23
1 తూరు నగరం విషయం దేవోక్తి:
తర్షీషు ఓడలారా, పెడ బొబ్బలు పెట్టండి!
తూరు పాడైపోయింది. దానికి ఇల్లు లేదు, రేవు లేదు.
కిత్తీందేశంనుంచి ఆ మాట వాళ్ళకు వచ్చింది.
2 సముద్రం తీరవాసులారా! సీదోను పట్టణం వర్తకులారా!
నివ్వెరపడండి! సముద్రం దాటుతూ ఉండేవాళ్ళు
తమ సరుకుతో నిన్ను నింపారు.
3 షీహోరు నది ధాన్యం, నైలునది పంటలు
మహా సముద్రంమీద నీలోకి తెచ్చారు.
తూరు జనాలకు బజారుగా ఉంది.
4 సీదోను! సిగ్గుపడు! సముద్రం, సముద్ర దుర్గం
ఇలా మాట్లాడుతూ ఉంది:
“నాకు కాన్పునొప్పులు రాలేదు, పిల్లలూ కలగలేదు.
నేను కొడుకులను పోషించలేదు, కన్యలను పెంచలేదు.”
5 తూరును గురించిన మాట ఈజిప్ట్‌కు చేరేటప్పుడు
వాళ్ళు దాని విషయం మనోవేదన పడుతారు.
6 సముద్ర తీర వాసులారా! తర్షీషుకు దాటిపోండి!
పెడ బొబ్బలు పెట్టండి!
7 మీకు సంతోషం కలిగించే నగరం ఇదేనా?
చాలా కాలంనుంచి ఉన్న నగరమిదేనా?
ఇతర దేశాలలో కాపురం చేయడానికి
దూర ప్రయాణాలు చేసినదిదేనా?
8 తూరు కిరీటాలు ఇచ్చే నగరం. దాని వర్తకులు ప్రముఖులు.
దాని వ్యాపారస్తులు లోకంలో ఘనులు.
దానికి వ్యతిరేకంగా అలా నిర్ణయించినదెవరు?
9 సేనలప్రభువు యెహోవా అలా నిర్ణయించాడు.
అందం తాలూకు సమస్త గర్వాన్ని హీనదశకు రప్పించాలనీ
భూమిమీద ఉన్న ఘనులందరికీ తలవంపులు
తేవాలనీ ఆయన ఉద్దేశం.
10 తర్షీషు కుమారీ! నీ దేశానికి ఇంకా నిర్బంధం లేదు.
నైలు నదిలాగా దానిమీదికి ప్రవాహం వచ్చిపడుతుంది.
11 యెహోవా సముద్రంమీద చెయ్యి చాపాడు,
రాజ్యాలను వణికించాడు. కనాను కోటలను
నాశనం చేయాలని ఆయన ఆజ్ఞ జారీ చేశాడు.
12 ఆయన అన్నాడు, “దౌర్జన్యానికి గురి అయిన సీదోను కన్యా!
నీకు ఇంకా సంతోషం ఉండదు.
లేచి కిత్తీం ద్వీపానికి దాటిపో!
అయితే అక్కడ కూడా నీకు విశ్రాంతి కలగదు.”
13 ఇదిగో! కల్దీయవాళ్ళ దేశం చూడు. వాళ్ళు జనంగా లేకపోయారు. అష్షూరువాళ్ళు దానిని ఎడారి జంతువులకు ఉనికిపట్టుగా చేశారు. వాళ్ళు ముట్టడి గోపురాలు కట్టి, దాని భవనాలను పడగొట్టారు. ఆ దేశాన్ని పాడు చేశారు.
14 తర్షీషు ఓడలారా! పెడ బొబ్బలు పెట్టండి!
మీ కోట నాశనం అయింది.
15 ఆ కాలంలో తూరును డెబ్భై సంవత్సరాలు – ఒక రాజు జీవితకాలం – మరవడం జరుగుతుంది. డెబ్భై ఏళ్ళయ్యాక, వేశ్యను గురించిన పాటలో ఉన్నట్టు జరుగుతుంది. ఏమిటంటే,
16 “మరవబడ్డ వేశ్యా!
తంతివాద్యం తీసుకొని నగరంలో తిరుగులాడు.
నీవు జ్ఞప్తికి వచ్చేలా బాగా వాయించు,
పాటలెన్నైనా పాడు.”
17 ఆ డెబ్భై సంవత్సరాలయ్యాక, యెహోవా తూరు విషయం మళ్ళీ విచారిస్తాడు. అది తన జీతం మళ్ళీ సంపాదించుకోవాలని భూమిమీద ఉన్న లోక రాజ్యాలన్నిటితో వేశ్యలాగా వ్యవహరించసాగుతుంది. 18 అయితే దాని జీతం, దాని వర్తక లాభం యెహోవాకు అంకితం అవుతుంది. దానిని పోగు చేయడం, జమ చేయడం జరగదు. ఆ లాభం యెహోవా సన్నిధానంలో నివసించేవారి ఆహార సమృద్ధి కోసం, మేలిరకం బట్టలకోసం చేకూరుతుంది.