41
1 ✽“ద్వీపాల్లారా! నా ఎదుట ఊరుకోండి.జనాలు క్రొత్త బలం పుంజుకోవాలి.
వారు నా సన్నిధానానికి వచ్చి మాట్లాడాలి.
తీర్పు తీర్చే స్థలంలో మనం సమకూడుదాం రండి.
2 నీతిని సాధించేవాణ్ణి తూర్పు✽నుంచి పురికొలిపి
తన పాదాల దగ్గరికి పిలిచిన✽వాడెవడు?
ఆయన అతనికి జనాలను అప్పగిస్తున్నాడు,
రాజులను లోపరుస్తున్నాడు.
అతడు తన ఖడ్గంచేత వాళ్ళను ధూళిపాలు చేస్తాడు.
తన వింటిచేత వాళ్ళను గాలికి ఎగిరిపోయే
పొట్టులాగా చేస్తాడు.
3 ✽అతడు వాళ్ళను తరుముతున్నాడు.
ఇంతకుముందు తను అడుగుపెట్టని దారినే
సురక్షితంగా సాగిపోతున్నాడు.
4 ✽ఈ పని పూనుకొని నెరవేర్చినదెవరు?
ఆదినుంచి మానవ వంశాలను రప్పించినది ఎవరు?
యెహోవా అనే నేనే. నేను మొదటివాణ్ణి.
కడపటివారిలో కూడా ఉన్నవాణ్ణి.
5 ✽దీన్ని చూచి ద్వీపాలు భయపడుతున్నాయి.
భూమి కొనలు వణకుతున్నాయి.
వాటి జనాలు వచ్చి చేరుతున్నాయి.
6 వాళ్ళు ఒకడికొకడు సహాయం చేస్తున్నారు.
‘ధైర్యంగా ఉండు’ అని ఒకడితో ఒకడు అంటున్నాడు.
7 శిల్పి కంసాలిని ఉత్సాహపరుస్తున్నాడు.
సుత్తితో నునుపు చేసేవాడు దాగలిమీద కొట్టేవాణ్ణి
ఉత్సాహపరుస్తున్నాడు.
‘టంకం పని బాగా చేశావు’ అంటాడు.
విగ్రహం కదలకుండా మేకులతో దానిని బిగిస్తాడు.
8 “ఇస్రాయేలూ! నీవు నా సేవకుడివి✽.
యాకోబూ! నిన్ను నేను ఎన్నుకొన్నాను.
నీవు నా మిత్రుడైన✽ అబ్రాహాము సంతానం.
9 నేను నిన్ను భూమి కొనలనుంచి తీసుకువచ్చాను,
దూరంగా ఉన్నదాని మూలలనుంచి
నిన్ను రప్పించాను. నీవు నా సేవకుడివన్నాను.
నేను నిన్ను ఎన్నుకొన్నాను, నిన్ను నిరాకరించలేదు✽.
10 నేను నీతో✽ ఉన్నాను, గనుక భయంతో ఉండబోకు.
నేను నీ దేవుణ్ణి, గనుక హడలిపోవద్దు.
నేను నీకు బలం✽ చేకూరుస్తాను.
నీకు సహాయం✽ చేస్తాను. న్యాయాన్ని జరిగించే
నా కుడిచేతితో నిన్ను పడకుండా పట్టుకొంటాను.
11 ✽“నీమీద కోపంతో మండిపడేవాళ్ళంతా సిగ్గుపడి
అవమానం పాలవుతారు. నిన్ను ఎదిరించేవాళ్ళు
అంతర్థానమై నశించిపోతారు.
12 నీతో పోరాడేవాళ్ళను నీవు వెదికినా వాళ్ళు కనిపించరు.
నీతో యుద్ధం చేసేవాళ్ళు అంతర్థానమై గతించిపోతారు.
13 ✽ఎందుకంటే, నేను – నీ దేవుడైన యెహోవాను –
నీ కుడిచేతిని పట్టుకొంటున్నాను. భయపడవద్దు,
నేనే నీకు సహాయం చేస్తాను అంటున్నాను.
14 పురుగు✽లాంటి యాకోబూ! స్వల్ప జనమైన ఇస్రాయేలూ!
భయపడవద్దు. నేనే నీకు సహాయం చేస్తాను.
ఇది యెహోవా వాక్కు. నీ విముక్తిదాత✽
ఇస్రాయేల్ ప్రజల పవిత్రుడు.
15 ✽ఇదిగో విను! నేను నిన్ను నూర్పిడి సాధనంలాగా చేస్తాను.
పదునైన అనేక కక్కులున్న క్రొత్త నూర్పిడి
సాధనంలాగా చేస్తాను.
