24
1 ఇది వినండి! యెహోవా భూమిని ఒలకబోయ బోతున్నాడు.
దానిని ఖాళీ చేయబోతున్నాడు. భూతలాన్ని పాడు చేస్తాడు.
భూనివాసులను చెదరగొట్టివేస్తాడు.
2 ప్రజలకు ఎలాగో యాజులకు అలాగే జరుగుతుంది.
దాసులకు ఎలాగో యజమానులకు అలాగే,
దాసీజనానికి ఎలాగో యజమానురాండ్రకు అలాగే,
కొనేవాళ్ళకు ఎలాగో అమ్మేవాళ్ళకు అలాగే,
అప్పు తీసుకొనేవాళ్ళకు ఎలాగో అప్పిచ్చేవాళ్ళకు అలాగే,
వడ్డీకిచ్చేవాళ్ళకు ఎలాగో వడ్డీకి తీసుకొనేవాళ్ళకు
అలాగే జరుగుతుంది.
3 భూమిని పూర్తిగా ఒలకబోయడం జరుగుతుంది.
అది పూర్తిగా చితికిపోతుంది.
ఈ మాట చెప్పినది యెహోవా.
4 భూమి క్రుంగిపోతూ ఉంది, నీరసించిపోతూ ఉంది,
లోకం కృశించిపోతూ ఉంది, నీరసించిపోతూ ఉంది.
లోకంలోని ఘనులు కృశించిపోతూ ఉన్నారు.
5 దాని నివాసులచేత లోకం అపవిత్రం అయింది.
ఎందుకంటే వాళ్ళు ధర్మ శాసనాలను అతిక్రమించారు,
చట్టాలను మీరారు, శాశ్వతమైన ఒడంబడికను భంగం చేశారు.
6 అందుచేత శాపం లోకాన్ని నాశనం చేస్తూ ఉంది.
దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యారు.
కనుక వాళ్ళు కాలిపోయారు, కొద్దిమందే మిగిలి ఉన్నారు.
7 క్రొత్త ద్రాక్షరసం ఆరిపోతూవుంది.
ద్రాక్ష చెట్లు వాడిపోతూ ఉన్నాయి.
సంతోష హృదయులంతా మూలుగుతూ ఉన్నారు.
8 కంజరి సంతోష నాదం నిలిచిపోయింది.
సంబరపడేవాళ్ళ చప్పుడు ఆగిపోయింది.
తంతి వాద్యాల సంతోష నాదం నిలిచిపోయింది.
9 పాటలు పాడుతూ ద్రాక్షరసం త్రాగడం జరగడం లేదు.
త్రాగేవాళ్ళకు అది చేదైంది.
10 శూన్యంగా ఉన్న నగరం శిథిలం అయింది.
ప్రతి ఇంటికీ ప్రవేశం మూసివేయబడింది.
11 ద్రాక్షమద్యం లేదని వీధులలో కేకలు వినబడుతూ ఉన్నాయి.
సంతోషమంతా అస్తమించింది.
లోకంలో ఉల్లాసమంటూ బొత్తిగా లేదు.
12 నగరంలో మిగిలినది శిథిలాలే.
దాని ద్వారం తలుపులు విరిగి పాడైపొయ్యాయి.
13  ఆలీవ్‌చెట్టు దులిపేటప్పుడు, ద్రాక్షపండ్ల కోత తీరాక
పరిగె ఏరుకొనేటప్పుడు ఎలా ఉంటుందో
అలాగే భూమిమీద జనాలలో ఉంటుంది.
14 మిగిలేవాళ్ళు బిగ్గరగా ఆనంద ధ్వనులు చేస్తారు.
యెహోవా ప్రభావం కారణంగా సముద్రం వైపు నుంచి
సంతోష ధ్వనులు వినబడుతాయి.
15 కనుక, తూర్పు దిక్కున ఉన్న వారలారా!
యెహోవాకు ఘనత చేకూర్చండి. సముద్ర ద్వీపవాసులారా!
ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా పేరును ఘనపరచండి.
16 “న్యాయవంతునికి స్తుతి కలుగుతుంది గాక!”
అని భూమి కొనల నుంచి పాటలు మనకు
వినబడుతూ ఉన్నాయి.
అయితే నేను “అయ్యో నాకు బాధ!
నేను నీరసించి పొయ్యాను, నీరసించిపొయ్యాను.
ద్రోహులు ద్రోహం చేస్తూ ఉన్నారు.
ద్రోహులు అధిక ద్రోహం చేస్తూ ఉన్నారు” అన్నాను.
17 లోక జనమా! భయం, గుంట,
ఉరి మీకోసం తయారై ఉన్నాయి!
18 భయం కలిగించే చప్పుడునుంచి పారిపోయేవాడు
గుంటలో పడుతాడు.
గుంటలోనుంచి పైకెక్కేవాడు ఉరిలో చిక్కుపడుతాడు.
ఆకాశం తూములు తెరుచుకొన్నాయి.
భూమి పునాదులు కదులుతూ ఉన్నాయి.
19 భూమి బ్రద్దలైపోతూ ఉంది.
భూమి చీలిపోయి ముక్కలయిపోతూ ఉంది.
భూమి గడగడ వణకుతూ ఉంది.
20 భూమి త్రాగుబోతులాగా విపరీతంగా తూలుతూ ఉంది.
పాకలాగా అటూ ఇటూ ఊగుతూ ఉంది.
దాని అపరాధం దానిమీద భారంగా ఉంది,
అది పడుతుంది, ఇంకెప్పుడూ లేవదు.
21 ఆ రోజున యెహోవా ఆకాశమండలంలో ఉన్న
ఆకాశ సేనలను దండిస్తాడు,
భూమిమీద ఉన్న రాజులను శిక్షిస్తాడు.
22 బందీలు చెరసాలలో చేర్చబడ్డట్టు వాళ్ళను పోగు చేయడం,
ఖైదులో వేయడం జరుగుతుంది.
చాలా రోజుల తరువాత వాళ్ళు శిక్షకు గురి అవుతారు.
23 అప్పుడు సేనలప్రభువు యెహోవా సీయోనుకొండ మీద,
జెరుసలంలో రాజవుతాడు.
దాని పెద్దల ఎదుట ఆయన శోభాప్రకాశం కనిపిస్తుంది.
కనుక చంద్రబింబం వెలవెలబోతుంది.
సూర్యమండలం సిగ్గిల్లుతుంది.