30
1 ఇది యెహోవా వాక్కు:
“లోబడని సంతతివారికి బాధ!
వారు పాపానికి పాపం కూర్చుకొంటూ,
నావి కాని ఆలోచనలను అనుసరిస్తూ,
నా ఆత్మవల్ల కాని సంధి చేసుకొంటున్నారు.
2 నన్ను అడగకుండా, ఫరో ఇచ్చే సంరక్షణకోసం,
ఈజిప్ట్ నీడను చేరడానికి ఈజిప్ట్‌కు వెళ్ళిపోతారు.
3 అయితే ఫరో సంరక్షణవల్ల మీరు సిగ్గు పాలవుతారు.
ఈజిప్ట్ నీడను చేరడంవల్ల మీకు తలవంపులు
కలుగుతాయి.
4 యాకోబుప్రజల అధిపతులు సోయను నగరం లో ఉన్నారు.
వారి రాయబారులు హానేసుకు చేరుకొన్నారు.
5 కాని, వారంతా తమకు ఏ పనికీ రాని
జనం కారణంగా సిగ్గుపాలవుతారు.
ఆ జనం మూలంగా ఏమీ సహాయం,
ఏమీ ప్రయోజనం కలగదు.
సిగ్గు, నింద మాత్రమే కలుగుతాయి.”
6 నెగెవ్ ప్రదేశం లో ఉన్న జంతువుల విషయంలో దేవోక్తి:
వారు గాడిదల వీపుల మీద తమ ఆస్తిని,
ఒంటెల వీపులమీద తమ ధనాన్ని ఎక్కించుకొంటారు.
సింహాలు, ఆడసింహాలు, విషసర్పాలు,
మిణ్ణాగులు ఉన్న చాలా కష్టతరమైన,
బాధకరమైన ప్రదేశం గుండా ప్రయాణం చేస్తారు.
తమకు సహాయం చేయలేని జనం దగ్గరికి,
ఈజిప్ట్‌కు తమ ఆస్తిని, ధనాన్ని తీసుకుపోతారు.
7 ఈజిప్ట్ ఇవ్వబోయే సహాయం పనికిమాలినది,
నిష్ ప్రయోజనమైనది, గనుక నేను దానిని
“ఏమీ చేయని బడాయికోరు” అంటాను.
8 ఇప్పుడు నీవు వెళ్ళి, వారి కళ్ళెదుటే దీనిని పలకమీద వ్రాయి.
రాబోయే రోజులలో ఇది నిరంతరమూ
ఎప్పటికీ సాక్ష్యార్థంగా ఉండేలా దీనిని గ్రంథంలో వ్రాయి.
9 వారు తిరగబడే ప్రజ, అబద్ధాలాడే సంతానం,
యెహోవా ఉపదేశాన్ని పెడ చెవిని పెట్టే పిల్లలు.
10 వారు “ఇంకా దర్శనాలు చూడవద్దు”
అని దీర్ఘదర్శులతో చెప్తారు.
ప్రవక్తలతో అంటారు, “యథార్థమైనవాటిని చూచి
మాతో చెప్పవద్దు. మృదువైన మాటలే చెప్పండి.
మాయా దర్శనాలు చూచి చెప్పండి.
11 ఈ మార్గాన్ని విడిచివెళ్ళండి.
ఈ త్రోవనుంచి తొలగండి.
ఇస్రాయేల్ ప్రజల పవిత్రుడి సంగతి మా ఎదుట ఎత్తకండి.”
12 అందుచేత ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుడు ఇలా అంటున్నాడు:
“మీరు ఈ సందేశాన్ని నిరాకరించి, అన్యాయ ప్రవర్తన మీద,
అక్రమ కార్యాలమీద నమ్మకం ఉంచి
వాటినే ఆధారం చేసుకొన్నారు,
13 గనుక ఈ పాపం మీకు పగులు బారి
ఉబికి ఉన్న ఎత్తయిన గోడలాగా ఉంటుంది.
తటాలున ఒక్క క్షణంలోనే అది పడిపోతుంది.
14 కుమ్మరి కుండలాగా అది పగిలిపోయి,
పూర్తిగా ముక్కలవుతుంది.
పొయ్యిలోనుంచి నిప్పుకణం తీయడానికి గానీ,
గుంటలలోనుంచి నీళ్ళు తీయడానికి గానీ
ఒక్క పెంకు కూడా మిగలదు.”
15 ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుడైన యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు:
“మీరు నావైపు తిరిగి నెమ్మదిగా ఉండడం మూలంగా
మీకు రక్షణ చేకూరుతుంది.
ఊరుకొని నన్ను నమ్మడం మూలంగా
మీకు బలం కలుగుతుంది.
అయితే మీరు ఒప్పుకోలేదు.
16 మీరు అన్నారు, ‘అలా కాదు.
మేము గుర్రాలెక్కి పారిపోతాం.’
గనుక మీరు తప్పక పారిపోతారు!
మీరు అన్నారు ‘వడిగల గుర్రాలెక్కి పారిపోతాం.’
గనుక వడిగలవాళ్ళు మిమ్మల్ని తరుముతారు!
