32
1 ఇదిగో, వినండి! ఒక రాజు ధర్మసమ్మతంగా
రాజ్యపరిపాలన చేస్తాడు. అధికారులు న్యాయంతో అధికారం చేస్తారు.
2 ఒక మనిషి గాలికి చాటుగా, గాలివానకు ఆశ్రయంగా ఉంటాడు.
మెట్ట ప్రాంతంలో నీటి కాలువలాగా ఉంటాడు.
ఆరిపోయిన ప్రదేశంలో గొప్ప బండ నీడలాగా ఉంటాడు.
3  అప్పుడు చూచేవారి కండ్లు మందంగా ఉండవు.
వినేవారి చెవులు ఆలకిస్తాయి.
4 తొందరపడేవారి మనసుకు జ్ఞానం అర్థం అవుతుంది.
నత్తివారి నాలుక తేటగా మాట్లాడుతుంది.
5 మూర్ఖుణ్ణి ఘనుడని పిలవడం జరగదు.
వంచకుణ్ణి ఉదారుడు అనరు.
6 మూర్ఖుడు మూర్ఖంగా మాట్లాడుతాడు.
చెడుగును గురించి ఆలోచిస్తాడు. భక్తిహీనంగా ప్రవర్తిస్తాడు.
యెహోవా విషయం తప్పుగా మాట్లాడుతాడు.
ఆకలిగొన్నవారి ఆకలి తీర్చడు,
దప్పిగొన్నవారికి నీళ్ళు ఇయ్యడు.
7 వంచకుడి విధానాలు చెడ్డవి.
దరిద్రుల ఫిర్యాదు న్యాయంగా ఉన్నా,
అబద్ధాలతో ఆ దీనులను నాశనం చేయడానికి
వాళ్ళు దురాలోచన చేస్తారు.
8 ఘనబుద్ధి గలవారు ఘన కార్యాలు కల్పిస్తారు.
వారు ఘనకార్యాల కారణంగా నిలిచివుంటారు.
9 సుఖంగా వ్యర్థంగా బ్రతికే స్త్రీలారా!
లేచి నేను చెప్పేది వినండి.
నిశ్చింతగా ఉన్న కూతుళ్ళారా! నా మాటలు వినండి.
10 ఒక సంవత్సరం కొన్ని రోజుల తరువాత
ద్రాక్ష పంట కోతకు రాదు.
ఏరడానికి పండ్లు ఉండవు, గనుక నిశ్చింతగా ఉన్నవారలారా,
మీకు కలత కలుగుతుంది.
11 సుఖంగా వ్యర్థంగా బ్రతికే స్త్రీలారా, వణకండి!
నిశ్చింతగా ఉన్న కూతుళ్ళారా, కంగారుపడండి!
మీ బట్టలన్నీ తీసివేసి మీ నడుముకు గోనెపట్ట కట్టుకోండి.
12 రమ్యమైన పొలాల విషయం, ఫలవంతమైన
ద్రాక్షచెట్ల విషయం గుండెలు బాదుకోండి.
13 నా ప్రజల భూమిలో ముండ్లచెట్లు,
గచ్చపొదలు పెరుగుతాయి.
దాని విషయం, సంతోషమయమైన ఇళ్ళ విషయం,
ఉల్లాసంగా ఉన్న ఈ నగరం విషయం దుఃఖించండి.
14 నగరు వదలివేయబడుతుంది,
జనసమూహాలున్న నగరం విడువబడుతుంది.
కొండ, కావలి గోపురం ఎప్పటికీ పాడుగా ఉంటాయి.
అవి అడవిగాడిదలకు ఇష్టమైన చోట్లుగా,
మందలు మేసే స్థలాలుగా ఉంటాయి.
15 పైనుంచి ఆత్మను మనమీద కుమ్మరించడం జరిగేవరకూ,
ఎడారి ఫలవంతమైన భూమి అయ్యేవరకూ,
ఫలవంతమైన భూమి వనం అనిపించుకొనేవరకూ
అలా ఉంటుంది.
16 అప్పుడు నిజాయితీ ఎడారిలో నివసిస్తుంది.
న్యాయం ఫలవంతమైన భూమిలో నిలిచి ఉంటుంది.
17  న్యాయం శాంతిని కలిగిస్తుంది.
న్యాయం ఫలితం ఎప్పటికీ నిలిచి ఉండే ప్రసన్నత, నిబ్బరం.
18 అప్పుడు నా ప్రజలు శాంతిమయమైన నివాసాలలో,
సురక్షితమైన ఇళ్ళలో, కలత చెందని విశ్రాంతి
స్థలాలలో నివసిస్తారు.
19 వడగండ్లు అడవిని నేలమట్టం చేసినా,
పట్టణం పూర్తిగా కూలిపోయినా,
20 నీళ్ళున్న స్థలాలన్నిటి దగ్గర విత్తనాలు చల్లుతూ,
ఎద్దులనూ గాడిదలనూ తిరగనిస్తూ ఉండే మీరు
ఎంత ధన్యజీవులై ఉంటారు!