34
1 ✝జనాల్లారా! దగ్గరికి వచ్చి వినండి. లోక జాతుల్లారా!ఆలకించండి. భూమి, దానిమీద ఉన్నదంతా,
లోకం, దానిలో పుట్టేదంతా వినాలి.
2 యెహోవా అన్ని జనాల✽మీద కోపపడుతూ ఉన్నాడు.
ఆయన వాటి సైన్యాలన్నిటిమీదా ఆగ్రహం✽ ఉంది.
ఆయన వాటిని నాశనానికి గురి చేసి
సంహారానికి అప్పగిస్తాడు.
3 ✝ వాటిలో హతమైనవాళ్ళను బయట పారవేయడం
జరుగుతుంది. ఆ శవాలు కంపుగొడతాయి.
వాళ్ళ రక్తంతో కొండలు కరిగిపోతాయి.
4 ✝ఆకాశాలలో ఉన్న సమూహమంతా కరిగిపోతుంది.
చుట్టి ఉన్న పత్రంలాగా ఆకాశాలు✽ చుట్టుకొనిపోతాయి.
ద్రాక్షచెట్టునుంచి ఆకు వాడి, రాలే విధంగా,
అంజూరుచెట్టునుంచి వాడిపోయిన ఆకు రాలే విధంగా
ఆకాశాల సమూహమంతా రాలిపోతుంది.
5 నిజంగా ఆకాశాలలో నా ఖడ్గం మత్తుగా త్రాగింది.
ఇప్పుడు అది నేను నాశనానికి గురి చేసే జనమైన ఎదోం✽
వాళ్ళ మీదికి దిగి వస్తూ ఉంది.
అది వాళ్ళకు తీర్పు తీరుస్తుంది.
6 యెహోవా ఖడ్గం✽ రక్తమయమవుతుంది.
అది క్రొవ్వుతో కప్పి ఉంది. ఆ రక్తం గొర్రెపిల్లలది, మేకలది.
ఆ క్రొవ్వు పొట్టేళ్ళ మూత్రపిండాల క్రొవ్వు.
ఎందుకంటే, బొస్రా✽ పట్టణంలో యెహోవా
బలి జరిగిస్తాడు, ఎదోంలో మహా సంహారం చేస్తాడు.
7 వాటితో కూడా అడవిదున్నపోతులు, ఎద్దులు,
కోడెలు కూలుతాయి. ఎదోంవాళ్ళ భూమి రక్తంతో
నానుతుంది, మట్టి క్రొవ్వుతో కలసిపోతుంది.
8 ఎందుకంటే, యెహోవా ప్రతిక్రియ దినాన్ని
నియమించాడు. సీయోను పక్షాన ప్రతీకారం✽
సంవత్సరాన్ని నియమించాడు.
9 ✽ఎదోం కాలువలు తారు అవుతాయి.
దాని మట్టి గంధకంగా మారుతుంది. దాని భూమి
కాలిపోతూ ఉన్న తారు అవుతుంది.
10 అది రాత్రి గానీ, పగలు గానీ ఆరదు.
దాని పొగ ఎప్పటికీ లేస్తూ ఉంటుంది.
ఆ భూమి తరతరాలకూ పాడుగా ఉంటుంది.
ఎన్నడూ ఎవడూ మళ్ళీ దానిలో పడి దాటడు.
11 గూడకొంగలు, ముళ్ళపందులు దానిని
ఆక్రమించుకొంటాయి. అది గుడ్లగూబకూ కాకికీ
ఉనికిపట్టు అవుతుంది.
యెహోవా నిరాకారం అనే కొలనూలు,
శూన్యం అనే గుండును దానిమీద చాపుతాడు.
12 రాజ్యానికి పిలవడానికి దాని ఘనులు ఉండరు.
దాని నాయకులంతా గతించిపోతారు.
13 దాని భవనాలలో ముళ్ళచెట్లు పెరుగుతాయి.
దాని కోటలలో దురదగొండ్లు,
గచ్చపొదలు అంకురిస్తాయి.
ఆ దేశం నక్కలకు నివాసస్థలంగా,
నిప్పుకోళ్ళకు ఉనికిపట్టుగా ఉంటుంది.
14 ఎడారి ప్రాణులూ సివంగులూ
అక్కడ కలసిమెలసి ఉంటాయి, అడవిమేకలు
అరుస్తూ పిలుచుకొంటాయి.
అక్కడ రాత్రిప్రాణులు దిగి విశ్రమ స్థలం
చూచుకొంటాయి.
15 గుడ్లగూబ అక్కడ గూడు కట్టి గుడ్లు పెట్టి పొదిగి
తన పిల్లలను తన రెక్కల నీడలో సమకూరుస్తుంది.
అక్కడ తెల్లగద్దలు తమ జాతి పక్షులను కలుసుకొంటాయి.
16 యెహోవా గ్రంథం✽లో వెదకి చదువుకోండి.
ఆ జంతువులలో✽ ఏదీ లేకపోదు.
దేని జతది దాని దగ్గర తప్పక ఉంటుంది.
ఆయన నోటనుంచి ఆజ్ఞ వెలువడింది.
ఆయన ఆత్మచేత అవి సమకూడుతాయి.
17 ✽ఆయన వాటికి వంతులను నిర్ణయించాడు.
ఆయన కొలనూలు చేతపట్టుకొని ఆ దేశాన్ని
విభాగించి ఇస్తాడు. అది ఎప్పటికీ
వాటి స్వాధీనంలో ఉంటుంది.
అవి తరతరాలకూ దానిలో ఉండిపోతాయి.