44
1 “నా సేవకుడైన యాకోబూ! నేను ఎన్నుకొన్న
ఇస్రాయేలూ! ఇప్పుడు విను!
2 నిన్ను సృజించి గర్భంలో నిర్మించి
నీకు సహాయం చేసే యెహోవా చెప్పేదేమిటంటే,
యాకోబూ! నా సేవకుడా! నేను ఎన్నుకొన్న
యెషూరూనూ! భయపడకు!
3 దప్పిగొన్న వ్యక్తిమీద నీళ్ళనూ,
ఎండినభూమిమీద ప్రవాహాలనూ కుమ్మరిస్తాను.
నీ సంతానంమీద నా ఆత్మనూ నీ వంశస్థులమీద
నా ఆశీస్సులనూ కుమ్మరిస్తాను.
4 నీటి కాలువలదగ్గర ఉన్న నిరవంజి చెట్లలాగా
గడ్డిలో వారు పెరుగుతారు.
5 ఒక మనిషి ‘నేను యెహోవావాణ్ణి’ అంటాడు.
ఇంకొకడు తనకు యాకోబు అనే పేరు పెట్టుకొంటాడు.
ఇంకొకడు ‘యెహోవాకు చెందినవాణ్ణి’ అని
తన చేతిమీద వ్రాసి ఇస్రాయేలనే మారుపేరు పెట్టుకొంటాడు.
6 “ఇస్రాయేల్ ప్రజల రాజూ, విముక్తిదాతా,
సేనలప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే,
నేను మొదటివాణ్ణీ, చివరివాణ్ణీ.
నేను తప్ప ఏ దేవుడూ లేడు.
7 నావంటివాడెవడు ఉన్నాడు? ఎవడైనా ఉంటే,
ఈ పురాతన ప్రజను నేను స్థాపించినప్పటినుంచి
జరిగిన సంగతులనూ, రాబోయే సంగతులనూ
నా ఎదుట తెలియజేసి వివరంగా చెప్పాలి.
అవును, రాబోయే సంగతులను గురించి తెలియజేయాలి.
8 మీరు వణకవద్దు, భయపడవద్దు,
చాలా కాలం క్రిందట నేను మీకు
ఈ సంగతులను వినిపించి తెలియజేయలేదా?
మీరే నాకు సాక్షులు.
నేను తప్ప వేరే దేవుడున్నాడా, చెప్పండి.
నేను తప్ప వేరే ఆధారశిల లేడు. అలాంటివాణ్ణెవణ్ణీ ఎరగను.
9 “విగ్రహాలను చేసేవాళ్ళంతా వట్టివాళ్ళు. వాళ్ళకు ఇష్టమైనవి కూడా పనికిమాలినవి. వాటి తరఫున మాట్లాడేవాళ్ళు గుడ్డివాళ్ళే. వాళ్ళకు తెలివి లేదు. వాళ్ళు సిగ్గుపాలవుతారు. 10 ఎవడైనా పనికిరాని దేవతను రూపొందిస్తే, విగ్రహాన్ని పోతపోస్తే, 11 అతడి తోడివాళ్ళంతా సిగ్గుపాలవుతారు. శిల్పులు మానవమాత్రులే. వాళ్ళంతా సమకూడి నిలబడాలి. వాళ్ళు ఏకంగా భయానికీ, కలవరానికీ గురి అవుతారు.
12 “కుమ్మరి ఇనుప పనిముట్టును తీసుకొని నిప్పుకణాలలో దానితో పనిచేస్తాడు. సుత్తెతో విగ్రహాన్ని రూపొందించి, తన చేతి బలంతో దానిని చేస్తాడు. అతడికి ఆకలి వేస్తుంది, బలం పోతుంది. నీళ్ళు త్రాగక పూర్తిగా అలసిపోతాడు. 13 వడ్రంగి కొలనూలు వేస్తాడు, ఆకారం వ్రాసి ఉలితో చక్క చేసి, కంట్రోణితో గురుతులు పెట్టి దానిని రూపొందిస్తాడు. గుడిలో దానిని ఉంచాలని మనిషి రూపాన్ని – అందమైన మనిషి ఆకారాన్ని – చేస్తాడు. 14 ఒక మనిషి దేవదారు చెట్లను నరికివేస్తాడు. లేదా, ఏదైనా సరళ వృక్షాన్ని గానీ, సిందూర వృక్షాన్ని గానీ ఎన్నుకొని అడవి చెట్లలో పెరగనిస్తాడు. లేదా, ఒక రకమైన దేవదారు చెట్టును నాటుతాడు. వాన దానిని పెరిగేలా చేస్తుంది. 15 తరువాత అది వంటచెరుకుగా పనికి వస్తుంది. దానిలో కొంత తీసుకొని చలిమంట వేసుకొంటాడు. నిప్పు రాజబెట్టి రొట్టెలు కాలుస్తాడు. అంతేగాక, ఒక ముక్క తీసుకొని ఒక దేవతను చేస్తాడు, దానిని పూజిస్తాడు. విగ్రహాన్ని చేసి దానికి సాష్టాంగ నమస్కారాలు చేస్తాడు. 16 కొయ్యలో సగం అగ్నితో కాలుస్తాడు. దానితో మాంసం వండి తిని తృప్తిపడతాడు. చలి కాచుకొంటూ ‘చలి కాచుకొన్నాను. అగ్ని బాగుంది’ అంటాడు. 17 మిగిలిన కొయ్య తీసుకొని తనకోసం దేవతగా ఒక విగ్రహాన్ని చేయించుకొంటాడు. దాని ఎదుట సాష్టాంగపడి దానికి మొక్కుతాడు. దానికి ప్రార్థన చేసి, ‘నువ్వు నా దేవుడివి. నన్ను రక్షించు’ అంటాడు.
