66
1 ✽✽యెహోవా ఈ విధంగా అంటున్నాడు:“ఆకాశాలు నాకు సింహాసనం, భూమి నా పాదపీఠం.
మీరు నా కోసం కట్టగల నివాసం ఏపాటిది?
నా విశ్రాంతి స్థలం ఎక్కడ ఉంటుంది?
2 నేను నా చేతులతో వీటన్నిటినీ చేశాను.
అన్నీ నా ద్వారానే కలిగాయి. ఇది యెహోవా వాక్కు.
ఎవరైతే వినయం, నలిగిన హృదయం కలిగి
నా మాటకు వణకుతారో వారిమీదే నా దృష్టి✽ ఉంటుంది.
3 ✽ “ఎద్దులను వధించి అర్పించడం,
మనుషులను చంపడం గొర్రెపిల్లలను బలిగా అర్పించడం,
కుక్కల మెడలను విరుగగొట్టడం, నైవేద్యాలు పెట్టడం,
పంది రక్తం అర్పించడం, ధూపం వేయడం, విగ్రహాలను పూజించడం –
ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి –
తమ సొంత మార్గాలను✽ వారు ఎన్నుకొన్నారు.
తమ అసహ్యమైన పనులంటే తమకు చాలా ఇష్టం.
4 ✝అందుచేత వారిమీదికి రావలసిన కడగండ్లను నేను ఎన్నుకొంటాను.
వారు భయపడేవాటిని కూడా వారిమీదికి రప్పిస్తాను.
ఎందుకంటే, నేను పిలిచినప్పుడు ఎవరూ వినలేదు.
వారు నా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు.
నాకు ఇష్టం కాని వాటిని కోరుకొన్నారు.”
5 ✽యెహోవా వాక్కుకు భయపడేవారలారా,
ఆయన చెప్పేది వినండి:
“మీ స్వప్రజలలో కొంతమంది మిమ్మల్ని ద్వేషిస్తున్నారు.
నా పేరు కోసం మిమ్మల్ని ద్వేషిస్తున్నారు.
నా పేరు కోసం మిమ్మల్ని త్రోసివేస్తున్నారు.
వాళ్ళన్నారు గదా – ‘మీ సంతోషం✽ మాకు కనిపించేలా
యెహోవాకు ఘనత చేకూరుతుంది గాక!’
వాళ్ళు సిగ్గుపాలవుతారు.
6 నగరంలో పుట్టిన అల్లరి ధ్వని వినండి!
దేవాలయం✽నుంచి చప్పుడు వినబడుతూ ఉంది!
అది యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేస్తూ ఉన్న శబ్దం.
7 ✽ప్రసవ వేదనలు రాకముందే అది సంతానాన్ని కన్నది.
నొప్పులు రాకముందే పిల్లవాణ్ణి కన్నది.
8 అలాంటి సంగతి ఎవరైనా ఎప్పుడైనా విన్నారా?
అలాంటి సంగతులు ఎవరైనా చూశారా?
దేశాన్ని కనాలంటే ఒకే రోజు సరిపోతుందా?
ఒకే క్షణంలో ఒక జనం జన్మిస్తుందా? అయినా,
సీయోనుకు కాన్పునొప్పులు ఆరంభం కాగానే పిల్లలను కన్నది.
9 ‘నేను ప్రసూతిని ఆరంభించి కనకుండా చేస్తానా?’
అని యెహోవా అడుగుతున్నాడు.
‘ప్రసవించడం ఆరంభం అయ్యేలా చేసి గర్భాన్ని మూసివేస్తానా?’
అని నీ దేవుడు అడుగుతున్నాడు.
10 ✝“జెరుసలం అంటే ప్రేమ ఉన్న వారలారా,
మీరంతా దానితో కూడా సంతోషించండి, ఆనందించండి.
దాని విషయం దుఃఖించేవారలారా,
మీరంతా దానితోపాటు అధికంగా ఉత్సాహపడండి.
11 ✽ ఆదరణకరమైన దాని చనుపాలు కుడిచి తృప్తిపడుతారు.
దాని పాలు త్రాగుతూ, దాని సమృద్ధిని అనుభవిస్తూ ఆనందిస్తారు.”
12 ✝యెహోవా అంటున్నాడు, “వినండి.
శాంతి నదిలాగా జెరుసలంకు ప్రవహించేలా చేస్తాను.
జనాల ఐశ్వర్యం ఒడ్డుమీద పొర్లిపారే ప్రవాహంలాగా
దానికి వచ్చేలా చేస్తాను. మిమ్మల్ని చంకను ఎత్తుకోవడం,
మోకాళ్ళమీద ఆడించడం జరుగుతుంది.
