22
1 ✽“దర్శనం లోయ” విషయం దేవోక్తి:ఏమి వచ్చి మీరంతా మిద్దెలమీదికి ఎక్కిపోయారు?
2 అల్లరి✽తో నిండిపోయి కేకలు వినిపిస్తూ ఉన్న నగరమా!
ఉత్సాహమయమైన పట్టణమా! నీలో హతమైనవాళ్ళు
ఖడ్గంచేత హతం కాలేదు. యుద్ధంలో చనిపోలేదు.
3 ✽నీ నాయకులంతా కలిసి పారిపోయారు.
విల్లు ప్రయోగించకుండా వాళ్ళు పట్టబడ్డారు.
శత్రువులు ఇంకా దూరంగా ఉండగానే పారిపోయినా
మీలో దొరికిన వాళ్ళు పట్టబడ్డారు.
4 ✝అందుచేత “నా వైపునుంచి తిరుగండి.
నేను భోరున ఏడుస్తాను.
నా ప్రజలకు వచ్చిన నాశనం విషయం నన్ను ఓదార్చడానికి
ప్రయత్నం చేయకండి” అన్నాను నేను.
5 సేనలప్రభువు యెహోవా “దర్శనం లోయ”కు
ఒక రోజున నియమించాడు.
అది అల్లరితో, ఓటమితో, కలవరంతో కూడిన రోజు.
గోడలను పడగొట్టే రోజు. కొండవైపు✽ సహాయంకోసం అరిచే రోజు.
6 ఏలాం అంబులపొదిని తీసుకొని పదాతి బలాన్ని,
రథాలను, రౌతులను సమకూరుస్తూ ఉంది.
కీర్✽ పట్టణం డాలుపై గవిసెన తీసివేస్తూ ఉంది.
7 అందమైన నీ లోయల నిండా రథాలున్నాయి.
రౌతులు నీ నగరద్వారం దగ్గర బారులు తీరుస్తూ ఉన్నారు.
8 యూదానుంచి ముసుకును తీసివేయడం జరిగింది.
ఆ రోజున నీవు “అడవినగరు”లో ఉన్న ఆయుధాల కోసం చూశావు. 9 దావీదునగర ప్రాకారాలలో అనేక బీటలుండడం చూచి, క్రింది కోనేటిలో నీళ్ళను✽ మీరు సమకూర్చారు. 10 జెరుసలం ఇండ్లను లెక్కపెట్టి, నగరం గోడలను దృఢం చేయడానికి ఇండ్లను పడగొట్టారు. 11 ✽పాత కోనేటి నీళ్ళకోసం ఆ రెండు గోడలమధ్య చెరువు కట్టారు. అయితే దానిని చేయించినవాని వైపు మీరు చూడలేదు. చాలా కాలం క్రిందట దానిని నిర్మించినవాడంటే మీకు లక్ష్యం లేకపోయింది.
12 ✽ఆ రోజున మీరు ఏడ్చి రోదనం చేయాలని,
తల బోడిచేసుకొని గోనెపట్ట కట్టుకోవాలని సేనల ప్రభువు
యెహోవా మిమ్మల్ని పిలిచాడు.
13 అయితే మీరు “రేపు చచ్చిపోతాం, గనుక తిందాం,
త్రాగుదాం” అని చెప్పి, పశువులను వధిస్తూ, గొర్రెలను కోస్తూ,
మాంసం తింటూ, ద్రాక్షమద్యం త్రాగుతూ, సంతోషిస్తూ,
సంబరపడుతూ ఉన్నారు.
14 అయితే, నా చెవులకు సేనలప్రభువు
యెహోవా ఈ విషయం వెల్లడి చేశాడు:
“మీరు చచ్చిపోయేంతవరకు కూడా ఈ మీ అపరాధానికి
ప్రాయశ్చిత్తం కలగదు.
ఇది సేనల ప్రభువు యెహోవా చెప్పిన మాట.”
15 ✽సేనలప్రభువు యెహోవా అన్నాడు, “భవనంలో కార్యనిర్వాహకుడైన షెబ్నాదగ్గరికి వెళ్ళి అతడితో ఈ విధంగా చెప్పు: 16 ఇక్కడ నీ కోసం సమాధి తొలిపించుకోవడానికి నీకేం హక్కు ఉంది? ఇక్కడ నీకెవరు ఉన్నారు? ఎత్తయిన స్థలంలో సమాధి తొలిపించుకొంటున్నావు. బండలో నీకోసం విశ్రాంతి స్థలం తొలిపించుకొంటున్నావు. 17 ఇదిగో! బలాఢ్యుడు విసరివేసే విధంగా యెహోవా నిన్ను గట్టిగా పట్టుకొని విసరివేయ బోతున్నాడు. 18 ఆయన నిన్ను చెండులాగా చుట్టబెట్టి ఒక విశాలమైన దేశంలోకి విసరివేస్తాడు. అక్కడే నీవు చస్తావు. నీ ఘనమైన రథాలు అక్కడే ఉండిపోతాయి. నీవు నీ యజమాని ఇంటికి అవమానం తెచ్చిపెట్టేవాడివి. 19 ✽నిన్ను నీ పదవినుంచి తొలగించడం, నీ ఉద్యోగం✽నుంచి త్రోసివేయడం జరుగుతుంది.
20 ✽“ఆ రోజున నేను హిల్కీయా కొడుకూ నా సేవకుడూ అయిన ఎల్‌యాకీమును పిలుస్తాను, 21 ✽అతనికి నీ నిలువుటంగీని తొడిగించి, నీ నడికట్టు కట్టి, నీ అధికారం అతనికిస్తాను. అతడు జెరుసలం నివాసులకూ యూదా వంశీయులకూ తండ్రిగా ఉంటాడు. 22 ✽నేను దావీదు రాజవంశం తాళంచెవిని అతని భుజంమీద ఉంచుతాను. అతడు తెరిస్తే ఎవరూ మూయలేరు. అతడు మూసివేస్తే ఎవరూ తెరువలేరు. 23 ✽గట్టి చోట మేకు కొట్టినట్టు నేను అతణ్ణి మేకులాగా సుస్థిరమైన స్థానంలో ఉంచుతాను. అతడు తన తండ్రి వంశానికి ఘన సింహాసనంగా ఉంటాడు. 24 మేకు మీద వ్రేలాడవేసినట్టు అతని మీద తన తండ్రి వంశానికి చెందే ఘనత అంతటినీ వ్రేలాడవేస్తారు. దాని సంతానమంతా చెంబులు, సీసాలు, చిన్న చిన్న పాత్రలలాంటి వాళ్ళంతా అతనిమీద వ్రేలాడుతారు.
25 “సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, ఆ రోజు✽న గట్టి చోట కొట్టిన మేకు ఊడిపోతుంది✽. విరిగి పడుతుంది. దానిమీద వ్రేలాడే భారం నాశనం అవుతుంది.” ఇలా జరుగుతుందని యెహోవా అన్నాడు.