35
1 ✽ఎడారి✽, మెట్ట ప్రదేశం సంతోషిస్తాయి.ఎండిన భూమి ఉత్సాహం కలిగి
కస్తూరి పూలు పూస్తుంది✽.
2 అది అమితంగా పూస్తుంది. ఉత్సాహం కలిగి
ఆనంద ధ్వనులు చేస్తుంది.
లెబానోను శోభ దానికి కలుగుతుంది.
కర్మెల్, షారోను ప్రాంతాల అందం దానికి ఉంటుంది.
యెహోవా ఘనత, మన దేవుని తేజస్సు✽
వాటికి కనబడుతాయి.
3 ✽సడలిన చేతులను బలపరచండి,
వణకుతూ ఉన్న మోకాళ్ళను దృఢపరచండి.
4 పిరికివారితో ఇలా అనండి:
“భయపడకండి. ధైర్యంగా ఉండండి.
ప్రతీకారం చేయడానికి మీ దేవుడు వస్తాడు✽.
దైవిక ప్రతీకారం✽ చేయడానికి వచ్చి
మిమ్మల్ని రక్షిస్తాడు.”
5 అప్పుడు గుడ్డివారి కళ్ళను తెరవడం,
చెవిటివారి చెవులను✽ విప్పడం జరుగుతుంది.
6 కుంటివాడు జింకలాగా గంతులు వేస్తాడు.
మూగవాడి నాలుక✽ ఆనంద గీతాలు పాడుతుంది.
ఎడారిలో నీళ్ళు పెల్లుబుకుతాయి.
ఎండిన ప్రాంతంలో ప్రవాహాలు✽ పారుతాయి.
7 కమిలిపోయిన భూమి మడుగు అవుతుంది.
ఎండిన స్థలాలు నీటి బుగ్గలవుతాయి.
ఒకప్పుడు నక్కలు పడుకొన్న చోట్లలో,
వాటికి ఉనికిపట్టుగా ఉన్న చోట్లలో గడ్డి,
తుంగ, జమ్మిరెల్లు పెరుగుతాయి.
8 అక్కడ✽ ఒక దారి – రాజమార్గం✽ – ఉంటుంది.
దానిని “పవిత్ర మార్గం✽” అంటారు. అది అశుద్ధులు
ప్రయాణం చేయకూడని మార్గం.
అది ఆ మార్గంలో నడిచేవారికోసమే.
తెలివితక్కువవారు కూడా అందులో త్రోవ తప్పరు.
9 అక్కడ సింహం ఉండదు. దుష్టమృగాలు✽
దానిని ఎక్కవు. అక్కడ కనిపించవు.
విముక్తి పొందినవారే అక్కడ నడుస్తారు.
10 యెహోవా వెల ఇచ్చి విడుదల చేసినవారు
పాటలు పాడుతూ తిరిగి సీయోనుకు వస్తారు.
వారి తలలమీద శాశ్వతానందం ఉంటుంది.
సంతోషానందాలు వారికి తోడుగా ఉంటాయి.
దుఃఖం, నిట్టూర్పు ఎగిరిపోతాయి✽.