40
1 మీ దేవుడు ఇలా చెపుతున్నాడు:
“నా ప్రజను ఓదార్చండి, వారిని ఓదార్చండి.
2 జెరుసలంతో మృదువుగా మాట్లాడండి.
దాని కష్టకాలం అయిపోయిందనీ,
దాని అపరాధాలకు క్షమాపణ దొరికిందనీ,
దాని పాపాలకు అది యెహోవాచేత
రెండంతలుగా శిక్ష పొందిందనీ దానికి ప్రకటించండి.”
3 ఎడారిలో ఒక వ్యక్తి ఇలా చాటిస్తూ ఉన్నాడు:
“యెహోవాకోసం మార్గం సిద్ధం చేయండి.
ఎడారిలో మన దేవునికోసం రాజమార్గం తిన్ననిది చేయండి.
4  ప్రతి లోయనూ ఎత్తు చేయాలి.
ప్రతి పర్వతాన్నీ కొండనూ అణచాలి.
మెరక పల్లాలున్న స్థలాలు చదును కావాలి.
కరుకైన ప్రదేశాలు మైదానం కావాలి.
5 అప్పుడు యెహోవా శోభ వెల్లడి అవుతుంది.
శరీరమున్న వారందరికీ అది కనిపిస్తుంది.
ఇలా జరుగుతుందని యెహోవా తానే తెలియజేశాడు.”
6 “చాటించు!” అని ఆజ్ఞ వినబడింది.
“నేను చాటించవలసినదేమిటి?”
అని అతడు అడిగాడు.
“శరీరమున్నవారంతా గడ్డిలాంటివారు,
వారి అందమంతా అడవి పువ్వుల్లాగా ఉంది.
7 యెహోవా దానిమీద ఊదగానే గడ్డి ఎండిపోతుంది,
పువ్వు వాడిపోతుంది. ప్రజలు గడ్డిలాంటివారే.
8 గడ్డి ఎండిపోతుంది గాని, మన దేవుని వాక్కు
శాశ్వతంగా నిలిచి ఉంటుంది.”
9 సీయోనుకు శుభవార్త ప్రకటించేవారలారా!
ఎత్తయిన కొండ ఎక్కండి.
జెరుసలంకు శుభవార్త ప్రకటించేవారలారా!
బిగ్గరగా చాటించండి. భయపడక చాటించండి.
యూదా పట్టణాలకు “ఇడుగో, మీ దేవుడు!”
అని ప్రకటించండి.
10 ఇదిగో వినండి! యెహోవాప్రభువు
తానే బలప్రభావాలతో వస్తాడు.
తనకోసం తన హస్తం పరిపాలిస్తుంది.
ఆయన ఇచ్చే బహుమానం ఆయనదగ్గరే ఉంది.
ఆయన ఇచ్చే వేతనం ఆయనతో కూడా వస్తుంది.
11 ఆయన గొర్రెల కాపరిలాగా తన మందను కాస్తాడు.
తన చేతులతో గొర్రెపిల్లలను ఎత్తి, తన గుండెమీద
ఆనించుకొని మోస్తాడు. పాలిచ్చేవాటిని మెల్లగా నడిపిస్తాడు.
12 తన పుడిసిటిలో జలాల పరిమాణం తెలుసుకొన్న వాడెవడు?
జేనతో ఆకాశాల కొలత చూచినవాడెవడు?
భూమి మట్టిని కొలపాత్రలో ఉంచినవాడెవడు?
త్రాసులో పర్వతాలను తూచినవాడెవడు?
తూకంచేత కొండల బరువు చూచినవాడెవడు?
13 యెహోవా ఆత్మను నడిపించిన వాడెవడు?
ఆయనకు సలహాదారుడై ఆయనకు ఉపదేశం ఇచ్చినవాడెవడు?
14 యెహోవా ఎవడిదగ్గర ఆలోచన అడిగాడు?
ఆయనకు వివేకం కలిగించినదెవడు?
న్యాయ మార్గం విషయం ఆయనకు నేర్పినదెవడు?
ఆయనకు జ్ఞానోపదేశం ఇచ్చినదెవడు?
తెలివి బోధించినదెవడు?
15  జనాలు చేదనుంచి పడ్డ చుక్కలాగా ఉన్నాయి,
త్రాసుమీది ధూళిలాగా ఉన్నాయి.
ఆయన ద్వీపాలను తూచి చూస్తే
అవి సన్నని దుమ్ములాగా ఉంటాయి.
