42
1 “ఇడుగో నా సేవకుడు!
నేను ఈయనకు అండగా ఉన్నాను.
ఈయనను ఎన్నుకొన్నాను.
ఈయన అంటే నా మనసుకు ఎంతో ఆనందం.
ఈయనమీద నా ఆత్మను ఉంచాను.
ఈయన జనాలకు న్యాయం జరిగిస్తాడు.
2 ఈయన కేకలు వేయడు. అరవడు,
తన స్వరం వీధిలో వినిపించదు.
3 ఈయన నలిగిన రెల్లును విరవడు,
మకమకలాడుతూ ఉన్న వత్తిని ఆర్పడు.
ఈయన నమ్మకంగా న్యాయాన్ని జరిగిస్తాడు.
4 లోకంలో న్యాయం స్థాపించేవరకు ఈయన నీరసించడు,
నలిగిపోడు, సముద్రతీరస్థులు ఈయన ఉపదేశంకోసం
ఆశాభావంతో ఎదురుచూస్తారు.”
5 యెహోవా దేవుడు – ఆకాశాలను కలిగించి,
వాటిని విశాలం చేసి, భూమిని పరచి,
దానిమీద పుట్టినదంతా విస్తరింపజేసి,
దానిమీద ఉన్న ప్రజలకు ప్రాణం,
నడిచేవారికి జీవం ఇస్తూ ఉన్న యెహోవా దేవుడు
ఆయనతో ఇలా అంటున్నాడు:
6 “నేను – యెహోవాను – నీతి నిజాయితీ విషయంలో
నిన్ను పిలిచాను. నేను నీ చేయి పట్టుకొని
నిన్ను కాపాడతాను.
7 గుడ్డివారి కండ్లు తెరవడానికీ, ఖైదీలను
చెరలోనుంచి బయటికి తేవడానికీ,
చీకటిలో కూర్చుని ఉన్నవారిని బందీగృహంలోనుంచి
వెలుపలికి తేవడానికీ నేను నిన్ను ప్రజకు
ఒడంబడికగా చేస్తాను,
జనాలన్నిటికీ నిన్ను వెలుగుగా నియమిస్తాను.
8 నేను యెహోవాను. ఇదే నా పేరు.
ఇంకెవరికీ నా ఘనతను ఇవ్వను.
నాకు రావలసిన స్తుతి విగ్రహాలకు చెందనివ్వను.
9 మునుపు నేను చెప్పిన సంగతులు జరిగాయి గదా.
ఇప్పుడు క్రొత్త సంగతులు తెలియజేస్తున్నాను.
జరిగేముందే వాటిని మీకు తెలుపుతున్నాను.”
10 సముద్ర ప్రయాణం చేసేవారలారా!
సముద్రంలో సమస్తమా! ద్వీపాల్లారా! ద్వీపవాసుల్లారా!
యెహోవాకు క్రొత్త పాట పాడండి.
భూమి కొనలనుంచి ఆయనను స్తుతించండి.
11 ఎడారి, దాని గ్రామాలు, కేదారు నివాసాలు
బిగ్గరగా పాడాలి. సెల పట్టణస్థులు సంతోషించాలి.
వాళ్ళు పర్వత శిఖరాలనుంచి కేకలు పెట్టాలి.
12 సముద్ర తీరస్థులు యెహోవాకు ఘనత ఆపాదించాలి.
ఆయన కీర్తిని చాటించాలి.
13 యెహోవా పరాక్రమశాలిలాగా బయలుదేరుతాడు.
యుద్ధవీరుడిలాగా తన ఆసక్తిని పురికొలుపుకుంటాడు.
తన శత్రువులమీద హుంకారం చేస్తాడు,
వాళ్ళమీద విజయం సాధిస్తాడు.
14 “చాలా కాలంనుంచి నేను ఊరుకొన్నాను.
ఏమీ చెప్పకుండా నన్ను ఆపుకున్నాను.
ఇప్పుడైతే కాన్పుకు వచ్చే స్త్రీలాగా
మూలుగుతున్నాను, ఎగశ్వాసతో ఒగర్చుతున్నాను,
రొప్పుతున్నాను.
15 నేను పర్వతాలనూ కొండలనూ పాడు చేస్తాను.
వాటిమీది చెట్టుచేమలన్నీ ఎండిపోయేలా చేస్తాను.
నదులను లంకలుగా మారుస్తాను.
మడుగులను ఇంకిపోయేలా చేస్తాను.
16 గుడ్డివారిని వారికి తెలియని మార్గంలో నడిపిస్తాను.
వారెరగని త్రోవల్లో వారికి దారి చూపుతాను.
వారి ఎదుటే చీకటిని వెలుగుకు మారుస్తాను,
వంకరటింకర స్థలాలను చదును చేస్తాను.
నేను వారిని విడువక ఈ క్రియలను చేస్తాను.
17 గాని, చెక్కిన విగ్రహాలమీద నమ్మకం పెట్టి,
పోత విగ్రహాలను చూచి ‘మీరే మాకు దేవుళ్ళు’
అనేవాళ్ళు వెనక్కు తొలగిపోయి,
పూర్తిగా సిగ్గుపాలవుతారు.
18 “చెవిటివారలారా! వినండి.
గుడ్డివారలారా! చూడండి, గమనించండి.
19 నా సేవకుడు తప్ప ఇంకెవడు గుడ్డివాడు?
నేను పంపిన వార్తాహరుడు తప్ప ఇంకెవడు చెవిటివాడు?
నా భక్తుడు తప్ప, యెహోవా సేవకుడు తప్ప
ఇంకెవడు అంధుడు?
20 నీకు అనేక సంగతులు కనబడ్డాయి గాని,
నీవు వాటిని చూడలేదు.
నీ చెవులు తెరచి ఉన్నాయి గాని, ఏమీ వినడం లేదు.”
21 తన నీతినిజాయితీ కోసం ధర్మశాస్త్రాన్ని ఘనపరచి
గొప్ప చేయడం యెహోవాకు ఇష్టం అయింది.
22 అయితే ఈ ప్రజను కొల్లగొట్టడం జరిగింది.
వారు దోపిడీ అయ్యారు. వారంతా గుహలలో
చిక్కుపడి ఉన్నారు. చెరసాలలో మాటు మణిగి ఉన్నారు.
విడిపించేవాడెవడూ లేక దోపిడీకి గురి అయ్యారు.
“వాళ్ళను తిరిగి పంపేయండి” అనేవాడెవడూ
లేక కొల్లసొమ్మయ్యారు.
23 మీలో ఎవరు దీనిని వింటారు?
రాబోయే కాలంలో ఎవరు దీనిమీద మనసు పెడతారు?
24 యాకోబు జనాన్ని దోపిడీగా అప్పగించినదెవడు?
దోచుకొనేవాళ్ళకు ఇస్రాయేల్‌ను అప్పగించినదెవరు?
మనం ఎవరికి విరోధంగా అపరాధం చేశామో
ఆ యెహోవాయే గదా!
వారు ఆయన విధానాలను అనుసరించక
నిరాకరించారు, ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించలేదు.
25 అందుచేతే ఆయన వారిమీద తన కోపాగ్ని
కుమ్మరించాడు. వారిని యుద్ధతీవ్రతకు గురి చేశాడు.
దానివల్ల మంటలు వారిని చుట్టుకొన్నాయి గాని,
వారు గ్రహించలేదు. అవి వారిని మాడ్చాయి గాని,
వారు నేర్చుకోలేదు.