29
1 “అరీయేల్‌కు బాధ! దావీదు కాపురం ఏర్పరచుకొన్న
అరీయేల్ నగరానికి బాధ!
సంవత్సరం వెంట సంవత్సరం గడవనియ్యండి.
మీ పండుగలను క్రమంగా జరగనియ్యండి.
2 అయితే నేను అరీయేల్‌కు కష్టదశ రప్పిస్తాను.
దానిలో దుఃఖం, విలాపం ఉంటాయి.
అది నాకు నిప్పుగూడులాగా ఉంటుంది.
3 నేను నీ చుట్టూరా ముట్టడి వేస్తాను.
నీకెదురుగా కోట కట్టి, ముట్టడి దిబ్బలు వేస్తాను.
4 అప్పుడు నీవు అణగారిపోయి నేలనుంచి
మాట్లాడుతావు. నీ మాటలు దుమ్మునుంచి
నిట్టూర్పులలాగా వస్తాయి.
నీ స్వరం శవం స్వరంలాగా నేలనుంచి వస్తుంది.
నీ పలుకులు దుమ్ములోనుంచి గుసగుసలుగా
వినబడుతాయి.”
5 హఠాత్తుగా ఒక్క క్షణంలో నీ శత్రువుల సమూహం
ధూళిగా మారుతుంది, ఆ క్రూరుల మూకలు
ఎగిరిపోయే పొట్టులాగా అవుతాయి.
6 ఉరుముతో, భూకంపంతో, మహా శబ్దంతో, సుడిగాలితో,
తుఫానుతో, నాశనం చేసే మంటలతో
సేనలప్రభువు యెహోవా నిన్ను సందర్శిస్తాడు.
7 అరీయేల్‌తో యుద్ధం చేసే సమస్త జనాల సమూహాలు,
పోరాడుతూ దానినీ దాని కోటనూ ముట్టడించే వాళ్ళంతా
రాత్రి వచ్చే కలలాగా ఉంటారు, స్వప్న దర్శనంలాగా ఉంటారు.
8 ఆకలిగొన్నవాడు కలలో భోజనం చేస్తాడు గాని,
మేల్కొన్నప్పుడు ఇంకా ఆకలితోనే ఉంటాడు.
దప్పిగొన్నవాడు కలలో నీళ్ళు త్రాగుతాడు గాని,
మేల్కొన్నప్పుడు ఇంకా దాహంతోనే నీరసిస్తూ ఉంటాడు.
సీయోను కొండపైబడి యుద్ధం చేసే
సమస్త జనాల సమూహాలకూ అలాగే ఉంటుంది.
9 జాగు చేయండి! నివ్వెరపడండి!
మిమ్మల్ని మీరే గ్రుడ్డివారుగా చేసుకోండి!
చూపు లేకుండా ఉండండి!
ద్రాక్షమద్యం త్రాగకుండా మత్తుగా ఉండండి!
మద్యపానం లేకుండా తూలుతూ ఉండండి!
10 యెహోవా మిమ్మల్ని గాఢ నిద్రామత్తులను చేశాడు,
మీ కండ్లను మూసివేశాడు, మీ తలలకు ముసుకు వేశాడు.
11 మీకు ఈ దర్శనమంతా ముద్రలచేత ముద్రించిన పుస్తకంలో ఉన్న మాటలలాగా ఉంది. ఆ పుస్తకం చదువు వచ్చినవాడికి ఇచ్చి “దయచేసి దీనిని చదవండి” అని అడిగితే, అతడు అంటాడు గదా “చదవలేను. అది ముద్రలు వేసి మూయబడి ఉంది.” 12 చదువులేని వాడికిచ్చి “దయచేసి దీనిని చదవండి” అని అడిగితే, అతడు “నాకు చదువు రాదు” అంటాడు గదా.
13 ప్రభువు అంటున్నాడు:
“ఈ ప్రజలు నోటి మాటలతో నాదగ్గరికి వస్తున్నారు.
తమ పెదవులతో నన్ను గౌరవిస్తున్నారు గాని,
వాళ్ళ హృదయం నాకు చాలా దూరంగా ఉంది.
వాళ్ళు నాపట్ల చూపే భయభక్తులకు
మానవ కల్పితమైన నియమాలే ఆధారం.
14 అందుచేత మరోసారి నేను ఈ ప్రజలపట్ల
అద్భుతం జరిగిస్తాను, చాలా ఆశ్చర్యకరమైన
అద్భుతం జరిగిస్తాను.
వారి జ్ఞానుల జ్ఞానం గతించిపోతుంది,
వారి తెలివి అంతర్ధానమైపోతుంది.”
15 తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా
లోలోపల వాటిని దాచిపెట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళకు
బాధ తప్పదు.
“మమ్మల్ని ఎవరు చూస్తారు? మా పని ఎవరికి తెలుసు?”
అనుకొని చీకటిలో తమ క్రియలు చేసేవాళ్ళకు
బాధ తప్పదు.
16 మీది ఎంత వక్రబుద్ధి! కుమ్మరి మట్టికంటే
మించినవాడు కాడనుకొంటారా?
చేయబడ్డ వస్తువు దానిని చేసినవాణ్ణి గురించి
“అతడు నన్ను చేయలేదు” అనవచ్చా?
పాత్ర దానిని రూపొందించిన వ్యక్తిని గురించి
“అతడికి ఏమీ తెలివి లేదు” అనవచ్చా?
17 ఇంకా కొద్దికాలంలోనే లెబానోను
ఫలవంతమైన తోట అవుతుంది గదా.
ఆ ఫలవంతమైన తోట అడవి అనిపించుకొంటుంది.
18 ఆ రోజున పుస్తకం చదివి వినిపిస్తే
చెవిటివారు ఆ మాటలు వింటారు.
గుడ్డివారు చీకటిలోనుంచి, గాఢాంధకారంలోనుంచి
చూడగలుగుతారు.
19 యెహోవా కారణంగా దీనులు
మరి ఎక్కువగా సంతోషిస్తారు.
అందరిలో బీదలు ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుడి
కారణంగా ఆనందిస్తారు.
20 దౌర్జన్యపరులు లేకుండా పోతారు.
పరిహాసకులు గతించిపోతారు.
చెడుగు చేయడానికి చూచేవాళ్ళంతా నాశనం అవుతారు.
21 ఒక్క మాటతో ఇతరులను అపరాధులుగా చేసేవాళ్ళు,
న్యాయస్థానంలో వాదించేవాళ్ళను చేజిక్కించుకొనే వాళ్ళు,
మాయ మాటలు చేత నిర్దోషులకు న్యాయం చేకూరకుండా
చేసేవాళ్ళు నాశనం అవుతారు.
22 అందుచేత అబ్రాహామును విడుదల చేసిన యెహోవా యాకోబువంశాన్ని గురించి ఇలా అంటున్నాడు:
“ఇకమీదట యాకోబు ప్రజలు సిగ్గుపడరు.
ఇప్పుడు వారి ముఖాలు పాలిపోవు.
23 వారి సంతానం, వారి మధ్య నేను చేతులతో చేసిన
క్రియను చూచినప్పుడు నా పేరు పవిత్రమని
భావించుకొంటారు.
యాకోబుయొక్క పవిత్రుడి పవిత్రతను ఒప్పుకొంటారు.
ఇస్రాయేల్ యొక్క దేవునిపట్ల భయభక్తులతో ప్రవర్తిస్తారు.
24 దారి తప్పినవారు వచ్చి జ్ఞానం నేర్చుకొంటారు.
సణిగినవారు ఉపదేశానికి లోబడుతారు.”