి విషయంలో నా పిల్లలను గురించి
నన్ను అడుగుతారా? నా చేతులు చేసే పనులను
గురించి నాకు ఆజ్ఞ జారీ చేస్తారా?
12 భూమిని కలిగించినది నేనే.
దానిమీద మానవజాతిని సృజించినది నేనే.
ఆకాశాలను పరచినది నా చేతులే.
వాటిలో ఉన్న సమూహాలను నియమించినది నేనే.
13 న్యాయాన్ని అనుసరించి నేను కోరెషును
పురికొలుపుతాను. అతడి త్రోవలన్నీ
తిన్ననివి చేస్తాను.
అతడు నా నగరాన్ని మళ్ళీ కట్టిస్తాడు.
విడుదలకోసమైన వెల గానీ,
బహుమానం గానీ తీసుకోకుండా అతడు
బందీలుగా వెళ్ళిన నా ప్రజను విడిపిస్తాడు.”
14 యెహోవా ఇలా అంటున్నాడు:
“ఈజిప్ట్‌వాళ్ళ కష్టార్జితం, కూషువాళ్ళ,
పొడుగాటి సెబావాళ్ళ వర్తక లాభం
నీ దగ్గరికి వచ్చి నీవి అవుతాయి.
వాళ్ళు సంకెళ్ళతో బంధించబడి వచ్చి
నీవెనుక నడుస్తారు.
నీ ఎదుట సాష్టాంగపడి ‘నిజంగా
నీతో దేవుడు ఉన్నాడు. వేరే దేవుడు లేడు.
ఆయన తప్ప ఏ దేవుడూ లేడు’
అని చెప్పి నిన్ను ప్రాధేయపడుతారు.”
15 ఇస్రాయేల్ ప్రజల దేవా, రక్షకా,
నిజంగా నీవు నిన్ను మరుగు చేసుకొనే దేవుడవు.
16 విగ్రహాలను చేసేవాళ్ళంతా సిగ్గు,
అవమానం పాలవుతారు.
వాళ్ళు ఏకంగా తలవంపులతో వెళ్ళిపోతారు.
17 ఇస్రాయేలైతే యెహోవా మూలంగా రక్షణ పొందుతుంది.
ఆ రక్షణ శాశ్వతమైనది. మీరు ఎన్నటికీ
సిగ్గుకూ అవమానానికీ గురి కారు.
18 యెహోవా ఆకాశాలను సృజించాడు.
ఆయన దేవుడు, ఆయన భూమిని కలిగించి,
రూపొందించి, సుస్థిరం చేశాడు.
శూన్యంగా ఉండడానికి దానిని సృజించలేదు.
నివాసస్థలంగా ఉండాలని రూపొందించాడు.
ఆయన ఇలా అంటున్నాడు:
“నేను యెహోవాను. వేరే దేవుడు లేడు.
19 నేను ఏదో చీకటి ప్రదేశంలో రహస్యంగా మాట్లాడలేదు.
‘వ్యర్థంగా నన్ను వెదకండి’ అని
యాకోబు సంతానంతో నేను చెప్పలేదు.
నేను యెహోవాను న్యాయమైన సంగతులు చెప్పేవాణ్ణి,
యథార్థమైన సంగతులు చెప్పేవాణ్ణి.
20 “సమకూడి రండి! జనాలలో తప్పించుకొన్న వారలారా!
కలిసి దగ్గరికి రండి! తమ కొయ్య విగ్రహాన్ని మోస్తూ,
రక్షించలేని దేవతకు ప్రార్థన చేసేవాళ్ళు
తెలివితక్కువవాళ్ళు.
21 మీ సంగతి నా సముఖంలో వివరించండి.
వాళ్ళను కలిసి ఆలోచన చేసుకోనివ్వండి.
ఈ విధంగా జరుగుతుందని పూర్వకాలంనుంచి
తెలియజేసినదెవరు?
చాలా కాలంక్రింద దానిని ప్రకటించినదెవరు?
యెహోవా అనే నేనే గదా! నేను తప్ప
ఇంకా ఏ దేవుడూ లేడు.
నేనే న్యాయవంతుడైన దేవుణ్ణి. రక్షకుణ్ణి.
నేను తప్ప ఏ దేవుడూ లేడు.
22 “భూమి కొనలలో ఉన్నవారలారా!
నావైపు తిరిగి విముక్తులు కండి! నేనే దేవుణ్ణి.
ఇంకా ఏ దేవుడూ లేడు.
23 నా ఎదుట ప్రతి మోకాలూ వంగుతుందనీ
ప్రతి నాలుకా నాతోడని ప్రమాణం చేస్తుందనీ నేను
నా సొంత పేరుమీద శపథం చేశాను.
నా నోటనుంచి వెలువడ్డ ఆ మాట యథార్థమైనది.
దానికి తిరుగు లేదు.
24 ‘యెహోవాకే న్యాయం, బలం ఉన్నాయి’ అని
అందరూ నా విషయం చెపుతారు.”
ఆయనదగ్గరికే మనుషులు వస్తారు.
ఆయనమీద కోపంతో మండిపడ్డవాళ్ళంతా
సిగ్గుపాలవుతారు.
25 ఇస్రాయేల్ సంతతివారంతా
యెహోవా మూలంగా నిర్దోషుల
లెక్కలో చేరి ఉత్సాహపడుతారు.