33
1 దౌర్జన్యానికి గురి కాని దౌర్జన్యపరుడా✽!నీకు బాధ తప్పదు. ద్రోహానికి గురి కాని ద్రోహీ!
నీకు బాధ తప్పదు. నీవు దౌర్జన్యం చేయడం ముగించాక
దౌర్జన్యానికి గురి అవుతావు.
నీవు ద్రోహం చేయడం ముగించాక ద్రోహానికి గురి అవుతావు✽.
2 ✽యెహోవా, నీ కోసం ఎదురు చూస్తున్నాం. మామీద
దయ చూపు. ప్రతి ఉదయమూ మాకు బలంగా ఉండు,
బాధ కాలం✽లో మాకు రక్షణ✽గా ఉండు.
3 ✝మహా ఘోష విని జనాలు పారిపోతాయి.
నీవు నిలబడగానే జాతులు చెదరిపోతాయి.
4 జనాల్లారా✽! చీడపురుగులు కొట్టివేసినట్టు
మీ దోపిడీ దోచుకోబడుతుంది.
మిడతల గుంపు ఎగిరిపడే విధంగా శత్రువులు
దానిమీద పడుతారు.
5 యెహోవా పైన నివసిస్తున్నాడు.
ఆయన మహా ఘనత పొందినవాడు.
ఆయన సీయోనును న్యాయంతో
నీతినిజాయితీ✽తో నింపేవాడు.
6 ఆయన✽ మీ కాలానికి సుస్థిరమైన ఆధారంగా ఉంటాడు.
ఆయనే రక్షణ బుద్ధి జ్ఞాన సమృద్ధి అయి ఉంటాడు.
యెహోవాను గురించిన భయభక్తులు ఆయన ఇచ్చే ఐశ్వర్యమే.
7 ✽చూడండి! వాళ్ళ శూరులు వీధులలో
సహాయంకోసం కేకలు వేస్తున్నారు.
వాళ్ళ శాంతి రాయబారులు భోరున ఏడుస్తున్నారు.
8 రహదారులు విడిచిపెట్టబడ్డాయి.
త్రోవలలో బాటసారులు లేరు. సంధి భంగమైంది.
పట్టణాలు తృణీకారానికి గురి అయ్యాయి.
ఇతరులకంటే గౌరవం లేదు.
9 దేశం దుఃఖిస్తూ, క్షీణిస్తూ ఉంది.
లెబానోను సిగ్గుపాలై వాడిపోతూ ఉంది.
షారోను ఎడారి అయింది.
బాషాను, కర్మెల్ పర్వతం చెట్ల ఆకులు రాలిపోతున్నాయి.
10 ✽యెహోవా అంటున్నాడు, “ఇప్పుడు నేను నిలబడుతాను.
ఇప్పుడు నా గొప్పతనాన్ని ప్రదర్శిస్తాను.
ఇప్పుడు నాకు ఘనత తెచ్చుకొంటాను.
11 మీరు పొట్టును గర్భం ధరించి వరిగడ్డిని కంటారు.
మీ ఊపిరి మంటలై మిమ్మల్ని దహించివేస్తుంది.
12 సున్నం బట్టీలలాగా, నరికి ఉండి మంటల్లో కాలుతూ ఉన్న
ముళ్ళలాగా జనులను కాల్చడం✽ జరుగుతుంది.
13 ✝దూరంగా ఉన్నవారలారా! నేను చేసినదాని విషయం
వినండి. దగ్గరగా ఉన్న వారలారా!
నా బలప్రభావాలను తెలుసుకోండి.”
14 సీయోనులో ఉన్న పాపులు✽ హడలిపోతున్నారు.
భక్తిలేని వాళ్ళు వణకుతున్నారు.
“మనలో ఎవడు దహించే మంటతో ఉండిపోగలడు?
మనలో ఎవడు శాశ్వతంగా కాలుతూ✽ ఉండేదానితో
నిలిచి ఉండగలడు?”
15 ✽నీతినిజాయితీని అనుసరించి నడుస్తూ,
యథార్థంగా మాట్లాడుతూ, బలవంతాన వచ్చే లాభాన్ని
తిరస్కరిస్తూ లంచం తన చేతికి చిక్కకుండా చేస్తూ,
హత్య అనే మాట వినకుండా చెవులు మూసుకొని,
చెడుగును చూడకుండా కళ్ళు మూసుకొని ఉండేవాడు
పైన నివాసం చేస్తాడు.
16 అతనికి పర్వత శిఖర శిలలు ఆశ్రయంగా ఉంటాయి.
అతనికి ఆహారం దొరుకుతుంది,
నీళ్ళ సరఫరా ఎప్పుడూ ఆగదు.
17 ✽రాజు తన అందంలో నీ కంటికి కనబడుతాడు.
చాలా దూరానికి✽ వ్యాపిస్తూ ఉన్న దేశం నీకు కనిపిస్తుంది.
18 ✽మునుపు నీవు భయపడిననాటి విషయం తలపోస్తావు,
“జనాభా లెక్కలు వ్రాసేవాడెక్కడ? తూచేవాడెక్కడ?
బురుజులను లెక్కించిన వాడెక్కడ?”
19 కఠినమైన ఆ జనాన్ని నీవు ఇకనుంచి చూడవు.
గ్రహించలేని కష్టమైన భాష✽, నీకు అర్థం కాని
విదేశీ భాష మాట్లాడిన ఆ జనాన్ని మళ్ళీ చూడవు.
20 మన మహోత్సవాలు జరిగే సీయోను నగరాన్ని చూడు.
ప్రశాంతమైన నివాసంగా, ఎన్నడూ తొలగిపోని✽
గుడారంగా జెరుసలం నీ కంటికి కనబడుతుంది.
దాని మేకులను ఊడదీయడం, దాని త్రాళ్ళతో
ఒక్కటి కూడా తెంచడం ఎన్నడూ జరగదు.
21 అక్కడ యెహోవా మనకు మహా నాయకుడు✽గా ఉంటాడు.
అది విశాలమైన నదులు, కాలువలు✽ ఉన్న
స్థలమై ఉంటుంది. వాటిలో తెడ్ల ఓడ ఏదీ నడవదు.
గొప్ప ఓడ అక్కడికి రాదు.
22 ✽యెహోవా మనకు న్యాయమూర్తి✽. యెహోవా మనకు
శాసనకర్త✽. యెహోవా మనకు రాజు✽.
ఆయన మనలను రక్షిస్తాడు✽.
23 నీ ఓడ✽ త్రాళ్ళు సడలిపొయ్యాయి.
ఓడ స్తంభం అడుగు గట్టిగా పట్టుబడడం లేదు.
చాపను విప్పడం జరగలేదు.
అప్పుడు సమృద్ధి అయిన దోపిడీ సొమ్ము✽
విభాగించడం జరుగుతుంది.
కుంటివారు కూడా దోపిడీ సొమ్ము పంచుకొంటారు.
24 “నాకు జబ్బు✽ చేసింది” అని సీయోనులో
నివాసం చేసే వారెవరూ అనరు.
దానిలో నివసించే ప్రజల అపరాధం పరిహారం అవుతుంది✽.