నీవు పర్వతాలను నూరుస్తావు, వాటిని చూర్ణం చేస్తావు.
కొండలను పొట్టులాగా చేస్తావు.
16 నీవు వాటిని గాలిస్తావు. గాలి వాటిని తీసుకుపోతుంది.
సుడిగాలి వాటిని చెదరగొట్టివేస్తుంది.
నీవు యెహోవామూలంగా సంతోషిస్తావు.
ఇస్రాయేల్ ప్రజల పవిత్రుడి ద్వారా ఉత్సాహపడుతావు.
17 ✝“దరిద్రులు, దురవస్థలో ఉన్నవారు
నీళ్ళు వెదకుతున్నారు. నీళ్ళు దొరకక
వారి నాలుక దప్పిచేత ఎండిపోతున్నది.
నేను – యెహోవాను – వారికి జవాబిస్తాను.
నేను – ఇస్రాయేల్ ప్రజల దేవుణ్ణి – వారిని విడిచి వెళ్ళను.
18 చెట్లులేని మెరకలమీద నదులు పారేలా చేస్తాను.
లోయలలో ఊటలు పెల్లుబికేలా చేస్తాను.
ఎడారిని మడుగుగా, ఎండిన నేలను
నీటి బుగ్గలుగా చేస్తాను.
19 ✽ ఎడారిలో దేవదారు వృక్షాలను, తుమ్మచెట్లను,
గొంజిచెట్లను, ఆలీవ్‌చెట్లను నాటిస్తాను.
ఎండిపోయిన ప్రాంతంలో తమాల వృక్షాలను,
సరళ వృక్షాలను, నేరేడు చెట్లను నాటిస్తాను.
20 ✽యెహోవా చెయ్యి ఇలా జరిగించిందనీ
ఇస్రాయేల్ ప్రజల పవిత్రుడు ఈ విధంగా కలిగించాడనీ
ప్రజలు చూచి తెలిసికొని,
నిదానించి తేటగా గ్రహించడానికి నేను అలా చేస్తాను.”
21 ✽“మీ వివాదంతో రండి” అని యెహోవా అంటున్నాడు.
“మీ రుజువులు చూపెట్టండి” అని
యాకోబు ప్రజల రాజు చెపుతున్నాడు.
22 జరగబోయేవాటిని విశదపరచి
మా ఎదుట తెలియజేయండి!
మునుపు జరిగినవాటిని మేము ఆలోచించి
వాటి ఫలితాన్ని తెలుసుకొనేలా వాటిని
విశదపరచి చెప్పండి!
23 భవిష్యత్తులో జరగబోయే సంగతులను తెలియజేస్తే
మీరు దేవతలని మేము ఒప్పుకొంటాం!
మేము దానిని గమనించి ఆశ్చర్యంతో చూచేలా
ఏదైనా మేలు గానీ, కీడు గానీ జరిగించండి!
24 మీరు లేనట్టున్నారు. మీ కార్యం శూన్యం✽.
మిమ్మల్ని కోరుకొనేవాళ్ళు అసహ్యులు✽.
25 ✽ “ఉత్తర దిక్కునుంచి నేనొక వ్యక్తిని పురికొలుపుతున్నాను.
అతడు వస్తున్నాడు. అతడు నా పేర ప్రార్థన✽ చేసేవాడు.
అతడు సూర్యోదయ దిక్కునుంచి వస్తున్నాడు.
బురద త్రొక్కేవిధంగా, కుమ్మరి మట్టిని త్రొక్కేవిధంగా
అతడు అధికారులను త్రొక్కివేస్తాడు.
26 ✽మేము తెలుసుకొనేలా ఆది నుంచీ
దీనిని గురించి తెలియజేసినదెవరు?
‘అతడు సరిగా చెప్పాడు’ అని మేము ఒప్పుకోవడానికి
పూర్వకాలంలో దీనిని తెలియజేసినదెవరు?
ఎవడూ తెలియజేయలేదు.
ఎవడూ వినిపించలేదు. మీరు
ఏ మాటా ఎవ్వరికీ చెప్పలేదు.
27 ‘ఇవిగో, అవి!’ అని సీయోనుతో మొదట చెప్పినవాణ్ణి నేనే.
జెరుసలంకు శుభవార్త✽ ప్రకటించే వాణ్ణి నేను పంపాను.
28 నేను చూస్తే ఎవడూ లేడు – వాళ్ళలో సలహా చెప్పడానికి
ఎవడూ లేడు, నేను వాళ్ళను అడిగినదానికి
జవాబివ్వగల వాడెవడూ లేడు.
29 వాళ్ళంతా✽ మిథ్య. వాళ్ళ పనులు శూన్యం,
వాళ్ళ విగ్రహాలు వ్యర్ధం, వట్టి గాలి.