43
1 అయితే ఇప్పుడు యాకోబూ!
నిన్ను సృజించిన యెహోవా, ఇస్రాయేలూ!
నిన్ను రూపొందించిన యెహోవా ఇలా అంటున్నాడు:
“నేను నిన్ను వెల ఇచ్చి విడిపించాను.
భయంతో ఉండబోకు. పేరుపెట్టి నిన్ను పిలిచాను.
నీవు నా సొత్తు.
2 నీవు నీళ్ళలో పడి దాటేటప్పుడు
నేను నీతో ఉంటాను. నదులలో పడి వెళ్ళేటప్పుడు
అవి నీమీద పొర్లిపారవు.
నీవు అగ్నిలో పడి నడిచివెళ్ళేటప్పుడు కాలిపోవు.
మంటలు నిన్ను కాల్చవు.
3 “ఎందుకంటే నేను యెహోవాను, నీ దేవుణ్ణి,
ఇస్రాయేల్ ప్రజల పవిత్రుణ్ణి, నీ రక్షకుణ్ణి.
నీకు విడుదల కలిగించే వెలగా ఈజిప్టును ఇచ్చాను.
నీకోసం కూషునూ సెబానూ ఇచ్చాను.
4 నీవు నా దృష్టికి ప్రియుడివి, ఘనుడివి,
నీవంటే నాకు ప్రేమ, గనుక నీకు బదులుగా
మనుషులను ఇస్తాను.
నీ ప్రాణం కోసం జనాలను ఇస్తాను.
5 నేను నీతో ఉన్నాను, గనుక భయపడకు.
తూర్పునుంచి నీ సంతానాన్ని తీసుకువస్తాను.
పడమటినుంచి నిన్ను సమకూరుస్తాను.
6 ‘అప్పగించు’ అని ఉత్తర దిక్కుకు ఆజ్ఞ జారీ చేస్తాను.
‘బిగబట్టకు’ అని దక్షిణానికి ఆజ్ఞాపిస్తాను.
దూరంనుంచి నా కొడుకులను తీసుకురా!
భూమి కొనలనుంచి నా కూతుళ్ళను తీసుకురా!
7 నా ఘనతకోసం నేను సృజించి,
నా పేరు పెట్టినవారందరినీ తీసుకురా!
నేను వారిని రూపొందించి కలిగించినవాణ్ణి.”
8 కళ్ళు ఉండి కూడా గుడ్డివారుగా ఉన్నవారినీ,
చెవులుండి కూడా చెవిటివారుగా ఉన్నవారినీ
ముందుకు తీసుకురండి.
9 జనాలన్నీ సమకూడుతాయి,
జాతులన్నీ పోగవుతాయి.
వాళ్ళలో ఎవరు ఈ సంగతి తెలియజేశారు?
పూర్వం జరిగినవాటిని ఎవరు మాకు ప్రకటించారు?
వాళ్ళు యథార్థవంతులని రుజువు చేయడానికి
తమ సాక్షులను తేవాలి.
లేదా, విని “అది నిజమే” అని ఒప్పుకోవాలి.
10  యెహోవా చెప్పేదేమిటంటే,
“మీరు నాకు సాక్షులు, నేను ఎన్నుకొన్న నా సేవకులు.
మీరు నన్ను తెలుసుకొని నమ్మి, నేనే ఆయననని
గ్రహించాలని నా ఉద్దేశం.
నాకు మునుపు ఏ దేవుడూ రూపొందలేదు.
నా తరువాత ఏ దేవుడూ ఉండడు.
11 నేను, నేను మాత్రమే యెహోవాను.
నేను తప్ప వేరే రక్షకుడు లేడు.
12 నేనే బయలుపరచినవాణ్ణి, రక్షించినవాణ్ణి,
తెలియజేసినవాణ్ణి. నేనే అలా చేశాను,
మీమధ్య ఉన్న మరే దేవతా కాదు.
నేనే దేవుణ్ణని మీరు నాకు సాక్షులు.
ఇది యెహోవా వాక్కు.
