28
1 ✽ఎఫ్రాయిం✽లో త్రాగుబోతుల✽ అతిశయ కిరీటానికి✽ బాధ!దాని సౌందర్య శోభ పువ్వులాగా వాడిపోతూ ఉంది.
ద్రాక్షమద్యంవల్ల తూలుపడినవారి ఫలవంతమైన లోయ
తలమీద ఉన్న కిరీటానికి బాధ!
2 వినండి, బలపరాక్రమాలున్న వాడొకడు✽
ప్రభువుకు ఉన్నాడు. అతడు దానిని
తన చేతితో పడద్రోస్తాడు.
ప్రచండమైన వడగండ్లు, నాశనకరమైన తుఫాను,
ప్రచండమైన వరదలు కొట్టివేసే విధంగా
అతడు దానిని పడద్రోస్తాడు.
3 ఎఫ్రాయింలో త్రాగుబోతులకు గర్వకారణమైన
ఆ కిరీటాన్ని కాళ్ళక్రింద త్రొక్కడం జరుగుతుంది.
4 వాడిపోతున్న పువ్వు✽లాంటి దాని సౌందర్య శోభ,
కోతకాలం రాకముందు పండిన మొదటి
అంజూరపండులాగా ఉంటుంది.
దానిని చూచినవాడు దానిని చేతితో
తీసుకోగానే మ్రింగివేస్తాడు.
5 ఆ రోజున✽ మిగిలిన ప్రజలకు సేనలప్రభువు యెహోవా✽
తానే ఘనమైన కిరీటంలాగా,
అందమైన మకుటంలాగా ఉంటాడు.
6 న్యాయపీఠంమీద కూర్చుండేవారికి తీర్పు✽ తీర్చడానికి
ఆయన నేర్పించే ఆత్మ అవుతాడు.
ద్వారం దగ్గర యుద్ధం చేసేవాళ్ళను
తరిమి కొట్టేవారికి బలం✽ అవుతాడు.
7 ✽అయితే వీళ్ళు కూడా✽ ద్రాక్షమద్యం త్రాగి
తూలుతూ ఉన్నారు, సారాయి త్రాగి తడబడుతూ ఉన్నారు.
యాజులు, ప్రవక్తలు సారాయి త్రాగి
తూలుతూ ఉన్నారు.
ద్రాక్షమద్యం త్రాగి కలవరపడుతూ ఉన్నారు.
సారాయి త్రాగి తడబడుతూ ఉన్నారు.
దర్శనాలు కలిగేటప్పుడు కూడా వాళ్ళు తూలుతూ ఉంటారు.
తీర్పు తీరుస్తూ ఉంటే తొట్రుపడుతూ ఉంటారు.
8 వాళ్ళ బల్లలన్నిటిమీదా అంతటా వాంతి,
కల్మషం ఉన్నాయి. శుభ్రమైన చోటు అంటూ ఎక్కడా లేదు.
9 ✽“అతడు ఎవరికి జ్ఞానం నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు?
ఎవరికి తన సందేశం వివరిస్తున్నాడు?
తల్లి పాలు విడిచిన పిల్లలకా? చన్ను విడిచిన బిడ్డలకా?
10 ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ,
సూత్రం వెంట సూత్రం, సూత్రం వెంట సూత్రం,
అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం.”
11 ✽సరి, నత్తివాళ్ళ పెదవులచేత,
విదేశీ భాషలో దేవుడు ఈ ప్రజతో మాట్లాడుతాడు.
12 ఆయన వారితో “ఇది విశ్రాంతి స్థలం.
అలసిపోయినవారిని విశ్రమించనివ్వండి.
ఇది నెమ్మది స్థలం” అన్నాడు గాని,
వారు వినక నిరాకరించారు.
13 అందుచేత వారు వెళ్ళి, వెనక్కు పడిపోయి
గాయపడి వలలో చిక్కుపడి, పట్టబడేలా
యెహోవా వాక్కు వారికి ఇలా వస్తుంది:
“ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ,
సూత్రం వెంట సూత్రం, సూత్రం వెంట సూత్రం,
అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం.”
14 ✽గనుక జెరుసలంలో ఈ ప్రజను
పరిపాలించే పరిహాసకులారా!
యెహోవా వాక్కు వినండి.
15 ✽మీరు అన్నారు గదా “మేము చావుతో
ఒడంబడిక చేసుకొన్నాం.
మృత్యులోకంతో ఒప్పందం చేసుకొన్నాం.
