27
1 ✝ఆ రోజు✽న యెహోవా తన ఖడ్గం✽ పట్టుకొంటాడు. ఆ ఖడ్గం గట్టిది, గొప్పది, బలమైనది. “లివయాటాన్✽”ను – పలాయనమౌతున్న ఆ సర్పాన్ని ఆయన దండిస్తాడు. ఆ వంకర సర్పాన్ని – ఆ బ్రహ్మాండమైన సముద్రప్రాణిని చంపుతాడు.2 ✽ఆ రోజున ఫలవంతమైన ద్రాక్షతోట విషయం పాట పాడండి.
3 “నేను – యెహోవాను – దానిని కాపాడుతున్నాను.
ప్రతి క్షణమూ దానికి నీళ్ళు పోస్తూ ఉన్నాను.
ఎవ్వడూ దానికి హాని చేయకుండా రాత్రింబగళ్ళు
నేను దానిని కావలి కాస్తూ ఉన్నాను.
4 ఇప్పుడు నాకు కోపం లేదు. ఒకవేళ గచ్చపొదలు,
ముండ్లచెట్లు నాకు ఎదురుపడితే వాటిమీద
యుద్ధం జరిగించి వాటిని కాల్చివేసితీరుతాను.
5 లేదా, వాళ్ళు✽ నన్ను ఆశ్రయించాలి.
నాతో సమాధానపడాలి. అవును,
వాళ్ళు నాతో సమాధానపడాలి.”
6 ✽వచ్చే రోజుల్లో యాకోబు వంశం వేరుపారుతుంది.
ఇస్రాయేల్‌జనం మొగ్గలు వేసి వికసిస్తుంది✽.
7 ✽వారిని కొట్టినవాళ్ళను యెహోవా కొట్టిన విధంగా
ఆయన వారిని కొట్టాడా? వారిని చంపినవాళ్ళను
ఆయన చంపేవిధంగా వారిని చంపాడా?
8 నీవు ఆ జనాన్ని వెళ్ళగొట్టడంవల్ల మితంగా
దానితో పోరాడావు. తూర్పు గాలి వీచే విధంగా
తన తీవ్రమైన గాలిచేత దానిని తొలగించావు.
9 యాకోబు వంశంవారి అపరాధానికి
ఈ విధంగా ప్రాయశ్చిత్తం చేయడం జరుగుతుంది –
ఇది వారి పాపపరిహారంయొక్క ఫలం.
సీమసున్నం రాళ్ళను చూర్ణం చేసినట్టు వాళ్ళు
తమ బలిపీఠం రాళ్ళన్నిటినీ చూర్ణం చేస్తారు.
అప్పుడు ఆషేరాదేవి స్తంభాలు,
ధూపవేదికలు మిగిలి ఉండవు.
10 ఇప్పుడు ప్రాకారాలున్న నగరం నిర్జనంగా ఉంది.
విసర్జించిన నివాసస్థలంలాగా, విడిచిపెట్టిన
ఎడారి ప్రాంతంలాగా ఉంది.
అక్కడ దూడలు మేస్తూ, పడుకొంటూ,
దాని చెట్లకొమ్మలను తింటూ ఉన్నాయి.
11 దాని రెమ్మలు ఎండిపోయి విరిగిపొయ్యాయి.
స్త్రీలు వచ్చి వాటిని నిప్పులో వేస్తారు.
ఈ ప్రజలు తెలివైనవారు కారు✽.
వారి సృష్టికర్త వారిమీద జాలి చూపడు.
వారిని కలగజేసినవాడు వారిమీద దయ చూపడు.
12 ఆ రోజున✽ యెహోవా పారుతూ ఉన్న యూఫ్రటీసు నది నుంచి ఈజిప్ట్ వాగు వరకు నూరుస్తాడు✽. ఇస్రాయేల్ ప్రజలారా! మిమ్మల్ని ఒక్కొక్కరిని సమకూర్చడం జరుగుతుంది. 13 ఆ రోజున గొప్ప బూర✽ ఊదడం జరుగుతుంది. అష్షూరులో నశించిపోతున్నవారు, దేశభ్రష్టులై ఈజిప్ట్‌లో ఉన్నవారు వస్తారు, జెరుసలంలో పవిత్ర పర్వతంమీద యెహోవాను ఆరాధిస్తారు.