13 అనాది కాలంనుంచి నేనే దేవుణ్ణి.
నా చేతిలోనుంచి విడిపించగలవాడెవడూ లేడు.
నేను పని చేస్తే దానిని ఎవడు త్రిప్పివేయగలడు?”
14 ఇస్రాయేల్ ప్రజల పవిత్రుడూ,
మీ విముక్తిదాతా అయిన యెహోవా
ఇలా అంటున్నాడు:
“మీకోసం నేను బబులోను మీదికి సైన్యాన్ని
పంపుతాను. కల్దీయవాళ్ళు పతనమై,
తమ గర్వకారణంగా ఉన్న తమ ఓడలలో
పారిపోవడానికి ప్రయత్నించేలా చేస్తాను.
15 నేను యెహోవాను, మీ పవిత్రుణ్ణి,
ఇస్రాయేల్‌ను సృజించినవాణ్ణి, మీ రాజును.”
16 యెహోవా – సముద్రంలో త్రోవను కలిగించినవాడూ,
17 మహా జలాలలో దారిని కలగజేసినవాడూ,
రథాలనూ, గుర్రాలనూ సైన్యాన్నీ యుద్ధవీరులనూ
రప్పించినవాడూ,
వాళ్ళంతా ఏకంగా పడి మళ్ళీ లేవలేకుండా నాశనమై
వత్తిలాగా ఆరిపోయేలా చేసినవాడూ అయిన
యెహోవా ఇలా అంటున్నాడు:
18 “మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు.
పూర్వం జరిగిన సంగతులను తలచుకోవద్దు.
19 ఎందుకంటే, నేను క్రొత్త క్రియ చేస్తున్నాను.
ఇప్పుడే అది ఆరంభమౌతున్నది.
అది మీకు గోచరం కావడం లేదా?
నేను అరణ్యంలో త్రోవను కలిగిస్తున్నాను,
ఎడారిలో ప్రవాహాలు పారేలా చేస్తున్నాను.
20 నేను ఎన్నుకొన్న ప్రజలు త్రాగడానికి అరణ్యంలో నీళ్ళు,
ఎడారిలో ప్రవాహాలు కలిగించడం చూచి
అడవి జంతువులూ నక్కలూ
నిప్పుకోళ్ళూ నన్ను గౌరవిస్తాయి.
21 నాకోసం నేను రూపొందించిన
ప్రజ నా కీర్తిని చాటిస్తారు.
22 “అయితే యాకోబూ! నీవు నాకు ప్రార్థన చేయలేదు.
ఇస్రాయేలూ! నా విషయం నీవు విసుగుపడ్డావు.
23 హోమాలుగా గొర్రెమేకలను నా దగ్గరికి తేలేదు.
నీ బలులచేత నన్ను గౌరవించలేదు.
నైవేద్యాలు చేయాలని నేను నిన్ను బలవంతం పెట్టలేదు.
ధూపం వేయాలని నిన్ను విసికించలేదు.
24 నాకోసం పరిమళ లవంగ చెక్కకు
నీవు డబ్బు ఖర్చు చేయలేదు.
నీ బలిపశువుల క్రొవ్వుచేత నన్ను తృప్తిపరచలేదు.
సరికదా, నీ పాపాలను భారంగా నామీద మోపావు.
నీ అపరాధాలచేత నన్ను ఆయాసపెట్టావు.
25 నేను – నేనే – నాకోసం
నీ అక్రమ కార్యాలను తుడిచివేసేవాణ్ణి.
26 గతాన్ని నాకు జ్ఞాపకం చెయ్యి!
మనం కలిసి తర్కించుకుందాం!
నీవు నిర్దోషివని నీ రుజువులు చెప్పు!
27 నీ ఆదిపురుషుడు అపరాధం చేసినవాడే.
నీ మధ్యవర్తులు నామీద తిరగబడ్డవారే.
28 అందుచేత దేవాలయ నాయకులను కూలుస్తాను,
యాకోబును శాపానికి గురి చేసి, దూషణపాలు చేస్తాను.