విపత్తు ప్రవాహంలాగా వడిగా దాటేటప్పుడు
మామీదికి రాదు.
ఎందుకంటే, అబద్ధాన్ని మాకు ఆశ్రయంగా చేసుకొన్నాం.
మోసంక్రింద దాక్కొన్నాం.”
16 ✽అందుచేత యెహోవాప్రభువు అంటున్నాడు,
“సీయోనులో పునాదిగా రాయిని వేస్తాను.
అది పరీక్షకు నిలిచిన రాయి, ప్రియమైన మూలరాయి,
సుస్థిరమైన పునాదిరాయి. నమ్మినవాడు తొందరపడడు.
17 నేను న్యాయాన్ని✽ కొలనూలుగా,
ధర్మాన్ని ఒడంబంగా చేస్తాను.
అబద్ధం అనే మీ ఆశ్రయాన్ని వడగండ్లు✽ కొట్టివేస్తాయి.
మీరు దాగుకొన్న చోటును నీళ్ళు ముంచివేస్తాయి.
18 చావుతో మీరు చేసుకొన్న ఒడంబడికను
రద్దు చేయడం జరుగుతుంది.
మృత్యులోకంతో మీరు చేసుకొన్న ఒప్పందం నిలవదు.
విపత్తు ప్రవాహంలాగా✽ వడిగా దాటేటప్పుడు
మీరు దానిచేత చితికిపోతారు.
19 ✽అది ఎన్ని సార్లు వస్తే అన్ని సార్లు
మిమ్మల్ని కొట్టుకుపోతుంది. ప్రతి ఉదయమూ,
ప్రతి పగలూ, ప్రతి రాత్రీ అది వస్తుంది.
ఈ సంగతి గ్రహిస్తే మహా భయం✽ కలుగుతుంది.”
20 ✽కాళ్ళు చాచుకోవడానికి పడక పొడుగు చాలదు.
కప్పుకోవడానికి దుప్పటి వెడల్పు చాలదు.
21 యెహోవా తన కృత్యం, తన వింతైన కృత్యం,
తన క్రియ, తన అసాధారణ క్రియ జరిగించడానికి
పెరాజీం✽ కొండమీద లేచినట్లు లేస్తాడు.
గిబియోను✽ లోయలో కదిలినట్టు కదలుతాడు.
22 మీ బంధకాలు ఇంకా గట్టివి కాకుండా
మీ పరిహాసం✽ మానండి.
దేశమంతటికీ నిర్ణయమైన సర్వ నాశనాన్ని గురించి
సేనలప్రభువు యెహోవా నాకు తెలియజేశాడు✽.
23 ✽చెవి ఒగ్గి, నా మాటలు వినండి.
ఆలకించి, నేను చెప్పేది వినండి.
24 విత్తనాలు చల్లాలంటే దున్నేవాడు
ఎప్పటికీ పొలం దున్నుతూ ఉంటాడా?
ఎడతెరిపి లేకుండా దుక్కి పెళ్ళు
బ్రద్దలు కొడుతూ ఉంటాడా?
25 నేల చదును చేసిన తరువాత నల్ల జీలకర్ర గానీ,
తెల్ల జీలకర్ర గానీ చల్లడా? గోధుమలు వరుసగా విత్తడా?
యవలు దాని చోట, మిరపమొక్కలు పొలం అంచున వేయడా?
26 అతడు ఎలా చేయాలో అతడి దేవుడు
అతనికి తర్బీతు చేస్తున్నాడు, ఆ పని నేర్పుతున్నాడు.
27 నల్ల జీలకర్రను పదును గల యంత్రంతో నూర్చడు.
బండి చక్రం తెల్లజీలకర్ర మీద దొర్లించడు.
కర్రతో నల్ల జీలకర్రను, చువ్వతో జీలకర్రను
దుళ్ళగొడతాడు గదా.
28 రొట్టెకోసం గోధుమలు నలుస్తారు.
ఎవ్వరూ దానిని ఎడతెగకుండా నూరుస్తూ ఉండరు.
దానిమీద బండి చక్రాలు నడిపించినా గుర్రాలు
దానిని చూర్ణం చేయవు గదా.
29 ✝ఇది కూడా సేనలప్రభువు యెహోవా నేర్పిన సంగతి.
ఆయన సలహా ఇవ్వడంలో ఆశ్చర్యకరుడు,
ఆలోచన చెప్పడంలో గొప్పవాడు.