17 మీరు కొండమీద ఉన్న ధ్వజ స్తంభంలాగా,
గుట్టమీద ఉన్న పతాకంలాగా అయ్యేవరకు
ఒకడి బెదిరింపుకు మీలో వెయ్యిమంది పారిపోతారు,
అయిదుగురి బెదిరింపుకు మీరంతా పారిపోతారు.”
18 అయినా మీమీద దయ చూపాలని
యెహోవా అవకాశం కోసం చూస్తున్నాడు.
మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు.
యెహోవా న్యాయం తీర్చే దేవుడు.
ఆయనకోసం ఎదురు చూచేవారందరూ ధన్యజీవులు.
19 సీయోను ప్రజలారా, జెరుసలం నివాసులారా, అప్పటినుంచి మీరు ఏ మాత్రమూ కన్నీళ్లు విడవరు. మీరు సహాయంకోసం మొర పెట్టడంతోనే ఆయన విని మీమీద దయ చూపితీరుతాడు. మీ ప్రార్థన వినగానే మీకు జవాబిస్తాడు. 20 ప్రభువు మీకు అన్నంగా కష్టాన్ని, నీళ్ళుగా బాధను ఇచ్చినా, మీ ఉపదేశకులు ఇకనుంచి మరుగై ఉండరు. మీ ఉపదేశకులను కండ్లారా చూస్తారు. 21 మీరు కుడివైపు తిరిగినా, ఎడమవైపు తిరిగినా “దారి ఇదే. దీనిలో నడవండి” అని మీ వెనుకనుంచి మీ చెవులకు ఒక స్వరం వినిపిస్తుంది. 22 చెక్కి వెండి తొడుగు చేసిన మీ విగ్రహాలను, పోతపోసి బంగారు తొడుగు చేసిన మీ ప్రతిమలను మీరు అశుద్ధం చేస్తారు. రోత గుడ్డలాగా వాటిని పారవేసి “పో పో” అంటారు.
23 మీరు భూమిలో విత్తిన గింజలకు ఆయన వాన కురిపిస్తాడు. పంటలు సమృద్ధిగా మేలిరకంగా ఉంటాయి. ఆ రోజుల్లో మీ పశువులు విశాలమైన పచ్చిక మైదానాలలో మేస్తాయి. 24 చేటలతో చెరగి, పరచి, ఉప్పుతో కలిసిన మేతను భూమి దున్నే ఎద్దులు గాడిదలూ తింటాయి.
25 గోపురాలు పడి మహా సంహారం జరిగే రోజున ఉన్నతమైన ప్రతి పర్వతంమీదా, ఎత్తయిన ప్రతి కొండమీదా నీళ్ళ ప్రవాహాలు పారుతాయి. 26 యెహోవా తన ప్రజల గాయం కట్టి, తాను వేసిన దెబ్బను బాగు చేసే రోజున చంద్రబింబం సూర్యగోళంలాగా ప్రకాశిస్తుంది. సూర్యప్రకాశం ఏడు రోజుల వెలుగు ఒకే రోజున ప్రకాశిస్తున్నట్లుంటుంది.
27 ఇదిగో, తీవ్రమైన కోపాగ్నితో, దట్టమైన పొగతో
యెహోవా పేరు దూరంనుంచి వస్తూ ఉంది.
ఆయన పెదవులు ఆగ్రహంతో నిండి ఉన్నాయి.
ఆయన నాలుక నాశనం చేసే మంటల్లాంటిది.
28 ఆయన ఊపిరి మెడవరకు వెల్లువ వచ్చి
ముంచివేసే ప్రవాహంలాంటిది.
నాశనం అనే జల్లెడతో జనాలను జల్లిస్తాడు.
త్రోవ తప్పించే కళ్ళెం జనాల దవడలలో ఉంచుతాడు.
29 రాత్రివేళ పండుగ ఆచరించే విధంగా మీరు పాటలు పాడుతారు. ఇస్రాయేల్‌ప్రజలకు ఆధారశిలగా ఉన్న యెహోవాయొక్క పర్వతానికి పిల్లనగ్రోవి నాదంతో యాత్ర చేసేవారు సంతోషించేలా మీరు హృదయంలో సంతోషిస్తారు.
30 యెహోవా గంబీరమైన తన స్వరం వినిపిస్తాడు. ప్రచండ కోపంతో, నాశనకరమైన మంటలతో, ఫెళఫెళమనే గాలివానతో, వడగండ్లతో తన చేయి వాలడం జనాలకు చూపిస్తాడు. 31 యెహోవా స్వరానికి అష్షూరు మహా భయం చెందుతుంది. ఆయన దానిని తన దండంతో మొత్తుతాడు. 32 యెహోవా తన శిక్షాదండంతో ఆ దేశంమీద వేసిన ప్రతి దెబ్బ కంజరీ, తంతివాద్యాల నాదంతో పడుతుంది. ఆయన తన చేయి దానిమీద ఆడిస్తూ యుద్ధం చేస్తాడు. 33 చాలా కాలంనుంచి తోఫెతు సిద్ధంగా ఉంది. అది రాజుకొరకు తయారైంది. లోతుగా పెద్దగా ఆయన దానిని చేశాడు. అందులో మంటలు, కట్టెలు సమృద్ధిగా ఉన్నాయి. అది మండుతూ ఉండేలా గంధక ప్రవాహంలాగా యెహోవా ఊపిరి వీస్తుంది.