25
1 ✽యెహోవా, నీవే నా దేవుడివి.నేను నిన్ను కీర్తిస్తాను, నీ పేరును స్తుతిస్తాను.
నీవు అద్భుతాలు✽ చేశావు.
చాలా కాలంక్రింద✽చేసిన ఆలోచనలు
ఎంతో నమ్మకంగా నెరవేర్చావు.
2 నీవు నగరాన్ని✽ శిథిలాలుగా, ప్రాకారాలున్న పట్టణాన్ని
పాడుగా చేశావు. విదేశీయుల భద్రమైన స్థలాన్ని
పట్టణంగా ఉండకుండా చేశావు.
దానిని మళ్ళీ కట్టడం ఎన్నడూ జరగదు.
3 ✝గనుక బలమైన జనాలు నిన్ను గౌరవిస్తాయి.
నీవంటే క్రూర జనాల పట్టణాలకు భయం వేస్తుంది.
4 ✽క్రూరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానలాగా ఉంది,
అయితే నీవు బీదలకు ఆశ్రయంగా,
బాధలో ఉన్న పేదవారికి ఆశ్రయంగా ఉన్నావు.
గాలివాన తగలకుండా నిలవ నీడగా ఉన్నావు.
5 ✝ఎండిన దేశాన్ని వేడిమి అణచివేసే విధంగా
నీవు విదేశీయుల ఘోషను అణచివేస్తావు.
మబ్బు నీడ ఎండను అణచివేసే విధంగా
క్రూరుల పాటలను అణచివేస్తావు.
6 ✽ఈ కొండమీద✽ సేనలప్రభువు యెహోవా
అన్ని జనాలకోసం క్రొవ్వినవాటితో విందు✽ చేస్తాడు.
పాత ద్రాక్షరసంతో, మూలుగులున్న మేలిరకమైన
మాంసం ముక్కలతో, మేలిరకమైన ద్రాక్షరసంతో విందు చేస్తాడు.
7 జనాలన్నిటినీ కప్పుతూ ఉన్న ముసుకు✽నూ
అన్ని జాతులమీద పరచి ఉన్న తెరనూ
ఈ కొండమీద ఆయన నాశనం చేస్తాడు.
8 ఇంకెన్నడూ ఉండకుండా మృత్యువు✽ను
ఆయన దిగమ్రింగివేస్తాడు.
యెహోవాప్రభువు ప్రతి ఒక్కరి ముఖంమీదనుంచీ
కన్నీటి బిందువులను✽ తుడిచివేస్తాడు.
భూమిమీదనుంచి తన ప్రజల నింద✽ను తొలగిస్తాడు.
ఇలా జరుగుతుందని యెహోవా అన్నాడు.
9 ఆ రోజున వారు ఇలా అంటారు:
“ఇదిగో, ఈయన మన దేవుడు✽.
మనలను రక్షిస్తాడని ఆయన కోసం
నమ్మకంతో✽ ఎదురు చూశాం. ఈయన యెహోవా.
ఆయనకోసం నమ్మకంతో ఎదురు చూశాం.
ఆయన మనల్ని రక్షించినందుచేత సంతోషించి ఆనందిద్దాం✽.”
10 యెహోవా ఈ కొండమీద చెయ్యి ఉంచుతాడు.
అయితే పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడే విధంగా
మోయాబు✽ను ఆయన పాదాలు త్రొక్కుతాయి.
11 ఈతగాడు ఈదడానికి చేతులు చాపే విధంగా
వాళ్ళు దానిమధ్య చేతులు చాపుతారు.
అయితే వాళ్ళ చేతులు ఎంత యుక్తిగా పని చేసినా
యెహోవా వాళ్ళ గర్వాన్ని✽ అణచివేస్తాడు.
12 ✽కోటలున్న నీ ఎత్తయిన గోడలను ఆయన పడద్రోస్తాడు.
వాటిని నేలకు కూలగొట్టి దుమ్ముపాలు చేస్తాడు.