13 ✽తల్లి తన బిడ్డను ఓదార్చే విధంగా
నేను మిమ్మల్ని ఓదారుస్తాను. జెరుసలంలోనే ఓదార్పు ప్రాప్తిస్తుంది.”
14 అది చూచినప్పుడు మీ హృదయాలు ఆనంద మయమవుతాయి.
మీ ఎముకలు లేత గడ్డి✽లాగా బలుస్తాయి.
యెహోవా చెయ్యి✽ ఆయన సేవకులకు వెల్లడి అవుతుంది గాని,
తన శత్రువులమీద కోపం చూపుతాడు.
15 ✝వినండి! ఉగ్ర కోపంతో ప్రతీకారం చేయడానికి,
మంటలతో గద్దించడానికి యెహోవా మంటల్లో రాబోతున్నాడు.
ఆయన రథాలు తుఫానులాగా రాబోతున్నాయి.
16 మంటలతో, తన ఖడ్గంతో శరీరం ఉన్న వారందరికీ తీర్పు తీరుస్తాడు.
యెహోవాచేత అనేకులు హతం అవుతారు.
17 ✽యెహోవా అంటున్నాడు, “తమ మధ్య ఉన్న ఒక వ్యక్తిని అనుసరించి, తోటలలోకి వెళ్ళడానికి తమను ప్రతిష్ఠించుకొని, శుద్ధం చేసుకొని, పంది మాంసాన్ని, ఎలుకలను, ఇతర అసహ్యమైనవాటిని తినేవాళ్ళంతా ఒకే సమయాన నాశనం అవుతారు. 18 వాళ్ళ క్రియలూ తలంపులూ✽, నాకు తెలిసే ఉన్నాయి. జనాలన్నిటినీ✽ అన్ని భాషలు మాట్లాడేవాళ్ళనూ సమకూర్చే సమయం రాబోతుంది. వాళ్ళు వచ్చి నా శోభను చూస్తారు.
19 ✽“నేను వారి మధ్య ఒక గుర్తును ఉంచుతాను. వారిలో తప్పించుకొన్నవారిలో కొంతమందిని ఇతర జనాల దగ్గరికి పంపిస్తాను. తర్‌షీషువారి దగ్గరికీ, పూల్‌వారి దగ్గరికీ, విలుకాండ్రైన లూదివారి దగ్గరికీ, తుబాల్‌వారి దగ్గరికీ యావానువారి దగ్గరికీ, నా ప్రఖ్యాతిని గురించి వినకుండా నా శోభను చూడకుండా ఉన్న దూర ద్వీపవాసుల దగ్గరికీ వారిని పంపిస్తాను. వారు జనాలలో నా ఘనతను ప్రకటిస్తారు. 20 ✝వారు జనాలన్నిటిలోనుంచి యెహోవాకు నైవేద్యంలాగా, మీ స్వప్రజలందరినీ తీసుకువస్తారు. వారిని గుర్రాలమీద, రథాలమీద, బండ్లమీద, కంచరగాడిదలమీద, ఒంటెలమీద ఎక్కించి, జెరుసలంలో ఉన్న నా పవిత్ర పర్వతానికి తీసుకువస్తారు. ఇస్రాయేల్‌ప్రజలు శుద్ధమైన పాత్రలలో నైవేద్యాలను యెహోవా ఆలయానికి తెచ్చేవిధంగా వారిని తీసుకువస్తారు. 21 ✽ నేను వారిలో కొంతమందిని యాజులుగా, లేవీగోత్రికులుగా ఎన్నుకొని నియమిస్తాను. ఇది యెహోవా వాక్కు.
22 ✝“నేను సృజించబోయే క్రొత్త ఆకాశాలు,
క్రొత్త భూమి నా సన్నిధానంలో ఎప్పటికీ నిలిచి✽ ఉంటాయి”
అని యెహోవా అంటున్నాడు.
“అలాగే మీ సంతానం, మీ పేరు నిలిచి ఉంటాయి.
23 ప్రతి అమావాస్య దినం, ప్రతి విశ్రాంతిదినం నా ఎదుట
సాష్టాంగ నమస్కారాలు చేయడానికి శరీరం ఉన్న వారందరూ✽ వస్తారు”
అని యెహోవా చెపుతున్నాడు.
24 ✽“వారు బయటికి వెళ్ళి, నామీద తిరుగుబాటు చేసినవాళ్ళ శవాలను చూస్తూ ఉంటారు. వాళ్ళ పురుగు చావదు, వాళ్ళ అగ్ని ఆరదు. వాళ్ళు శరీరం ఉన్న వారందరికీ అసహ్యకారణంగా ఉంటారు.”