18 “వాళ్ళకేమీ తెలియదు, ఏమీ అర్థం కాదు. వాళ్ళ కళ్ళకు బురద అలికినట్లుంది. వాళ్ళు ఏమీ చూడరు. వాళ్ళ హృదయాలు మూయబడ్డాయి. వాళ్ళు ఏమీ గ్రహించరు. 19 ఎవడూ ఆలోచించడు. ‘కొయ్యలో సగం నిప్పులో కాల్చాను. నిప్పులమీద రొట్టెలు కాల్చాను, మాంసం వండుకొని తిన్నాను. మిగిలిన కొయ్యతో అసహ్యమైనదానిని చేస్తానా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడతానా?’ అని చెప్పడానికి ఎవడికీ తెలివి లేదు, గ్రహింపు లేదు. 20 అలాంటివాడు బూడిదను మెక్కుతున్నాడు. తన మోసపోయిన మనసు తనను తప్పుదారి పట్టించింది. అతడు తనను రక్షించుకోలేడు. ‘నా కుడిచేతిలో ఉన్న ఈ వస్తువు అబద్ధం’ అనుకోలేడు.
21 “యాకోబూ! ఇస్రాయేలూ!
ఈ సంగతులు మనసులో ఉంచుకో.
నీవు నా సేవకుడవి. నేను నిన్ను నియమించాను.
ఇస్రాయేలూ, నీవు నా సేవకుడివి.
నేను నిన్ను మరువను.
22 మంచును చెదరగొట్టినట్టు, మబ్బును తొలగించినట్టు
నేను నీ అక్రమాలను, పాపాలను తుడిచివేశాను.
నేను నిన్ను వెల ఇచ్చి విడిపించాను.
గనుక నా దగ్గరికి తిరిగి రా!”
23 యెహోవా ఆ కార్యం చేశాడు. ఆకాశాల్లారా!
ఆనంద ధ్వనులు చేయండి.
భూమి అగాధ స్థలాల్లారా! కేకలు పెట్టండి.
పర్వతాల్లారా! అరణ్యమా! దానిలోని ప్రతి వృక్షమా!
సంగీత నాదం చేయండి.
యెహోవా వెల ఇచ్చి యాకోబును విడిపించాడు.
ఇస్రాయేల్‌లో తన ఘనతను ప్రదర్శిస్తాడు.
24 గర్భంలో నిన్ను రూపొందించిన నీ విమోచకుడైన
యెహోవా ఇలా అంటున్నాడు:
“నేను యెహోవాను. అన్నిటికీ కర్తను నేనే.
నేనే ఆకాశాలను వ్యాపింపజేశాను,
నేనే భూమిని పరచాను.
25 నేను అబద్ధ ప్రవక్తలు చెప్పే సూచనలను
వమ్ము చేసేవాణ్ణి; సోదెగాండ్రను
పిచ్చివాళ్ళుగా కనుపరచేవాణ్ణి;
జ్ఞానులను వెనక్కు తిప్పి వాళ్ళ విద్య
అవిద్యగా వెల్లడి చేసేవాణ్ణి;
26 నా సేవకుడి మాటలను స్థిరపరచేవాణ్ణి;
నా వార్తాహరుల ఆలోచనలను సాధించేవాణ్ణి;
జెరుసలం విషయం ‘అది నివాసస్థలంగా ఉంటుంది’
అనీ, యూదా పట్టణాల విషయం
‘వాటిని కట్టడం జరుగుతుంది’ అనీ,
వాటి శిథిలాల విషయం ‘వాటిని బాగు చేస్తాను’
అనీ చెప్పేవాణ్ణి;
27 లోతైన నీళ్ళతో ‘ఇంకిపో!
నీ ప్రవాహాలు ఇంకిపోయేలా చేస్తున్నాను’ అనేవాణ్ణి;
28 కోరెషు విషయం ‘అతడు నా మంద కాపరి,
నా సంకల్పాన్నంతా నెరవేరుస్తాడు.
అతడు జెరుసలంను ఉద్దేశించి దానిని మళ్ళీ కట్టడం జరగాలి,
దాని దేవాలయానికి పునాది వేయాలి అంటాడు’
అని చెప్పేవాణ్ణి.