31
1 ✝ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుడి వైపు చూడకుండా,యెహోవాను వెదకకుండా, సహాయంకోసం ఈజిప్ట్‌కు వెళ్ళి,
గుర్రాలను ఆధారం చేసుకొని, ఈజిప్ట్ రథాలు సమృద్ధిగా ఉన్నాయనీ,
రౌతులు బలాఢ్యులనీ వాళ్ళమీద నమ్మకం పెట్టినవారికి బాధ తప్పదు.
2 ✽యెహోవా జ్ఞానవంతుడు, విపత్తు రప్పించగలవాడు,
మాట✽ తప్పనివాడు. దుర్మార్గుల మీదికి, చెడుగు చేసే వాళ్ళకు
తోడ్పడేవాళ్ళ మీదికి ఆయన లేస్తాడు.
3 ✝ఈజిప్ట్‌వాళ్ళు మనుషులే గాని, దేవుడు కారు.
వాళ్ళ గుర్రాలు మాంసమే గాని, ఆత్మ కావు.
యెహోవా తన చెయ్యి✽ చాచినప్పుడు,
సహాయం చేసేవారు తొట్రుపడుతారు,
సహాయం పొందేవారు కూలుతారు.
వాళ్ళంతా కలిసి నాశనం అవుతారు.
4 ✽యెహోవా నాతో చెప్పేదేమిటంటే,
“సింహం గర్జిస్తుంది, కొదమ సింహం
తనకు దొరికినదాని మీద గర్జిస్తుంది.
తప్పించడానికి గొర్రెల కాపరుల గుంపు
సమకూడి వచ్చినా వారి కేకలకు
అది ఏమీ భయపడదు,
వారు చేసే సందడికి కంగారుపడదు. అలాగే సేనలప్రభువు
యెహోవా యుద్ధం చేయడానికి సీయోను కొండమీదికి,
దాని ఎత్తయిన స్థలంమీదికి దిగివస్తాడు.
5 పక్షులు గూటిపైన ఎగురుతూ✽ ఉన్నట్టు సేనలప్రభువు
యెహోవా జెరుసలంను కాపాడుతాడు✽.
దానిని కాపాడుతూ రక్షిస్తాడు.
దానికి పైగా దాటిపోతూ✽, విడిపిస్తాడు.”
6 ఇస్రాయేల్‌ప్రజలారా! మీరు ఎవరిమీద తిరుగుబాటు✽ చేశారో ఆయనవైపు తిరగండి✽. 7 ✽మీ పాపిష్టి చేతులతో✽ మీరు చేసిన వెండి, బంగారు విగ్రహాలను ఆ రోజున✽ మీలో ప్రతి ఒక్కరూ పారవేస్తారు.
8 ✝“మనిషికి చెందని ఖడ్గం చేత అష్షూరు పతనం అవుతుంది.
మనిషిది కాని కత్తిపాలవుతుంది.
ఖడ్గం ఎదుట నుంచి వాళ్ళు పారిపోతారు.
వాళ్ళ యువకులు దాసులవుతారు.
9 భయంచేత వాళ్ళ ఆశ్రయం✽ నాశనం అవుతుంది.
వాళ్ళ అధిపతులు యుద్ధ ధ్వజాన్ని చూడగానే
భయంతో దుర్బలులవుతారు.” ఇది యెహోవా వాక్కు.
సీయోనులో ఆయన మంట ఉంది.
జెరుసలంలో ఆయన కొలిమి✽ ఉంది.