38
1 ఆ రోజులలో హిజ్కియాకు జబ్బు చేసింది. చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఆమోజు కొడుకు యెషయాప్రవక్త అతని దగ్గరికి వచ్చి, అతనితో “యెహోవా చెపుతున్నాడు, నీవు చనిపోతున్నావు. బ్రతకవు, గనుక నీ ఇంటి విషయాలు సరిపెట్టుకో” అన్నాడు.
2 అందుకు హిజ్కియా గోడవైపు ముఖం త్రిప్పుకొని, 3 యెహోవాను ఇలా ప్రార్థించాడు: “యెహోవా! నీ ఎదుట నేను నమ్మకంగా యథార్థ హృదయంతో ప్రవర్తిస్తూ ఉండేవాణ్ణి. నీ దృష్టిలో ఏవి మంచివో అవి జరిగించేవాణ్ణి. అది తలచుకొమ్మని నిన్ను ప్రాధేయపడుతున్నాను.” హిజ్కియా వెక్కివెక్కి ఏడ్చాడు.
4 అప్పుడు యెషయాకు యెహోవానుంచి వాక్కు వచ్చింది: 5 “నీవు వెళ్ళి హిజ్కియాతో ఈ విధంగా చెప్పు: నీ పూర్వీకుడైన దావీదుయొక్క దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే, నీ ప్రార్థన నేను విన్నాను. నీ కన్నీళ్ళు చూశాను. ఇంకా పదిహేను సంవత్సరాలు నీకు ఆయుష్షు పెంచుతాను. 6 అంతే కాకుండా, నిన్నూ ఈ నగరాన్నీ అష్షూరు రాజు చేతిలోనుంచి రక్షిస్తాను. ఈ నగరాన్ని కాపాడుతాను. 7 యెహోవా తాను చెప్పినమాట నెరవేరుస్తాడనడానికి ఆయన మీకు ఇచ్చిన సూచన ఇదే: 8 ఆహాజు చేయించిన నీడ గడియారంమీద ముందుకు పోయిన నీడ పది అంకెలు వెనక్కు పోయేలా చేస్తాను.” అప్పుడు సూర్యకాంతి దిగిన అంకెలలో పది అంకెలు తిరిగి ఎక్కింది.
9 యూదా రాజు హిజ్కియా జబ్బుపడి మళ్ళీ ఆరోగ్యవంతుడైన తరువాత అతడు రచించినది:
10 “నేను అనుకొన్నాను, నా జీవిత కాలం
మధ్య భాగంలో నేను మృత్యులోక ద్వారాలగుండా పోవాలి.
నా సంవత్సరాలలో మిగిలినవాటిని పోగొట్టుకోవాలి.
11 నేను అనుకొన్నాను, యెహోవాను సజీవుల లోకంలో
యెహోవాను మళ్ళీ చూడను.
మృత్యులోక నివాసినై ఇంకా మనుషులను చూడను.
12 “కాపరి డేరాలాగా నా ఉనికిపట్టును తీసివేయడం,
నా దగ్గరనుంచి తొలగించడం జరిగింది.
నేసేవాడిలాగా నేను నా జీవిత కాలాన్ని
చుట్టుకొని ముగించాను.
దేవుడు నన్ను మగ్గంనుంచి కత్తిరిస్తున్నాడు.
ఉదయంనుంచి రాత్రివరకు నీవు నన్ను
అంతం చేస్తున్నావు.
13 ఉదయంవరకు నా మనసును శాంతం చేశాను.
గాని, ఆయన సింహంలాగా నా ఎముకలన్నిటినీ
విరగ్గొట్టివేశాడు.
ఉదయంనుంచి రాత్రివరకు నీవు నన్ను అంతం చేస్తున్నావు.
14 మంగలకత్తిపిట్టలాగా ఓదెకొంగలాగా
నేను కూస్తూ ఉన్నాను, గువ్వలాగా మూలుగుతూ ఉన్నాను.
పైకి చూచి చూచి నా కళ్ళు మందగిస్తున్నాయి.
నాకు బాధ కలిగింది. యెహోవా! నాకు అండగా ఉండు.
15 “అయితే నేను ఏమనను? ఆయన నాకు మాట ఇచ్చాడు.
ఆయనే ఇలా జరిగించాడు.
నాకు కలిగిన మనోవేదన కారణంగా నా సంవత్సరాలన్నీ
నేను అణుకువగా నడుస్తాను.
16 ప్రభూ! ఇలాంటివాటివల్ల మనుషులు బ్రతుకుతారు.
వీటివల్ల నా ఆత్మకు జీవం ప్రాప్తించింది.
నీవు నన్ను బాగు చేశావు. బ్రతికించావు.
17 ఇంత వేదన నాకు క్షేమాన్ని కలిగించింది.
నీవు నన్ను ప్రేమిస్తూ నాశనకరమైన అగాధంనుంచి
విడిపించావు. నీ వీపు వెనుకవైపు నా పాపాలన్నీ పారవేశావు.
18 ఎందుకంటే, మృత్యులోకంలో నీకు స్తుతి కలగదు.
చావు నిన్ను కీర్తించదు.
సమాధిలోకి దిగినవారు నీ విశ్వసనీయత కోసం
ఎదురు చూడలేరు.
19 సజీవులు నిన్ను స్తుతించగలరు.
ఈ రోజు నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నట్టు సజీవులే
నిన్ను స్తుతించగలరు.
తండ్రులు కొడుకులకు నీ విశ్వసనీయతను
తెలియజేస్తారు.
20 యెహోవా నన్ను రక్షించేవాడు. మనం బ్రతికినన్నాళ్ళు
యెహోవా ఆలయంలో తంతివాద్యాలతో పాటలు పాడుతాం.”
21 యెషయా “అంజూరుపండ్ల ముద్ద తీసుకొని ఆ కురుపుకు కట్టాలి. అప్పుడతడు బాగుపడతాడు” అన్నాడు. 22 అంతకుముందు హిజ్కియా “నేను యెహోవా ఆలయానికి వెళ్తాననడానికి సూచన ఏమిటి?” అని అడిగాడు.