39
1 ✝ఆ కాలంలో బలదాను కొడుకైన మెరోదక్‌బలదాను బబులోనుకు రాజుగా ఉన్నాడు. హిజ్కియా జబ్బుపడి మళ్ళీ ఆరోగ్యవంతుడయ్యాడని విని, అతడు లేఖలు, కానుక హిజ్కియా దగ్గరికి పంపాడు. 2 వచ్చినవాళ్ళ మాటలు హిజ్కియా సంతోషంతో విన్నాడు, వాళ్ళకు తన భవనంలోని ఖజానాలో ఉన్నవన్నీ చూపించాడు. బంగారం, వెండి, సుగంధద్రవ్యాలు, పరిమళతైలం, ఆయుధాల కొట్టు, ధనాగారాలలో ఉన్నవన్నీ వాళ్ళకు చూపించాడు. తన భవనంలో గానీ, రాజ్యంలో గానీ వాళ్ళకు చూపించనిది ఏదీ లేదు.3 తరువాత యెషయాప్రవక్త హిజ్కియారాజు దగ్గరికి వచ్చి, “ఆ మనుషులు ఏమి చెప్పారు? ఎక్కడనుంచి మీ దగ్గరికి వచ్చారు?” అని అడిగాడు.
అందుకు హిజ్కియా “వాళ్ళు బబులోను అనే దూరదేశంనుంచి నా దగ్గరికి వచ్చారు” అని జవాబిచ్చాడు.
4 “మీ భవనంలో వాళ్ళు ఏమేమి చూశారు?” అని యెషయా అడిగాడు.
హిజ్కియా “నా భవనంలో ఉన్నవన్నీ చూశారు. నా ఖజానా గదులలో ఏదీ మరుగు చేయక అన్నీ వాళ్ళకు చూపించాను” అన్నాడు.
5 అప్పుడు యెషయా హిజ్కియాతో ఇలా చెప్పాడు: “సేనలప్రభువు యెహోవా పలికిన వాక్కు విను. 6 మీ భవనంలో ఉన్నవీ, నేటివరకూ మీ పూర్వీకులు కూడబెట్టినవీ అన్నీ బబులోనుకు కొల్లగా పోయే సమయం వస్తుంది. ఇక్కడ ఏమీ మిగలదని యెహోవా చెపుతున్నాడు. 7 మీకు పుట్టబోయే మీ సంతానంలో కొంతమందిని బబులోనువాళ్ళు తీసుకుపోయి బబులోను రాజుభవనంలో నపుంసకులుగా చేస్తారు.”
8 ✽హిజ్కియా యెషయాతో “నీవు చెప్పిన యెహోవా మాట మంచిదే” అన్నాడు. “నా రోజుల్లో సమాధానం, స్థిరత్వం ఉంటే మేలే గదా” అన్నాడు.