16 హోమాలకోసం లెబానోనులో ఉన్న పశువులు చాలవు.
జ్వాలకోసం దాని అడవులు చాలవు.
17 ఆయన దృష్టిలో జనాలన్నీ లేనట్టుగానే ఉన్నాయి.
ఆయన అంచనాలో అవి శూన్యంగా ఉన్నాయి,
శూన్యంకంటే తక్కువగానే ఉన్నాయి.
18 అలాగైతే మీరు ఎవడితో దేవుణ్ణి పోలుస్తారు?
ఏరూపంతో ఆయనను సరిచూస్తారు?
19 విగ్రహం విషయం చూస్తే దానిని శిల్పి పోత పోస్తాడు,
కంసాలి దానికి బంగారం తొడుగు చేస్తాడు,
దానికి వెండి గొలుసులు చేస్తాడు.
20 అలాంటిదానిని అర్పించలేని బీదవాడు
పుచ్చిపోని మ్రాను ఎన్నుకొంటాడు.
కదలని విగ్రహాన్ని తయారు చేయడానికి
నేర్పుగల శిల్పిని వెదకి పిలుచుకొంటాడు.
21 మీకు తెలియదా? మీరు వినలేదా?
మొదటినుంచి ఎవరూ మీతో చెప్పలేదా?
భూమిస్థాపన విషయం మూలంగా మీరు గ్రహించలేదా?
22 ఆయన భూగోళానికి పైగా కూర్చుని ఉన్నాడు.
భూనివాసులు మిడతలలాగా కనిపిస్తూ ఉన్నారు.
తెరను విప్పినట్లు ఆయన ఆకాశాలను పరుస్తాడు.
నివాసం చేయడానికి డేరాలాగా వాటిని చాపుతాడు.
23 ఆయన రాజులను లేకుండా చేస్తాడు,
భూపతులను ఖాళీ చేస్తాడు.
24 వాళ్ళు విత్తనంలాగా విత్తబడగానే,
నాటబడగానే, భూమిలో వేరు తన్నేముందే,
ఆయన వాళ్ళమీద ఊదుతాడు అంతే.
వాళ్ళు వాడిపోతారు. సుడిగాలి పొట్టును
తీసివేసే విధంగా ఆయన వాళ్ళను తీసివేస్తాడు.
25 ఆ పవిత్రుడు అడిగేదేమిటంటే,
“మీరు నన్ను ఎవడితో పోలుస్తారు?
నన్ను ఎవడికి సాటి చేస్తారు?”
26 ఆకాశాలవైపు చూడండి. వాటిని కలిగించినదెవరు?
ఆ నక్షత్ర సమూహాలను ఒక్కొక్కటిగా
బయలు దేరేలా చేసేవాడే గదా.
ఆయన ప్రతిదానికీ పేరు పెట్టి పిలుస్తాడు.
ఆయనకు అధిక ప్రభావం, అమిత బలం ఉండడం చేత
ఒక్కటి కూడా విడిచిపెట్టడు.
27 యాకోబు ప్రజలారా! ఇస్రాయేల్ ప్రజలారా!
“మన పరిస్థితులు యెహోవాకు కనబడడం లేదు,
మన హక్కులను ఆయన అలక్ష్యం చేస్తున్నాడు”
అని మీరు చెప్పుకొంటున్నారు ఎందుకు?
28 మీకు తెలియదా? మీరు వినలేదా?
యెహోవా శాశ్వతంగా ఉన్న దేవుడు.
భూదిగంతాలను కలిగించినవాడు ఆయనే.
ఆయనకు అలసట,
బడలిక అంటూ ఏమీ కలగదు.
ఆయనకున్న జ్ఞానాన్ని పరిశోధించి
తెలుసుకోవడం అసాధ్యం.
29 అలసిపోయినవారికి ఆయన బలం ఇస్తాడు.
నీరసించిపోయినవారికి బలాభివృద్ధి చేకూరుస్తాడు.
30 కుర్రవాళ్ళు కూడా అలసట, బడలిక పడవచ్చు.
యువకులు తొట్రుపడి కూలవచ్చు.
31 అయితే యెహోవావైపు ఆశాభావంతో
ఎదురు చూచేవారికి క్రొత్తబలం కలుగుతుంది.
వారు గరుడపక్షిలాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.
వారు పరుగెత్తుతారు గాని, అలసిపోరు
నడుస్తారు గాని బడలిక చెందరు.