26
1 ఆ రోజు✽న యూదాదేశంలో ప్రజలు ఈ పాట పాడుతారు:బలమైన నగర✽మొకటి మనకు ఉంది.
దేవుడు రక్షణ✽ను దానికి గోడలుగా,
బురుజులుగా చేశాడు.
2 న్యాయాన్ని✽ అనుసరించే నమ్మకమైన ప్రజ
లోపలికి వచ్చేలా దాని ద్వారాల
తలుపులను తెరవండి✽.
3 ✽ఎవరి మనసు నీ మీద ఆనుకొంటుందో
వారు ఎడతెగని శాంతి సమాధానాలు అనుభవిస్తూ
ఉండేలా నీవు చేస్తావు.
ఎందుకంటే వారు నీమీద నమ్మకం
ఉంచుతూ ఉన్నారు.
4 యెహోవా తానే శాశ్వతమైన✽ ఆధారశిల✽!
గనుక యెహోవామీద ఎప్పటికీ నమ్మకం
ఉంచుతూ ఉండండి.
5 ✝ఉన్నత స్థానంలో ఉంటున్న వాళ్ళను
యెహోవా అణచివేసేవాడు,
ఎత్తయిన పట్టణాన్ని పడగొట్టేవాడు,
దానిని నేలమట్టం చేస్తాడు, దుమ్ముపాలు చేస్తాడు.
6 ✽కాళ్ళు – బీదలకాళ్ళు, దీనుల కాళ్ళు – దానిని
త్రొక్కివేస్తున్నాయి.
7 న్యాయవంతుల మార్గం తిన్నగా ఉంది.
నిజాయితీపరుడా, నీవు న్యాయవంతుల దారిని
సరాళం✽ చేస్తావు.
8 ✽యెహోవా, మేము నీ న్యాయ నిర్ణయాలను
అనుసరిస్తూ, నీకోసం చూస్తూ ఉన్నాం.
నీ పేరు, నీ స్మరణ అంటే మాకు ప్రాణం.
9 ✽రాత్రివేళ✽ నీవు కావాలని నా ప్రాణం
తహతహలాడుతూ ఉంది.
నాలో ఉన్న ఆత్మ నీ కోసం ఆసక్తితో వెదకుతూ ఉంది.
నీ తీర్పులు లోకానికి వచ్చేటప్పుడు
లోక ప్రజలు న్యాయం అంటే ఏమిటో
నేర్చుకొంటారు✽.
10 ✽దుర్మార్గులకు దయ చూపితే వాళ్ళు
న్యాయాన్ని నేర్చుకోరు.
నిజాయితీని అనుసరించే ప్రాంతంలో వాళ్ళు
కాపురముంటూ ఉన్నా అన్యాయంగా
వ్యవహరిస్తూనే ఉంటారు.
యెహోవా మహత్తును ఆలోచించకుండా ఉంటారు.
11 యెహోవా, నీ చెయ్యి✽ ఎత్తావు గాని,
వాళ్ళు దానిని చూడరు.
వాళ్ళు నీ ప్రజలకోసం నీ ఆసక్తిని✽ చూచి
సిగ్గుపాలయ్యేలా చెయ్యి.
నీ శత్రువులకోసం తయారైన అగ్ని
వాళ్ళను నాశనం చేస్తుంది✽.
12 ✽యెహోవా, నీవు మాకు శాంతి ప్రసాదిస్తావు.
నిజంగా మేము సాధించిన కృత్యాలన్నిటినీ
నీవే సాధించావు✽.
13 యెహోవా, మా దేవా, నీవు గాక వేరే ప్రభువులు✽
మమ్మల్ని పరిపాలించేవారు గాని,
నిన్నే, నీ పేరునే ప్రస్తుతిస్తాం.
14 ✽వాళ్ళు చనిపోయారు, ఇంకా బ్రతకరు.
పోయినవాళ్ళ ఆత్మలు పైకి రావు.
నీవు వాళ్ళను దండించి నాశనం చేశావు.
వాళ్ళను గురించిన జ్ఞాపకాన్ని కూడా
తుడిచివేశావు.
15 యెహోవా, ఈ ప్రజను వృద్ధి చేశావు,
ప్రజను వృద్ధి చేసి, దేశం సరిహద్దులను
విశాలం✽ చేసి,
నీకు నీవే గౌరవాన్ని చేకూర్చుకొన్నావు.
16 ✽యెహోవా, బాధలో వారు నిన్ను సమీపించారు.
నీవు వారిని శిక్షకు గురి చేశావు.
వారు మెల్లగానే ప్రార్థన చేయగలిగారు.
17 గర్భవతికి కానుపు వచ్చేటప్పుడు ఆమె
అల్లాడిపోతూ నొప్పులతో అరచేవిధంగా
మేము నీ ఎదుట ఉన్నాం.
18 మేము గర్భంతో ఉన్నట్టు వేదనలతో
అల్లాడిపొయ్యాం.
అయితే గాలిని మాత్రమే కన్నట్టు ఉన్నాం.
మాచేత లోకానికి రక్షణ కలగలేదు,
లోకంలో జనాలు పుట్టలేదు.
19 ✽చనిపోయిన నీవారు బ్రతుకుతారు.
వారి మృతదేహాలు సజీవంగా లేస్తాయి.
మట్టిలో పడి ఉన్న వారలారా!
మేల్కొని ఆనంద ధ్వనులు చేయండి.
మీ మంచు✽ ఉదయ కాంతిలో
కనబడే మంచు.
భూమి చనిపోయినవారిని కంటుంది.
20 ✽ నా ప్రజలారా! ఇడుగో, యెహోవా తన
నివాసంలోనుంచి రాబోతున్నాడు.
ఆయన లోక ప్రజలను వాళ్ళ అపరాధాల
కారణంగా శిక్షిస్తాడు.
భూమి తనమీద జరిగిన రక్తపాతాన్ని
బయలుపరచి,
హతమైన తనవాళ్ళను ఇంకా కప్పివేయదు.
21 నా ప్రజలారా, మీరు మీ గదులలోకి వెళ్ళి
తలుపులు మూసివేసుకోండి!
ఆగ్రహం తీరిపోయేవరకు కొంచెం సేపు
దాక్కోండి✽.